ASBL Koncept Ambience
facebook whatsapp X

Revanth Reddy : ఏడాదిలో రేవంత్ రెడ్డి సాధించిందేంటి..?

Revanth Reddy : ఏడాదిలో రేవంత్ రెడ్డి సాధించిందేంటి..?

తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టి ఏడాది కావస్తోంది. గతేడాది డిసెంబర్ 7న ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ (Telangana) ఇచ్చిన పార్టీ తమదేనని కాంగ్రెస్ (Congress) చెప్పుకుంటుంది. వాస్తవానికి ఇది నిజం. అయినా తెలంగాణ ప్రజలు పదేళ్లపాటు ఆ పార్టీని అధికారానికి దూరంగా ఉంచారు. తెలంగాణ తెచ్చింది కేసీఆరేనని (KCR) భావించి ఆయన్ను పదేళ్లపాటు సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. చివరకు కాంగ్రెస్ పార్టీ పోరాడి అధికారాన్ని కైవసం చేసుకుంది. గతంలో సీనియర్లుగా చెలామణీ అయిన నేతలెందరినో కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని సీఎంగా నియమించింది కాంగ్రెస్ హైకమాండ్.

ఒకవిధంగా చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డే కారణం. అంతకుముందు పార్టీలో నేతలంతా ఎవరికివారే యమునా తీరే అన్నట్టు ఉండేవారు. ప్రతి ఒక్కరూ పీసీసీ (PCC) పీఠం కోసమో.. లేదంటే ముఖ్యమంత్రి కుర్చీ కోసమో కొట్లాడుకునేవారు. ఇవన్నీ గ్రహించిన రాహుల్ గాంధీ వీళ్లందరినీ కాదని టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి మొదట పీసీసీ పగ్గాలప్పగించారు. దీంతో అప్పటివరకూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్తబ్దత తొలగిపోయింది. అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పైన, కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకెళ్లారు. కేసీఆర్ కు సరైన మొగుడు దొరికాడంటూ కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ (BRS) లోని అసంతృప్తులు, కేసీఆర్ (KCR) పాలనపై విరక్తి చెందిన ప్రజలు భావించారు. దీంతో కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో గెలిపించారు.

పీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కుర్చీ అప్పగిస్తారా అనే సందేహాలుండేవి. అయితే రాహుల్ గాంధీ (Rahul Gandhi) పూర్తి మద్దతును రేవంత్ రెడ్డికి ఇచ్చారు. ఆయనకే సీఎం పీఠం ఇచ్చారు. దీంతో మిగిలిన కాంగ్రెస్ నేతలంతా సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా పార్టీ నేతలు తనపై ఎన్ని మాటలన్నీ అవన్నీ వదిలేసి కలుపుకుపోయారు. జగ్గారెడ్డి (Jagga Reddy), కోమటిరెడ్డి (Komatireddy) లాంటి నేతుల బహిరంగంగానే రేవంత్ రెడ్డిని విమర్శించారు. అయినా రేవంత్ రెడ్డి వాటిని పట్టించుకోలేదు. కోమటిరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. జగ్గారెడ్డి గెలిచి ఉంటే తప్పకుండా మంత్రి అయ్యేవారే..!

ఇక అధికారం చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి మొదట్లో ఫుల్ దూకుడు ప్రదర్శించారు. బీఆర్ఎస్ ను ఖాళీ చేస్తారనేలా ప్రజాప్రతినిధులను ఆకర్షించారు. పలువురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో లాక్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ ను కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయించారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 సీట్లను గెలుచుకుంది. ఇది ఏమాత్రం ఊహించలేదు. ఇంకా ఎక్కువ స్థానాలు వస్తాయనుకున్నారు. కానీ అలా జరగలేదు. బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాకపోవడమే కాంగ్రెస్ కు దక్కిన పెద్ద ఊరట.

రేవంత్ రెడ్డి తను ఇచ్చిన ఐదు గ్యారంటీల అమలుపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అధికారం చేపట్టిన మూడో రోజే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్లును అందించారు. రుణ మాఫీని విడతల వారీగా చేస్తున్నారు. మరోవైపు హైడ్రా ఏర్పాటు చేసి ఆక్రమిత చెరువులు, నాలాలను ఖాళీ చేయిస్తున్నారు. ఇది కొన్ని విమర్శలకు తావిచ్చింది. మరోవైపు మూసీ పునరుజ్జీవం చేస్తామని ప్రకటించారు. నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తున్నారు. దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

మొత్తంగా ఏడాదిలో రేవంత్ పాలనపై పూర్తి స్థాయి సంతృప్తి అయితే లేదు. జనాలు ఇంకా ఇంకా ఏదో కావాలని కోరుకుంటున్నారు. అలాగని బీఆర్ఎస్ పైన పాజిటివ్ వాతావరణం ఏర్పడిందా అంటే లేదనే చెప్పాలి. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన పాలనను ఇప్పటికీ జనం మర్చిపోలేదు. కాబట్టి ఏడాదిలోపే రేవంత్ పాలనను ప్రామాణికంగా తీసుకునేందుకు జనం సిద్ధంగా లేరు. ఏదో చేయాలనే పట్టుదల మాత్రం రేవంత్ రెడ్డిలో కనిపిస్తోంది. బహుశా అవన్నీ పూర్తయితే అప్పుడు రేవంత్ పనితీరుపై ఒక అంచనాకు వచ్చే వీలుంటుంది. ఇందుకు మరికొంత సమయం అవసరం..!

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :