మరాఠా నూతన సీఎం ఎవరు?
మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలుపులో ఆముగ్గురిదే కీలక పాత్ర . ఎవరెన్ని అనుమానాలు పెట్టుకున్నా.. లక్ష్యాన్ని సాధించడంలో తమదైన పాత్ర పోషించారు. అయితే ఆముగ్గురికి సీఎం పదవిపై ఆశ ఉంది. వారు ప్రస్తుత సీఎం ఏక్ నాథ్ షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్. అయితే ఇప్పుడు సీన్ ను బట్టి చూస్తే.. ఫడ్నవీస్ కు సీఎంగా అవకాశం దక్కేలా కనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీకి సొంతంగా 120కి పైగా సీట్లు దక్కాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మహాయుతి కూటమిలో సీఎం పదవి కోసం పోటీ మొదలయ్యింది. 120కి పైగా సీట్లు సాధించిన తమకే ముఖ్యమంత్రి పదవి కావాలని బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు.
ముంబైలో ఫడ్నవీస్ నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఫడ్నవీస్‌నే సీఎం చేయాలన బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఫడ్నవీస్ సీఎం అవుతారని అన్నారు బీజేపీ నేత ప్రవీణ్ దారేకర్ అయితే ఏక్‌నాథ్‌షిండే తీసుకునే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ప్రచారంలో షిండే నే సీఎం అభ్యర్ధి అని బీజేపీ నేతలు ప్రకటించారని, అందుకే ఆయనే మరోసారి సీఎం అవుతారని శివసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మరాఠా ఓటు బ్యాంక్‌ను మహాయుతి కూటమి వైపు తిప్పడంలో షిండే కీలకపాత్ర పోషించారు. అంతేకాకుండా మరాఠా రిజర్వేషన్ల పోరాట సమితి నేత మనోజ్ ఝారంగి ప్రభావం తమ కూటమి వైపు పడకుండా వ్యూహాన్ని రచించారు షిండే.
వాస్తవానికి ఎన్నికల కంటే ముందే షిండేను సీఎం చేసి మహా వికాస్ అఘాడి కూటమిపై బీజేపీ గుగ్లీ ప్రయోగించింది. మరాఠా ఓటు బ్యాంక్‌తో పాటు శివసేన ఉద్దవ్ వర్గాన్ని బలహీనపర్చడంలో షిండే కీలక పాత్ర పోషించారు. అయితే సీఎం కావాలన్న అజిత్ పవార్ కల మాత్రం.. ఈసారి కూడా ఫలించే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే.. అయితే ఫడ్నవీస్, లేదంటే షిండే కు అవకాశం దక్కుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో మరోసారి డిప్యూటీ సీఎంగానే పవార్ ఉండే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈసారైనా తమ వర్గానికి తగిన న్యాయం జరగాలన్నది అజిత్ వర్గీయుల భావన. మరి కేబినెట్ కూర్పులో అదెలా ఉంటుందన్నది తెేలనుంది.