BGT : కోహ్లీని ఊరిస్తున్న దిగ్గజాల రికార్డులు ...?
గత కొన్నాళ్ళుగా పరుగులు చేయడానికి నానా అవస్థలు పడుతున్న భారత సీనియర్ ఆటగాడు, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ... ఆస్ట్రేలియా గడ్డపై ఏ రేంజ్ లో రాణిస్తాడు అంటూ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో... పలు రికార్డులు కోహ్లీ ముందు దాసోహం కావడానికి సిద్దంగా ఉన్నాయి. ఆస్ట్రేలియాలో జరగనున్న సిరీస్‌లో విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ రికార్డును టార్గెట్ చేయవచ్చు అంటూ ఫ్యాన్స్ లెక్కలు వేస్తున్నారు. ఆస్ట్రేలియాలో 13 టెస్టులు ఆడిన కోహ్లి 54.08 సగటుతో 1,352 పరుగులు చేశాడు.
ఇందులో ఆరు సెంచరీలు మరియు నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 169. ఇక ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌ను అధిగమించడానికి, కోహ్లీ ఇంకా 458 పరుగులు చేయాల్సి ఉంది. ఆస్ట్రేలియన్ గడ్డపై అత్యధిక స్కోర్ చేసిన విదేశీ ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు. టెండూల్కర్ 20 మ్యాచ్‌లు ఆడి... 38 ఇన్నింగ్స్‌లలో 53.20 సగటుతో 1,809 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, ఏడు అర్ధసెంచరీలు ఉన్నాయి. సచిన్ కెరీర్ బెస్ట్ 241 కూడా ఆస్ట్రేలియాలోనే నమోదు చేసాడు.
విరాట్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఆరు సెంచరీలు చేశాడు. మరో మూడు సెంచరీలు చేస్తే... ఇంగ్లండ్‌కు చెందిన జాక్ హాబ్స్ చేసిన తొమ్మిది సెంచరీల రికార్డును సమం చేయవచ్చు. మరో సెంచరీ చేస్తే... వాలీ హమ్మండ్ చేసిన ఏడు సెంచరీల రికార్డును దాటే ఛాన్స్ ఉంది. మరో నాలుగు సెంచరీలు చేస్తే... ఆస్ట్రేలియాలో అత్యధిక సెంచరీలు చేసిన విదేశీ ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టిస్తాడు. అడిలైడ్ ఓవల్ మైదానంలో... 2011-12 ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ తొలి టెస్ట్ సెంచరీ చేసాడు. అక్కడి నుంచే కోహ్లీ టెస్ట్ జట్టులో కీ ప్లేయర్ అయ్యాడు.
ఈ మైదానంలో జరిగిన నాలుగు టెస్టుల్లో, అతను ఎనిమిది ఇన్నింగ్స్ లలో 63.62 సగటుతో మూడు సెంచరీలు, ఒక అర్ధసెంచరీతో 509 పరుగులు చేశాడు. ఇక్కడ అతని అత్యుత్తమ స్కోరు 141. ఇక్కడ.. మరో 102 పరుగులు చేస్తే బ్రయాన్ లారా రికార్డ్ ను బ్రేక్ చేయవచ్చు. ఇక్కడ లారా నాలుగు మ్యాచ్‌లు ఆడి... ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 76.25 సగటుతో రెండు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలతో 610 పరుగులు చేసాడు. మరో రెండు రోజుల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ యుద్ధం ప్రారంభం కానుంది. రెండో టెస్ట్ డే-నైట్ ఫార్మాట్‌లో జరగనుంది. డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్ ఓవల్‌లో డే అండ్ నైట్ టెస్ట్ ఆడనున్నారు.