మహ సీఎం ఎంపికపై నాటకీయ పరిణామాలు...
మహారాష్ట్రలో మహాయుతి కూటమి తిరుగులేని విజయం సాధించింది. ఇండియా కూటమికి విపక్ష హోదా లేకుండా చేసింది.అంతవరకూ బాగానే ఉంది కానీ.. సీఎం ఎంపికలో మాత్రం తర్జనభర్జన పడుతోంది. అత్యధిక స్థానాలు సాధించిన బీజేపీ.. తమ పార్టీ సీనియర్ నేత ఫడ్నవీస్ ను సీఎంను చేయాలని భావిస్తోంి.‘బిహార్ ఫార్ములా’ ప్రకారం.. ఏక్‌నాథ్ శిండేను కొనసాగించాలని శివసేన పట్టుబడుతోంది. దీంతో పీటముడి పడినట్లు తెలుస్తోంది.
శిండేను కొనసాగించాలి : శివసేన
బిహార్ ఫార్ములా ప్రకారం.. ఏక్‌నాథ్ శిండేనే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని శివసేన ఎంపీ నరేశ్ మస్కే కోరారు. మిత్రపక్షాలను ఉపయోగించుకుని, చివరకు ఎటువంటి ముఖ్యమైన పదవి ఇవ్వకుండా బీజేపీ.. వాటి అడ్డు తొలగించుకుంటుందని ప్రతిపక్షాలు తరచూ విమర్శిస్తుంటాయని, దీనికి చెక్ పెట్టేందుకు శిండే ముఖ్యమంత్రి కావాలని ఆయన పేర్కొన్నారు. బిహార్‌లో జేడీయూకు తక్కువ సీట్లు వచ్చినా మిత్ర ధర్మాన్ని పాటించి నీతీశ్‌కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఉమ్మడి నిర్ణయమే: ఎన్సీపీ
ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఎటువంటి ఫార్ములా లేదని, ఆ దిశగా ఎటువంటి చర్చలూ జరగలేదని ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ స్పష్టం చేశారు. మహాయుతి పార్టీలు ఉమ్మడిగా చర్చించుకుని నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. సీట్లు తక్కువగా రావడంతో ఆయన ప్రస్తుతం సీఎం రేసు నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది.
రాష్ట్రపతి పాలన రాదు!
మహారాష్ట్ర 14వ అసెంబ్లీ పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. దీంతో ఆలోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుందన్న వార్తలొచ్చాయి. వాటిని అధికారులు ఖండించారు. అటువంటి పరిస్థితి రాదని స్పష్టం చేశారు. ఆదివారమే కొత్తగా ఎన్నికైన సభ్యుల పేర్లతో గెజిట్‌ను గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు ఎన్నికల సంఘం అధికారులు అందజేశారు. అంటే 15వ అసెంబ్లీ అమల్లోని వచ్చినట్లేనని అధికారులు తెలిపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 73 ప్రకారం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి అసెంబ్లీ మనుగడలో ఉన్నట్లేనని వివరించారు.