ASBL Koncept Ambience
facebook whatsapp X

ఆ విషయంలో జగనే కరెక్ట్..! ఆన్సరేది చంద్రబాబూ..!?

ఆ విషయంలో జగనే కరెక్ట్..! ఆన్సరేది చంద్రబాబూ..!?

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. గత పదేళ్లుగా ఇదే వాతావరణం కంటిన్యూ అవుతోంది. గత ఐదేళ్ల నుంచి పరిస్థితి మరింత ఎక్కువైంది. టీడీపీని తొక్కేసేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నించిందనే భావనలో ఉంది ఆ పార్టీ. ఇప్పుడు వైసీపీ ఓడిపోయి టీడీపీ అధికారంలోకి రావడంతో తమపై కక్ష సాధిస్తోందనే ఉద్దేశంలో ఉంది జగన్ పార్టీ. అయితే ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంలో రాజీ పడే ప్రసక్తే లేదని జగన్ తేల్చి చెప్తున్నారు. అందులో భాగంగా ఆయన మెడికల్ కాలేజీల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

కరోనా తదనంతర పరిస్థితుల్లో వైద్య సేవల అవసరం ఎంటో అందరికీ అర్థమైంది. అందుకే వైద్య సదుపాయాలు మెరుగు పరుచుకోవాలని నాడు అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.8480 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇందులో 2023-24 విద్యాసంవత్సరంలో 7 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. కొన్ని భవనాలు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కొన్ని కాలేజీలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ సీట్లు కూడా కేటాయించింది.

ఇంతలో ప్రభుత్వం మారిపోయింది. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ మెడికల్ కాలేజీలు ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదని.. కేటాయించిన సీట్లు రద్దు చేయాలని కోరుతూ NMCకి లేఖ రాసింది. ఆ కాలేజీల్లో పులివెందుల మెడికల్ కాలేజీ కూడా ఉంది. ఇదే అంశాన్ని జగన్ లేవనెత్తారు. మెడికల్ కాలేజీలు లేక, సీట్లు రాక కొన్ని రాష్ట్రాలు ఇబ్బందులు పడుతుంటే.. వచ్చిన సీట్లను వదులుకోవడమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వాస్తవానికి ఇందులో కొంత నిజముంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి. వాటిపై అధ్యయనం చేయాల్సిందిగా చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించింది.

మెడికల్ కాలేజీలపై జగన్ చేసిన ఆరోపణలపై ఇటు టీడీపీ కానీ, అటు ప్రభుత్వం కానీ స్పందించలేదు. కనీసం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా దీనిపై మాట్లాడలేదు. ఇది అనుమానాలకు తావిస్తోంది. జగన్ చేసిన ఆరోపణలు నిజమే కాబట్టి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదనే టాక్ నడుస్తోంది. ఒకవేళ ప్రభుత్వం తాను చేసిన పని రైట్ అయితే సమర్థించుకుంటూ ప్రకటన విడుదల చేసేది. కానీ అది జరగట్లేదు. కాబట్టి ఈ విషయంలో జగనే కరెక్ట్ అని అందరూ నమ్ముతున్నారు. నిజానికి ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ఉంటేనే విద్యార్థులకు, ప్రజలకు మేలు జరుగుతుంది. అలా కాకుండా వాటిని ప్రైవేటుపరం చేస్తే మాత్రం చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పు చరిత్రలో మిగిలిపోతుంది.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :