ట్రంప్ గేమ్ చేంజర్.. శాంతికి బాటలు వేయగలడన్న పుతిన్ ..!
రష్యా అధ్యక్షుడు పుతిన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గెలిచిన తర్వాత ట్రంప్ నకు శుభాకాంక్షలు కూడా తెలిపేందుకు ఇష్టపడని పుతిన్.. ఇప్పుడు ఏకంగా ట్రంప్ ను తెలివైన వ్యక్తి, అనుభవజ్ఞుడిగా అభివర్ణించారు. అంతేకాదు.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో బైడన్ సర్కార్ పెంచిన ఉద్రిక్తతలను చల్లార్చే సత్తా ఉన్న వ్యక్తిగా తెలిపారు. ఈ అవకాశాన్ని ట్రంప్ వినియోగించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు.. శాంతి చర్చలకు మార్గాలు తెరిచి ఉంచామన్నారు పుతిన్. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ రిటైర్డ్ ..రిటైర్డ్ యుఎస్ జనరల్ కీత్ కెల్లాగ్‌ను రష్యా, ఉక్రెయిన్‌లకు ప్రత్యేక రాయబారిగా నామినేట్ చేయడం తెలివైన పనిగా అభివర్ణించారు పుతిన్.
మరోవైపు... డొనాల్డ్ ట్రంప్ భద్రతకు సంబంధించి రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఇంకా పూర్తిగా సురక్షితంగా ఉన్నారని తాను నమ్మడం లేదని పుతిన్ అన్నారు. అతని మీద పలుమార్లు హత్యాప్రయత్నాలు జరిగిన నేపథ్యంలో ట్రంప్ సురక్షితంగా ఉన్నారని తాను అనుకోవడం లేదని అన్నారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా, జూలైలో పెన్సిల్వేనియాలో డోనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి ప్రయత్నించారు. ఈ ఘటనలో ట్రంప్ గాయపడ్డారు. తృటిలో ప్రాణాల నుంచి తప్పించుకోగలిగారు. దీని తర్వాత, సెప్టెంబర్‌లో, ట్రంప్‌నకు చెందిన ఫ్లోరిడా గోల్ఫ్ కోర్స్‌పై రైఫిల్‌తో కాల్పులు జరిగాయి.
అమెరికా ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిందని కజకిస్థాన్ శిఖరాగ్ర సమావేశం అనంతరం రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. అమెరికా ఎన్నికల ప్రచార తీరు తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. ట్రంప్ ఇప్పటికీ సురక్షితంగా లేరని భావిస్తున్నాను అని ఆయన అన్నారు. అధ్యక్షుడు ట్రంప్ జాగ్రత్తగా ఉంటారని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతే కాకుండా, ట్రంప్ కుటుంబం, పిల్లలపై చేసిన విమర్శలపై పుతిన్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రష్యాలో ఇటువంటి ప్రవర్తన ఎప్పుడూ జరగదని అన్నారు.