YS Jagan : అసెంబ్లీకి పోం..! క్లారిటీ ఇచ్చేసిన జగన్..!!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాల్లోనే బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ సమావేశాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వస్తుందా.. రాదా .. అనే దానిపై ఇన్నాళ్లూ ఉత్కంఠ ఉండేది. 11వ నెల 11వే తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు ఆ 11 మంది ఎమ్మెల్యేలను తీసుకుని జగనన్న వస్తారా.. రారా.. అని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో కొంతకాలంగా సెటైర్లు కూడా జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ సమావేశాలకు వెళ్లేది లేదని తేల్చేశారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్.
గత ఐదేళ్లూ ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి 23 మంది సభ్యులుండేవాళ్లు. వాళ్లలో కూడా కొంతమంది వైసీపీకి అనుకూలంగా వ్యవహరించేవారు. అయినా టీడీపీ మాత్రం అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేది. అప్పటి అధికార వైసీపీ అనేక విధాలుగా టీడీపీ సభ్యులను ఇబ్బంది పెట్టినా ఆ పార్టీ వెనక్కు తగ్గలేదు. అయితే సభలో తన భార్యపై అసంబద్ధ వ్యాఖ్యలు చేయడంతో.. ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ.. మళ్లీ సీఎంగా ఎన్నికైన తర్వాతే మళ్లీ ఈ సభలో అడుగు పెడతానంటూ చంద్రబాబు ప్రతిన పూని బయటికొచ్చేశారు. ఆ తర్వాత టీడీపీ సభ్యులు కూడా వెళ్లడం మానేశారు.
ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇదే పరిస్థితి ఏర్పడుతోంది. ఆ పార్టీ తరపున తాజా ఎన్నికల్లో 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఎన్నికయ్యారు. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కనీసం 18 మంది ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు వీలవుతుందని ప్రభుత్వం చెప్తోంది. అయితే అలాంటి నిబంధన ఏదీ లేదని.. తమకు ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఇష్టం లేనందువల్లే ఇవ్వకుండా అడ్డుకుంటోందని వైసీపీ చెప్తోంది. ప్రతిపక్ష హోదా దక్కితే జగన్ కు ప్రోటోకాల్ వర్తిస్తుంది. ఇప్పుడు ప్రతిపక్ష కూడా లేకపోవడంతో ఆయన కూడా అందరిలాగే ఒక సాధారణ ఎమ్మెల్యేగానే పరిగణిస్తారు. దీన్ని వైసీపీ, జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు.
అసెంబ్లీకి వెళ్లినా మైక్ ఇచ్చే పరిస్థితి లేదని.. ప్రతిపక్ష హోదా ఇస్తే మైక్ ఇవ్వాల్సి వస్తుందనే భయంతో అది కూడా ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని జగన్ ఆరోపించారు. అందుకే తాము అసెంబ్లీకి వెళ్లాలనుకోవట్లేదని తేల్చి చెప్పేశారు. ప్రతి మూడు రోజులకోసారి మీడియా ముందుకొచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని స్పష్టం చేశారు. దీంతో అసెంబ్లీలో కూటమి సభ్యులు మాత్రమే ఉండనున్నారు. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు వైసీపీ ప్రకటించింది. ఇప్పుడు అసెంబ్లీని కూడా బాయ్ కాట్ చేస్తున్నట్టు తెలిపింది.