విజయమ్మకు వైసీపీ నేతల కౌంటర్... జరుగుతున్న పరిణామాలపై బంధువులు, అభిమానుల ఆందోళన
వైఎస్ జగన్, షర్మిల ఆస్తుల పంపకం విషయమై వారి తల్లి వైఎస్ విజయమ్మ రాసిన బహిరంగ లేఖకు వైసీపీ ఘాటైన కౌంటర్ ఇచ్చింది. బాధితురాలైన షర్మిల పక్షాన నిలబడ్డానని విజయమ్మ ఆ లేఖలో ప్రస్తావించారు. అయితే బాధితుడే వైఎస్ జగనే అని వైసీపీ తేల్చి చెప్పింది. కోర్టు కేసులతో జగన్ పోరాడుతున్నారని, దాని ఫలితాలపై కనీస స్పృహ లేకుండా షర్మిల ప్రవర్తిస్తున్నారని వైసీపీ ఆవేదన వ్యక్తం చేసింది. విజయమ్మ లేఖలో జగన్ బెయిల్ రద్దు కోసం సాగిస్తున్న కుట్రల గురించి ఎందుకు ప్రస్తావించలేదని వైసీపీ ప్రశ్నించింది.
షర్మిల భావోద్వేగాలు, ఒత్తిళ్లకు లొంగి సరస్వతి కంపెనీ షేర్ల సర్టిఫికెట్లు పోయాయంటూ, జగన్ సంతకాలు లేకుండానే షేర్లు బదిలీ చేయడం నేరం కాదా? అని వైసీపీ నిలదీసింది. విజయమ్మ చెబుతున్నట్టు, నిజంగా ఆస్తుల పంపకం జరగకుంటే, హక్కుగా రావాల్సి వుంటే, ఎంవోయూ ఎందుకు రాసుకుంటారని వైసీపీ ప్రశ్నించింది. వైఎస్ విజయమ్మ ప్రకటించినట్టు, అవి కుటుంబ ఆస్తులు కానే కావని వైసీపీ స్పష్టం చేసింది. అవన్నీ వైఎస్ జగన్ సొంతంగా సంపాదించుకున్న ఆస్తులే అని తేల్చి చెప్పింది.
జగన్ సంపాదించుకున్న ఆస్తుల్లో వాటా కోసం షర్మిల నానాయాగీ చేయడం ఏంటని వైసీపీ ప్రశ్నించింది. షర్మిల మాయలో పడి విజయమ్మ సైతం విచక్షణ కోల్పోయారని వైసీపీ ఘాటు వ్యాఖ్యలు చేసింది. విజయమ్మ చెబుతున్నట్టు ఉమ్మడి ఆస్తులే అయితే, ఒకరి కంపెనీలో మరొకరికి వాటాలు ఎందుకు లేవని వైసీపీ నిలదీసింది. ఆ ఆస్తుల్ని వైఎస్సార్ ఎందుకు పంచలేదని విజయమ్మను వైసీపీ సూటిగా ప్రశ్నించింది. మరీ ముఖ్యంగా షర్మిల తన అన్నపై విపరీత వ్యాఖ్యలు చేస్తుంటే, ఏనాడైనా విజయమ్మ మందలించారా? అని వైసీపీ నిలదీసింది.
ప్రస్తుతం ఆస్తుల వ్యవహారం కోర్టులో వుందని వైసీపీ పేర్కొంది. అలాగే ఇరుపక్షాల వాదనలు ప్రజల ముందు ఉన్నాయని వైసీపీ తెలిపింది. అంతిమంగా చట్టపరమైన కోర్టు, ప్రజాకోర్టులే తీర్పులిస్తాయని వైసీపీ తేల్చి చెప్పింది. అందుకు అనుగుణంగానే షర్మిలకు భవిష్యత్‌లో ఆస్తులు వస్తాయా? లేదా? అనేది తేలుతుందని వైసీపీ స్పష్టం చేయడం చర్చనీయాంశమైంది. మరోైపు.. వైఎస్ కుటుంబంలో ఆస్తుల గొడవ ఆయన అభిమానులు, కార్యకర్తలు, బంధువుల్లో ఆందోళన కలిగిస్తోంది.