రాను అంటున్న జగన్.. రావాలి అంటున్న కూటమి..
వైసీపీ అధినేత,మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై తెలుగు రాష్ట్రాలలో తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీకి వెళ్లకపోయినాప్పటికీ బడ్జెట్ సెక్షన్ మీద ఓ రెండు గంటల పాటు మీడియా సమావేశం నిర్వహించిన జగన్ అంతటితో తన పని అయిపోయింది అన్నట్టు సైలెంట్ అయిపోయారు. దీంతో అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యేలు ఏదైనా కీలకమైన ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలో ఏదో ఒక రీతిలో జగన్ మీద నేరుగా, పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు.
రాష్ట్రంలో ఎటువంటి లోటుపాట్లు ప్రసక్తి వచ్చినా.. ఇదంతా గత ప్రభుత్వం చేసిన నిర్వాకమే అంటూ ఫైర్ అవుతున్నారు. తాజాగా బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పాలనలో తీసుకున్న నిర్ణయాల కారణంగా చాలామంది కాంట్రాక్టర్లు ఇబ్బందికి గురయ్యారని ఆరోపించిన ఆయన.. ఎందరో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని పేర్కొన్నారు.ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే కొంతమంది మాత్రం బలంగా జగన్ అసెంబ్లీకి రావాలి అని కోరుకుంటున్నారు.
జగన్ ఎప్పుడు అసెంబ్లీకి వస్తారా అని తాను ఎదురు చూస్తున్నట్టు విష్ణు కుమార్ పేర్కొన్నారు. మరోపక్క జగన్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు పొంది.. రెండు సంవత్సరాల క్రితం టీడీపీ గూటికి చేరిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా తాజాగా అసెంబ్లీ లాబీలో మీడియాతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో జగన్ ని చూసి చాలా కాలం అయింది అన్న కోటంరెడ్డి.. జగన్ అసెంబ్లీకి వస్తే చూడాలని ఉంది అన్న తన ఆశలు వ్యక్తం చేశారు.
మొన్న ఎన్నికల అనంతరం జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన నాడు రఘురామకృష్ణంరాజు జగన్ వద్దకు వెళ్లి మరీ అసెంబ్లీకి రమ్మని కోరారు. అయితే ఇంతమంది జగన్ అసెంబ్లీకి రావాలి అని ఎందుకు కోరుకుంటున్నారు అన్న విషయం ప్రశ్నార్ధకంగా మారుతుంది. దీనికి ముఖ్య కారణం జగన్ చేసిన ఎన్నో పనుల గురించి నిలదీసి, అధికార పక్షం గతంలో చేసిన తప్పులను ఎత్తి చూపించడమే విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనే నెపంతో జగన్ సమావేశాలకు రావడం లేదు ఈ నేపథ్యంలో జగన్ అడిగినట్లు అతనికి ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది.