ASBL Koncept Ambience
facebook whatsapp X

ప్రతిపక్ష హోదా కోసం పట్టుదల ఎందుకు జగన్... ప్రజాసమస్యలపై ఫోకస్ పెట్టాలి కదా....!

ప్రతిపక్ష హోదా కోసం పట్టుదల ఎందుకు జగన్... ప్రజాసమస్యలపై ఫోకస్ పెట్టాలి కదా....!

ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేవరకు అసెంబ్లీకి వెళ్లబోనంటూ వైసీపీ అధ్యక్షులు, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై విమర్శల వర్షం కురుస్తోంది. అధికార కూటమి అయితే మామూలుగా కాదు.. ఏకంగా కౌంటర్స్ కురిపిస్తోంది. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు కూీడా.. వారికి బాధ్యత లేదు.. మనకి ఉండాలి కదా అని ఎమ్మెల్యేల వర్క్ షాప్ లో అన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అయితే సభకు వెళ్లకుంటే ఇంకెందుకు పదవి రాజీనామా చెయ్ అంటూ డిమాండ్ సైతం చేశారు. జగన్ నిర్ణయం ఓ విధంగా ప్రజా తీర్పును అవమానించమేనన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టాలని లక్షల మంది ఆశిస్తారు. కానీ ఐదేళ్లకోసారి రాష్ట్ర ప్రజలు నియోజకవర్గం నుంచి ఒకరిని ఎన్నుకుని తమ ప్రతినిధిగా శాసనసభకు పంపిస్తారు.

ప్రజా సమస్యలను లేవనెత్తి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి విపక్షాలకు అసెంబ్లీ ఓ వేదికగా ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో తాను శాసనసభ సమావేశాలకు వెళ్లబోనని, మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చు. కానీ అసెంబ్లీ వేదికపై రాష్ట్ర ప్రజలంతా చూస్తుండగా ప్రభుత్వాన్ని ప్రశ్నించి, ప్రజల తరపున గొంతు వినిపించే అవకాశం కేవలం ఒక ఎమ్మెల్యేకు మాత్రమే దక్కుతుంది.

ఈ క్రమంలో తాము అసెంబ్లీ సమావేశాలకు వెళ్లబోమని జగన్ ప్రకటించడం ద్వారా ఓ చక్కటి అవకాశాన్ని వైసీపీ జార విడుచుకుందనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. మరోవైపు...అసెంబ్లీకి వెళ్లకూడదన్న జగన్ నిర్ణయం.. అధికార కూటమికి అందివచ్చిన వరంలా మారింది. విపక్షం లేకుండా హాయిగా సభ నడిపేసుకుంటోంది కూటమి సర్కార్. వారు ఏదనుకుంటే అది చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అందులో కొన్ని కీలక బిల్లులు కూడా ఉండి ఉండవచ్చు. వాటిపై సర్కార్ ను నిగ్గదీసే అత్యున్నత అవకాశాన్ని జగన్ కోల్పోయారన్నది నిర్వివాదాంశం. ఇదే అంశం.. ఇప్పుడు సొంతపార్టీలోనూ చర్చనీయాంశమైంది. శాసనసభ సమావేశాలకు వెళ్లకూడదని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తెలివి తక్కువ పనిగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రతిపక్ష నేత హోదా అనేది సంఖ్యా బలానికి సంబంధించిన అంశమని, తమకు సంఖ్యాబలం ఉన్నా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే నిరసన తెలిపాల్సిన జగన్.. సంఖ్యాబలం లేకపోయినా.. గత సంప్రదాయాలకు భిన్నంగా తనకు ప్రతిపక్ష హోదా కావాలని అడగడం, ఈ కారణంగా శాసనసభ సమావేశాలకు వెళ్లనని చెప్పడం సహేతుక కారణం కాదనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుని శాసనసభ సమావేశాలకు వెళ్లాలని సొంత పార్టీ నేతలతో పాటు పలువురు రాజకీయ విశ్లేషకులు, సామాన్య ప్రజలు సైతం కోరుతున్నారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలనే జగన్ నిర్ణయం చారిత్రక తప్పిదమవుతుందనే చర్చ జరుగుతోంది.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye Radha Spaces
Tags :