Fake Letter: విజయమ్మ లెటర్ ఫేక్..! ఎవరి పని ఇది..!?
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ ఫ్యామిలీ ఆస్తి తగాదాల వ్యవహారం ఆసక్తిగా మారింది. తల్లి, చెల్లికి ఆస్తిలో వాటాలు ఇచ్చేందుకు వీలు కాదంటూ వైఎస్ జగన్ కోర్టును ఆశ్రయించడం పెద్ద దుమారానికే కారణమైంది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత వైఎస్ ఫ్యామిలీలో విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. ఇన్నాళ్లూ తల్లి, చెల్లితో జగన్ కు విభేదాలున్నాయనేది ఊహాగానాలుగా ఉండేవి. అయితే ఈ మ్యాటర్ బయటికొచ్చిన తర్వాత అంతా ఓపెన్ అయిపోయారు. జగన్ ఫిర్యాదుపై సోదరి షర్మిల ఘాటుగా స్పందించారు. గతంలో ఏం జరిగిందో ఓ లేఖ ద్వారా వెల్లడించారు. దీన్ని వైసీపీ కూడా తిప్పికొట్టింది.
మధ్యలో తల్లి విజయమ్మ కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. జగన్ తో పాటు ఆయన సన్నిహితులైన వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి కూడా తల్లి, చెల్లిని తప్పుబడుతూ ప్రెస్ మీట్లు పెట్టారు. దీంతో తల్లి విజయమ్మకు ఇప్పటికైనా వాస్తవాలు అర్థమైఉంటాయని షర్మిల అన్నారు. దీంతో విజయమ్మ కూడా ఓ లేఖ విడుదల చేశారు. జగన్ మాట ప్రకారమే ఒప్పందం జరిగిందన్నారు. షర్మిలకు న్యాయం చేయాలన్నారు. ఈ విషయంలో వేరెవరూ జోక్యం చేసుకోవద్దని.. వాళ్లిద్దరూ దీన్ని సెటిల్ చేసుకుంటారని సూచించారు. మరోవైపు వైసీపీ కూడా ఈ వ్యవహారానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలని శ్రేణులకు సూచించింది. దీంతో ఈ వ్యవహారం ఇంతటితో సద్దుమణిగందనుకున్నారు.
అయితే ఎన్నికలకు ముందు తల్లి విజయమ్మ ప్రయాణిస్తున్న అత్యాధునిక కారు రెండు టైర్లూ పేలిపోయిన విషయాన్ని తెలుగుదేశం పార్టీ తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. 2019 ఎన్నికలకు ముందు వివేకా విషయాన్ని గుర్తు చేసింది. తాజా ఘటన తర్వాత విజయమ్మ అమెరికా వెళ్లిపోయినట్లు వెల్లడించింది. ఇది వైసీపీ పెద్ద మైనస్ గా మారింది. దీని నుంచి ఎలా బయటపడాలో ఆ పార్టీకి అర్థం కాలేదు. ఇంతలో విజయమ్మ పేరిట ఓ లేఖ బయటికొచ్చింది. తన వాహన ప్రమాదానికి సంబంధించిన అంశాన్ని రాజకీయాలకు వాడుకోవడం సరికాదని.. ఇలాంటి తప్పుడు కథనాలు సరికాదని ఆ లేఖలో ఉంది. ఇది వైసీపీకి పెద్ద ఊరట కలిగించిన పరిణామం. వెంటనే ఈ లేఖను వైసీపీ తన అధికారిక ఖాతాలో కూడా పోస్టు చేసింది.
కానీ ఇక్కడే వైసీపీ తప్పులో కాలేసింది. అసలు ఇది విజయమ్మ రాసిన లేఖ కాదు. దీనికి, విజయమ్మకు ఎలాంటి సంబంధమూ లేదు. ఏమైందో ఏమో మరి వెంటనే వైసీపీ తన ట్విట్టర్ ఖాతా నుంచి ఈ లేఖను డిలీట్ చేసేసింది. సరిగ్గా ఇక్కడే టీడీపీ మళ్లీ ఎంటరైంది. జగన్ తన ఫేకు స్ట్రాటజీని మరోసారి బయటపెట్టుకున్నారని ఎద్దేవా చేసింది. తల్లి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫేకు లెటర్ సృష్టించి ట్విట్టర్లో పోస్ట్ చేశారని పేర్కొంది. దీనిపై విచారణ జరిగితే అసలుకే మోసం వస్తుందని గ్రహించి వెంటనే డిలీట్ చేసిందని విమర్శించింది. ఆఖరికి తల్లి సంతకాన్ని కూడా ఫోర్టరీ చేసి ఫేకు లెటర్ సృష్టించడం ఒక్క జగన్ కే సాధ్యమని ఎద్దేవా చేసింది. మొత్తానికి ఈ వ్యవహారంలో జగన్/ వైసీపీ మరోసారి అభాసుపాలయ్యారు. అయితే ఈ ఫేకు లెటర్ వెనుక ఎవరున్నారు..? ఎందుకిలా చేశారనేది మాత్రం ఇప్పటికీ ఆసక్తికరంగా మారింది.