Jogi Ramesh: వైసీపీని వీడనున్న జోగి రమేశ్..!? మరి దారెటు..!?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలో ఇమడలేక చాలా మంది నేతలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ పార్టీలో పలువురు నేతలపై కేసులు నమోదవుతుండడం.. పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారడం.. లాంటి అనేక అంశాలు నేతల్లో అంతర్మథనానికి కారణమవుతున్నాయి. జగన్ కు అత్యంత సన్నిహితులుగా చెప్పుకుంటున్న నేతలు సైతం ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే చాల మంది నేతలు పార్టీని వీడారు. మరికొందరు సైలెంట్ అయిపోయారు. ఇంకొందరు ఏదైనా కూటమి పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే వైసీపీని వదిలేసేందుకు సిద్ధమవుతున్నారు.
మాజీ మంత్రి జోగి రమేశ్ వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లాలో జోగి రమేశ్ కీలక నేత. జగన్ రెండో విడత మంత్రివర్గ విస్తరణలో జోగి రమేశ్ స్థానం దక్కించుకున్నారు. ఆ సమయంలోనే టీడీపీ ఆఫీసుపైన, చంద్రబాబు ఇంటిపైన వైసీపీ నేతలు దాడులు చేశారు. ఆ కేసులను ఇప్పుడు తిరగదోడింది చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేశ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే విచారణకు హాజరవుతున్నారు జోగి రమేశ్. ఇది జోగి రమేశ్ కు, ఆయన కుటుంబానికి తీవ్ర ఇబ్బందికరంగా మారింది.
మరోవైపు అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా కాజేశారంటూ జోగి ఫ్యామిలీపై కేసు నమోదైంది. ఈ కేసులో కుమారుడు జోగి రాజీవ్ తో పాటు ఆయన బాబాయ్ జోగి వెంకటేశ్వర రావు నిందితులుగా ఉన్నారు. ఓ వైపు తనమీద కేసులు నమోదవడం.. వారం వారం విచారణకు వెళ్లాల్సి రావడం జోగి రమేశ్ కు ఇబ్బందికరంగా మారింది. మరోవైపు కుమారుడి పైన కూడా కేసులు దాఖలయ్యాయి. వీటి నుంచి బయటపడడం అంత ఈజీ కాదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేశ్.. నాటి ప్రతిపక్ష టీడీపీ, జనసేనలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ అండతో ఆయన రెచ్చిపోయారు. ఇప్పుడు అవన్నీ మెడకు చుట్టుకుంటున్నాయి.
అధికారంలో ఉన్నప్పుడు జగన్ మెప్పుకోసం జోగి రమేశ్ వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేశారు. ఇప్పుడు వాటన్నిటినీ తిరగదోడి కేసులు పెడుతోంది ప్రభుత్వం. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అలాంటప్పుడు జగన్ తమను ఆదుకుంటాడని ఆశించడం అత్యాశే అవుతుందని వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారు. జోగి రమేశ్ కుటుంబసభ్యులు కూడా ఇదే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. జగన్ తో ఉంటే వచ్చేదేమీ లేదని.. పార్టీని వీడితే బాగుంటుందని వాళ్లు జోగి రమేశ్ కు చెప్పినట్టు తెలుస్తోంది. అధికార కూటమిలోని ఏదైనా పార్టీలో చేరితే భవిష్యత్తు ఉంటుందని.. లేకుంటే ఇబ్బందులు పడుతామని ఆయన సన్నిహితులు కూడా సలహా ఇచ్చినట్టు సమాచారం. అయితే ఐదు నెలల్లోనే తనపై కేసులు పెట్టి పీకల్లోతు ముంచేసిన కూటమి పార్టీలు... తనను చేర్చుకునేందుకు సుముఖంగా ఉంటాయా.. అనే అనుమానాన్ని జోగి రమేశ్ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏదైనా పార్టీ తనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే వైసీపీని వీడేందుకు సిద్ధమైనట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అప్పటివరకూ వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జోగి రమేశ్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.