ASBL Koncept Ambience
facebook whatsapp X

రాష్ట్ర శాసనసభలు మరియు పార్లమెంటులో మహిళల భాగస్వామ్యం వృద్ధి చెందాలి : అగ్రశ్రీ జాతీయ సదస్సు వక్తల అభిభాషణ

రాష్ట్ర శాసనసభలు మరియు పార్లమెంటులో మహిళల భాగస్వామ్యం వృద్ధి చెందాలి : అగ్రశ్రీ జాతీయ సదస్సు వక్తల అభిభాషణ

తిరుపతి: 'పంచాయతీ నుండి పార్లమెంటు వరకు మహిళా సాధికారత: విజయాలు, సవాళ్లు మరియు నిర్ణయాత్మక ప్రక్రియలో భాగస్వామ్యం' అనే అంశంపై 2 రోజుల జాతీయ సదస్సు భారత గ్రామీణ అధ్యయనం మరియు పరిశోధన అకాడమీ (అగ్రశ్రీ) ఆధ్వర్యంలో, న్యూఢిల్లీలోని భారత సామాజిక విజ్ఞాన శాస్త్రాల సంస్థ సౌజన్యంతో అక్టోబర్ 17 మరియు 18వ తేదీలలో తిరుపతిలోని హోటల్ కళ్యాణ్ రెసిడెన్సీ వేదిక సమావేశ మందిరంలో నిర్వహింపబడింది.

ముఖ్యఅతిథి శ్రీ సి. నారాయణ స్వామి, 5వ కర్ణాటక రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ మరియు మాజీ పార్లమెంటు సభ్యుడు (లోక్‌సభ), బెంగళూరు, జాతీయ సదస్సును ప్రారంభించారు.  తన ప్రారంభోపన్యాసంలో, పంచాయతీల నుండి పార్లమెంటు వరకు మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని మరియు గ్రామ, తాలూకా, జిల్లా మరియు జాతీయ స్థాయిలలో పరిపాలనా వ్యవహారాలలో మహిళలు భాగస్వామ్యం వహించి, అధిక సంఖ్యలో పాల్గొనేలా మరిన్ని సంస్కరణలు చేపట్టాలని అన్నారు.

ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించిన కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ వెంకట్రావ్ వై. గోర్పడే మాట్లాడుతూ మంచి పాలన అందించడంలో మెరుగైన పనితీరు ఆధారంగా పంచాయతీరాజ్ సంస్థలకు తగిన నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదించారు.

ప్రతి రాజకీయ పార్టీ మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలని, అన్ని విషయాల్లో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని గౌరవ అతిధి, జాతీయ మహిళా సంఘం మాజీ సభ్యురాలు, బీజేపీ సీనియర్ నాయకురాలు శ్రీమతి కె. శాంత రెడ్డి ఉద్ఘాటించారు.  తరువాత, శ్రీమతి శాంత రెడ్డి, అగ్రశ్రీ ప్రచురించిన జాతీయ సదస్సు పరిశోధనా పత్రాల పుస్తకాన్ని విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు మరియు కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకురాలు శ్రీమతి కె. ప్రమీల జాతీయ సదస్సు పరిశోధనా పత్రాల పుస్తక మొదటి ప్రతిని స్వీకరించిన తర్వాత మాట్లాడుతూ, సమాజంలో మహిళలు అన్ని విషయాల్లో ముందుండాలని, రాష్ట్ర శాసన సభలు, భారత పార్లమెంట్ లో వారి ప్రమేయం ఎక్కువగా ఉన్నప్పుడే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.

సాయంత్రం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో, అంతర్జాతీయ నోనీ సైన్స్ సంఘం అధ్యక్షుడు మరియు దేశంలోని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పి రత్నం 'భారతదేశంలో వ్యవసాయ రంగ సంస్కరణలో రాజీవ్ గాంధీ పాత్ర : ఆహార భద్రత, పౌష్టికాహారం, జీవనోపాధి' అనే అంశంపై 19వ రాజీవ్ గాంధీ స్మారక ఉపన్యాసం చేశారు.

19వ రాజీవ్ గాంధీ స్మారక ఉపన్యాసం మరియు రాజీవ్ గాంధీ జాతీయ అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ మాట్లాడుతూ, ఆ రోజున రాజీవ్ గాంధీ చేపట్టిన సంస్కరణలు భారతదేశంలోని అనేక  ప్రభుత్వాలకు సుపరిపాలన, సమాచార సాంకేతికత, సుస్థిర అభివృద్ధికి ఒక బెంచ్‌మార్క్ అని కొనియాడారు.

తదుపరి, అంతర్జాతీయ నోని సైన్స్ సంఘం అధ్యక్షుడు మరియు ప్రముఖ భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పి రత్నం కు రాజీవ్ గాంధీ అత్యుత్తమ నాయకత్వ జాతీయ పురస్కారాన్ని; కేరళలోని వయనాడ్ జిల్లా పంచాయతీ అధ్యక్షుడు శ్రీ శంషాద్ మరక్కర్ కి, రాజీవ్ గాంధీ ఉత్తమ జిల్లా పంచాయతీ జాతీయ పురస్కారాన్ని; ఒడిశాలోని హింజిలికట్ బ్లాక్ పంచాయతీ అధ్యక్షురాలు శ్రీమతి  సరస్వతి సేథి కి, రాజీవ్ గాంధీ ఉత్తమ తాలూకా పంచాయతీ జాతీయ పురస్కారాన్ని; కర్ణాటకలోని హుల్కోటి గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు శ్రీమతి  నాగరత్న ఎస్. బలిహల్లిమఠ్ కి, రాజీవ్ గాంధీ ఉత్తమ గ్రామ పంచాయతీ జాతీయ పురస్కారాన్ని; మరియు తెలంగాణ రాష్ట్రంలోని మరియాపురం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ శ్రీ అల్లం బాలి రెడ్డి కి, రాజీవ్ గాంధీ  గ్రామ స్వరాజ్ జాతీయ పురస్కారాన్ని ముఖ్య అతిథి డాక్టర్ చింతామోహన్ మరియు విశిష్ట అతిథి శ్రీ నారాయణ స్వామి లు బహూకరించారు.

ఈ సందర్భంగా అగ్ర శ్రీ సంస్థ ప్రచురించిన రాజీవ్ గాంధీ జాతీయ పురస్కారాల విశేష సంచికను ముఖ్య అతిథి డాక్టర్ చింతామోహన్ విడుదల చేశారు.

ప్రొఫెసర్ ఎం. గోపీనాథ్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్), హైదరాబాద్, తెలంగాణ;  ప్రొఫెసర్ రాయదుర్గం నారాయణ, శివాజీ యూనివర్శిటీ న్యాయశాస్త్ర అనుబంధ ప్రొఫెసర్, కొల్హాపూర్, మహారాష్ట్ర;  ప్రొఫెసర్ (శ్రీమతి) టి. సీతా కుమారి, ప్రొఫెసర్ ఆఫ్ లా మరియు ప్రొఫెసర్ (శ్రీమతి) కిరణ్ ప్రసాద్, కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం ప్రొఫెసర్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి, ఆంధ్రప్రదేశ్ మరియు ప్రొఫెసర్ (శ్రీమతి) పద్మావతి, సోషియాలజీ ప్రొఫెసర్, శాతవాహన విశ్వవిద్యాలయం, కరీంనగర్, తెలంగాణా వారు జాతీయ సదస్సు 5 సాంకేతిక సమావేశాలకు అధ్యక్షులుగా వ్యవహరించారు.

వివిధ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలకు ప్రాతినిధ్యం వహించిన రిసోర్స్ పర్సన్‌లు మరియు పంచాయతీ రాజ్ సంస్థలకు పెద్ద సంఖ్యలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు, 2 రోజుల సెమినార్‌లో జరిగిన 5 సాంకేతిక సమావేశాల్లో వారి వారి పత్రాలు మరియు అభిప్రాయాలను సమర్పించారు. సాంకేతిక సమావేశాల రిపోర్టర్‌లు  సంగ్రహ సారాంశాల ప్రక్రియలను నివేదించారు.

రెండో రోజు జాతీయ సదస్సు ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉప-కులపతి ఆచార్య (శ్రీమతి) వి. ఉమ పాల్గొన్నారు. ఆమె కీలక ఉపన్యాసం చేస్తూ, పంచాయతీ నుంచి పార్లమెంట్‌ వరకు మహిళా సాధికారత పూర్తిస్థాయిలో విజయవంతం కావాలంటే అన్ని విధానపరమైన అంశాల్లో మహిళా నాయకత్వ లక్షణాలు, పాలనా నిర్ణయాధికారంలో చొరవ అవసరమన్నారు.  ఇంకా, సుస్థిర అభివృద్ధి మరియు సమ్మిళిత పాలనను సాధించడానికి మరియు విభిన్న రంగాలలో తమ మహిళా సాధికారతను సాధించడానికి తమను తాము సిద్ధం చేసుకోవటానికి మహిళలు అన్ని విషయాలలో ముందుండాలని ప్రొఫెసర్ ఉమ పిలుపునిచ్చారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రొఫెసర్‌ ఎం. గోపీనాథ్‌ రెడ్డి, సీనియర్‌ కన్సల్టెంట్‌, సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌), హైదరాబాద్‌, మాట్లాడుతూ మహిళా సాధికారత గ్రామస్థాయిలోనే ప్రారంభం కావాలని, అది పటిష్టం కావడానికి అనేక అవకాశాలున్నాయన్నారు.

2-రోజుల జాతీయ సెమినార్ ముగింపులో, టెక్నికల్ సెషన్స్ చైర్మన్లు, రిసోర్స్ పర్సన్లు మరియు పంచాయతీ రాజ్ సంస్థల ఎన్నికైన ప్రతినిధులు రాష్ట్ర శాసనసభలు మరియు భారత పార్లమెంటులో మహిళలు నిర్ణయాత్మక ప్రక్రియలో మహిళా విధాన రూపకర్తలుగా, సమాన భాగస్వాములుగా పాల్గొనడానికి 9 సిఫార్సులను ఏకగ్రీవంగా ఆమోదించి, వాటిని కేంద్ర ప్రభుత్వ మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలకు నివేదించడానికి తీర్మానించారు.

రెండు రోజుల జాతీయ సదస్సు కన్వీనర్ మరియు అగ్రశ్రీ సంస్థ సంచాలకుడు డాక్టర్ డి. సుందరరామ్ నిర్వహణ బాధ్యతలతో పాటు చర్చల నిర్వహణకు అనుసంధాన కర్తగా వ్యవహరించారు.

డాక్టర్ డి. సుందరరామ్
సంచాలకుడు, అగ్రశ్రీ, తిరుపతి.
www.agrasri.org.in

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :