ASBL Koncept Ambience
facebook whatsapp X

ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ కృషితో నాగన్న బావికి పునర్వైభవం...

ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ కృషితో నాగన్న బావికి పునర్వైభవం...

మరుగున పడిన వారసత్వ సంపదకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ రావు కృషి వల్ల పునరుజ్జీవం దక్కింది. శిథిలావస్థకు చేరిన చారిత్రక కట్టడం తిరిగి పూర్వవైభవం సాధించింది. లింగంపేట మండల కేంద్రంలో గల పురాతన కట్టడమైన నాగన్న బావి మరమ్మతులు చేసుకుని అందంగా తయారై ప్రారంభోత్సవం చేసుకుంది. 

గుజరాత్‌ లో రాణీకి వావ్‌ ప్రపంచానికి సుపరిచితం, ప్రపంచవారసత్వ నిర్మాణంగా యునెస్కో గుర్తించిన ఈ కట్టడం ఇప్పటికీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నది. భూగర్భంలోకి తొలుచుకుంటూ నిర్మించిన ఈ బావి దానికదే ప్రత్యేకం. అచ్చం అలాంటి నిర్మాణమే తెలంగాణలో కూడా ఉంది. కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఉన్న ఈ అద్భుత నిర్మాణం ఆదరణకు నోచక మరుగునపడింది.

ఈ మెట్ల బావి కళా నైపుణ్యం అబ్బురపరుస్తుంది. బావి అడుగు నుంచి పైభాగం వరకు అందమైన శిలలతో నిర్మించారు. పైనుంచి అడుగు భాగం వరకు బావికి నలువైపులా మెట్లున్నాయి. ప్రధాన మార్గాన్ని పడమర దిశలో ఏర్పాటు చేశారు. ఉపరితలం నుంచి 20 అడుగులకు ఒక అంతస్తు చొప్పున ఐదు అంతస్తులు అంటే దాదాపు వంద అడుగుల లోతు ఈ బావిని నిర్మించారు. బావిలోని శిలలపై శంఖుచక్రా లు, పుష్పాలు... ఇలా రకరకాల శిల్పాలు చెక్కించా రు. బావికి నలువైపులా సుందర దృశ్యాలున్నాయి. బావి పైభాగంలో చిన్నచిన్న కంకర రాళ్ల, డంగు సున్నంతో పైకప్పు వేశారు. తూర్పు భాగంలో బావి నుంచి నీటిని పైకి చేదడానికి మోటబావి లాంటి నిర్మాణం ఉంది. ఇక్కడి నుంచి నీటిని కాలువ ద్వారా తరలించి పంటలకు చేరేలా ఏర్పాట్లు ఉన్నట్టు తెలుస్తోంది. సాధారణంగా చూస్తే బావి నిర్మాణం ఒక నీళ్లబావిలా కనిపిస్తుంది మెట్ల వరుసలు, రహస్య ద్వారాలు, ఆహ్లాదకరంగా సేదతీరేందుకు విశాలమైన గదులతో పలు అంతస్తులుగా దీనిని నిర్మించారు.

ఈ కట్టదానికి తూర్పు, పడమర, ఉత్తర దిశలో ఆరు రహస్య ప్రవేశ ద్వారాలు ఉన్నప్పటికీ ప్రధాన ద్వారం మినహా ఎటుచూసినా మూసి ఉన్నట్టే కనిపిస్తుంటుంది. రహస్య ద్వారంగుండా లోపలికి వెళితే సరాసరి దిగుడుబావి రెండో అంతస్థులోకి చేరుకుంటారు. అక్కడి నుంచి మరింత కిందికి దిగేందుకు మెట్లు ఉన్నాయి. ఇలా ఎంతో అందంగా, అబ్బురపరిచేలా దీని నిర్మాణాలు కనిపిస్తాయి. దీంతోపాటు ద్వారంవద్ద స్వాగత తోరణంలాగా భారీ స్థూప నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. వీటిపై వైష్ణవ సంప్రదాయంలోని శంఖము, చక్రము వాటి మధ్య వృషభం గుర్తులు చెక్కారు. వీటికి ఇరువైపులా పుష్పాలంకరణలు అద్భుతంగా చెక్కి ఉన్నాయి. పాపన్నపేట సంస్థాన కాలంలో జాక్సాని నాగన్న అనే వ్యక్తి దీనిని 18వ శతాబ్దంలో నిర్మించాడని స్థానిక కైఫీయత్తులో లిఖించబడింది. 

ఎమ్మెల్యే మదనమోహన్‌ కృషితో పూర్వవైభవం 

గత ప్రభుత్వాలు, అధికారయంత్రాంగం చారిత్రక నేపథ్యం ఉన్న ఈ బావిని పరిరక్షించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో చారిత్రక కట్టడం శిథిలావస్థకు చేరింది. నాగన్నబావి దుస్థితిని, వారసత్వ సంపద దురావస్థను పత్రికలు వెలుగులోకి తీసుకువచ్చాయి. దీనికి స్పందించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ రావు ఈ బావికి పునర్వైభవం తీసుకువచ్చేందుకు నిధులను కేటాయించి, అధికారులతో కలిసి కృషి చేశారు. ఇప్పుడు అందంగా తయారైన ఈ బావిని ఇటీవలనే మదన్‌ మోహన్‌ రావు ప్రారంభించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి, ఎస్పీ సింధు శర్మ, రెయిన్‌ వాటర్‌ ప్రాజెక్టు ప్రతినిధి కల్పనా రమేశ్‌, ఆర్డీవోలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు నాగన్నగారి బావి అభివృద్ధికి సహకరించాలని కోరిన వెంటనే రూ. 10 లక్షలు మంజూరు చేశానన్నారు. ప్రాచీన కట్టడాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి పరంపర ఫౌండేషన్‌ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. 18వ శతాబ్దంలో పాపన్నపేట సంస్థానాధీశులు, సర్సింహారెడ్డి, లింగమ్మ దేశాయి దంపతుల హయాంలో నాగన్న అనే శిల్పి బావి నిర్మాణం చేపట్టినట్లు చరిత్ర చెబుతోందన్నారు. నాగన్నగారి అభివృద్ధికి గత కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ చేసిన కృషిని అభినందించారు. ఆయన శ్రమ నేడు ఫలించిందని, దీనిని స్థానికులు కాపాడుకోవాలని పేర్కొన్నారు. నాగన్నగారి బావి చరిత్రను పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావుకు వివరించానన్నారు. ఆయన త్వరలో బావిని సందర్శిస్తారన్నారు. బావి చరిత్రను సామాజిక మాధ్యమాల ద్వారా యువత ప్రచారం చేయాలని కోరారు.

నాగన్నగారి బావికి పూర్వవైభవం తీసుకురావడానికి ఇన్ఫోసిస్‌ సంస్థ, రెయిన్‌ వాటర్‌ ప్రాజెక్టు ప్రతినిధులు రెండేళ్లుగా శ్రమిస్తున్నారని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ పేర్కొన్నారు. వారి కృషి అభినందనీయమన్నారు. బావి గోడలపై ఉన్న చిత్రాలు చిత్రకళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. భూగర్భ జలాలు అభివృద్ధి చెందడానికి నాగన్నగారి బావి దోహదపడుతుందన్నారు. బావిలో 30 లక్షల లీటర్ల నీరు నిల్వ ఉంటుందన్నారు. లింగంపేట మండల కేంద్రాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని కలెక్టర్‌ ప్రకటించారు. బావి ప్రారంభోత్సవం సందర్భంగా చరిత్రను వివరిస్తూ కళాకారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :