Jagan new political strategy: సొంత జిల్లాలో వెనకడుగు వేసిన జగన్.. అసలు రీజన్ అదే..
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో చంద్రబాబు ఎవరి మాట వినరు అన్న భావన బలంగా నాటుకొని ఉంది.. అయితే చంద్రబాబు కంటే కూడా ఎక్కువగా తన మాటపై నిలబడే వ్యక్తి జగన్. పార్టీలో తాను చెప్పిందే జరగాలి తప్ప ఎవరి మాట జగన్ విన్న దాఖలాలు ఇప్పటివరకు లేవు. అలాంటి జగన్ ఇప్పుడు పార్టీ కోసం నాలుగు అడుగులు వెనక్కి తగ్గడం.. అది కూడా ఆయన సొంత జిల్లాలో ఇది జరగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
గత కొద్దికాలంగా వైసీపీ నుంచి ఎందరో నేతలు బయటకి వచ్చారు.. వచ్చిన వారిలో చాలామంది చెప్పిన కామన్ విషయం ..’తన సొంత పార్టీలో జగన్ అంతా తానే అయి వ్యవహరిస్తారు.. ఆయన చెప్పిందే చేయాలి తప్ప ఇంకెవరి మాట వినరు..’.. అందుకే చాలామంది ఇమడలేక.. ఉండి ఇబ్బందులు పడలేక పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. అంతెందుకు ఎన్నికలకు ముందు కూడా ఎందరో నాయకులు తమకు టికెట్లు ఇవ్వవలసిందిగా జగన్ను అభ్యర్థించారు.. కానీ జగన్ తాను నిర్ణయించుకున్న కాండిడేట్లకు మాత్రమే టికెట్లు ఇచ్చారు.
దీంతో ఎంతోమంది నాయకులు అప్పట్లో పార్టీకి దూరమయ్యారు. మరోపక్క సీన్ కట్ చేస్తే ప్రజలు 11 సీట్లకి జగన్ ను పరిమితం చేశారు. ఉన్న కాస్త గట్టి నేతలు బయటకు వెళ్లిపోవడంతో ప్రస్తుతం పార్టీ చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కూటమి బలపడుతోంది.. వైసీపీ బలం తగ్గుతోంది.. మరోపక్క షర్మిల తన రేంజ్ రాజకీయం నడుపుతోంది.. వీటన్నిటి మధ్య పంతాలకు పోవడం ఎందుకు అనుకున్నారో ఏమో కానీ.. మొత్తానికి జగన్ పరిస్థితులతో కాంప్రమైజ్ అవ్వడం ప్రారంభించారు.
అసలు సంగతి ఏమిటంటే.. కడపలో కీలకమైన జమ్మలమడుగు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ వ్యవహారంపై చాలా రోజుల నుంచి ఎన్నో మలుపులు తిరుగుతున్నాయి. ఇక ఈ నియోజకవర్గ బాధ్యతలు తమకే ఇవ్వాలి అంటూ ఓపక్క మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. మరో పక్క ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పట్టుబట్టి కూర్చున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో వైసీపీ కార్యకలాపాలు అగమ్య గోచరంగా మారాయి. ఇక ఈ విషయం అటో ఇటో తేలితే తప్ప పార్టీ కోసం పని చేసేది లేదు అన్నట్లు ఉంది నేతల పరిస్థితి. మామూలుగా అయితే జగన్ ఇటువంటి సమయాలలో తీసుకునే నిర్ణయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి.. అయితే ఈసారి తన మాట వినని వాళ్ళని కూడా పక్కన కూర్చోబెట్టుకొని మరి ప్రశాంతంగా మాట్లాడుతున్నారు. మూడు మండలాలకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని.. మిగిలిన మూడు మండలాలకు రామ సుబ్బారెడ్డి ని ఇన్చార్జులుగా ఉండాల్సిందిగా జగన్ సూచించారు. ఇప్పటివరకు ఇలా జగన్ తన నిర్ణయాన్ని తానే వెనక్కి తీసుకున్న పరిస్థితులు లేవనే చెప్పాలి. దీంతో తొలిసారిగా వైసీపీ అధినేత నిజంగా రాజకీయంగా ఆలోచిస్తున్నారు అని అందరూ భావిస్తున్నారు.