ASBL Koncept Ambience
facebook whatsapp X

హస్తం గూటికి రెజ్లర్లు...

హస్తం గూటికి రెజ్లర్లు...

హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటుచుసుకుంది. ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఇద్దరు రెజ్లర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరిద్దరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. హర్యానా ఎన్నికల నేపథ్యంలో అక్కడి పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ వీరిద్దరినీ పార్టీలో చేర్చుకున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలోని జాట్ సామాజిక వర్గం ఓట్లను తమ వైపు తిప్పుకొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ ఇద్దరు రెజ్లర్లు పార్టీలో చేరడం ద్వారా ఆ సామాజిక వర్గంలో ఆదరణ పెరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరడానికి ముందు రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఇండియన్ రైల్వేస్‌లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. జీవితంలో కీలకమైన ఈ దశలో రైల్వే ఉద్యోగాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నానని, తన రాజీనామాను సంబంధిత రైల్వే అధికారులకు అందజేశానన్నారు.

దేశానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించిన రైల్వే శాఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఆమె పేర్కొన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో ఆమె క్రీడాకోటాలో పొందిన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇద్దరు క్రీడాకారులు కాంగ్రెస్‌లో చేరడం తమకు ఎంతో గర్వ కారణమన్నారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. ఇదో గొప్ప రోజుగా చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. వినేష్ ఫొగట్ రెజ్లర్ల కుటుంబానికి చెందిన మహిళ అని.. ఆమెకు 9 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆమె ముందే తన తండ్రిని కాల్చి చంపారన్నారు. అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న ఓ మహిళ ఎంతో ధైర్యంగా ముందుకు అడుగులు వేశారన్నారు. రెజ్లర్లకు జరిగిన అన్యాయంపై గొంతు విప్పడమే కాకుండ.. రైతులు, అగ్నివీర్‌ల కోసం ఈ ఇద్దరు క్రీడాకారులు తమ గొంతు వినిపించారని కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇది సమాజం పట్ల వారికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తోందన్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :