Adani – Chandrababu : అదానీ ఇష్యూలో చంద్రబాబు ఏం చేయబోతున్నారు..?
కొన్ని రోజులుగా అదానీ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తోంది. ఆయన అవినీతి, అక్రమాలతో వ్యాపారాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. ఇందుకు మోదీ ప్రభుత్వం పూర్తిస్థాయి అండదండలు అందిస్తోందని మండిపడుతోంది. ఇప్పుడు ఏకంగా అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఆయుధం దొరికినట్లయింది. అదానీ వ్యవహారంలో నాటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా పాత్రధారి అని తేలడంతో ఏపీలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీన్ని పూర్తిస్థాయిలో వాడుకుంటుందని అందరూ అనుకున్నారు. ఈ దెబ్బతో జగన్ కు రాజకీయ సమాధి ఖాయమనుకున్నారు. కానీ పరిస్థితులు అలా కనిపించట్లేదు.
ఏపీ ప్రభుత్వం సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు చేసేలా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను అదానీ ఒప్పించారని.. ఇందుకోసం జగన్ కు రూ.1750 కోట్లు లంచంగా ఇవ్వజూపారని అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఒప్పందాన్ని అడ్డు పెట్టుకుని అదానీ అమెరికన్ పెట్టుబడిదారుల నుంచి ఇన్వెస్ట్ చేయించుకోవడం ద్వారా వాళ్లను మోసం చేశారని కేసు పెట్టింది. ఇవన్నీ ఆరోపణలే తప్ప నిజాలు కావని.. చట్టప్రకారం వీటిని ఎదుర్కొంటామని అదానీ గ్రీన్ ఎనర్జీ వెల్లడించింది. అయితే అమెరికన్ ప్రభుత్వం ఇలాంటి వ్యవహారాలను ఆషామాషీగా తీసుకోదు. కచ్చితంగా ఆధారాలు ఉంటేనే కేసుల వరకూ వెళ్తుంది. అరెస్టులకు సమన్లు జారీ చేస్తుంది. అదానీ అరెస్టుకు కూడా సమన్లు జారీ చేసింది.
ఇదంతా అమెరికా – అదానీ వ్యవహారం అని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే ఇందులో కీలక పాత్రధారి వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని FIRలో అమెరికా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ స్పష్టంగా పేర్కొంది. దీంతో ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని, సెకీతో ఏపీ సర్కార్ చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. చివరి రోజు అసెంబ్లీలో అదానీ – జగన్ డీల్ పైన కూడా చర్చ జరిగింది. న్యాయనిపుణలతో చర్చించి దీనిపై ముందుకు వెళ్తామని చంద్రబాబు ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఈ అంశంపై ముందడుగు వేసేందుకు ఎన్డీయే కూటమి సర్కార్ అంత ఉత్సాహంగా లేదని అర్థమవుతోంది.
వాస్తవానికి సెకీతో డీల్ ద్వారా అదానీకి మేలు చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ విమర్శించింది. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఆ డీల్ ను రద్దు చేసేందుకు సాహసించట్లేదు. పైగా అదానీతో పవర్ అగ్రిమెంట్ ను వచ్చే ఏడాది వరకూ పొడిగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డీల్ రద్దు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్న సమయంలో పొడిగించడమేంటనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఇందులో నిజం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో ముందుకెళ్తే జగన్ ను ఇరుకున పెట్టే అవకాశం ఉన్నా.. అదానీతో ముడిపడిన వ్యవహారం కాబట్టి ముందుకు వెళ్లలేకపోతున్నారని తెలుస్తోంది. అమెరికన్ కోర్టులు అదానీని దోషిగా తేల్చితే అప్పుడు సహజంగానే ఏపీ ప్రభుత్వం డీల్ రద్దు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాక.. జగన్ కూడా దోషిగా నిలబడతారు. అప్పుడు సర్కార్ కు చర్యలు తీసుకునే అవకాశం సహజంగానే కలుగుతుందని.. అంతవరకూ వేచి చూద్దామని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా కోర్టులు ఇలాంటి వాటిని నాన్చవని.. కచ్చితంగా త్వరగానే తేల్చేస్తాయని భావిస్తున్నారు. కాబట్టి తొందరపడాల్సిన అవసరం లేదనే ఆలోచనలో చంద్రబాబు టీం ఉన్నట్టు సమాచారం.