YS Jagan : ఓదార్పు కోసం జగన్ ఎదురు చూపులు..!!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ ప్రతి నిర్ణయాన్నీ దూకుడుగానే తీసుకునేవారు. తాను ఏం చేయాలనుకుంటే అది చేసి తీరడం జగన్ కు అలవాటు. తాను చేసేదే కరెక్ట్ అని నమ్మి మనసావాచా దాన్ని అమలు చేసేవారాయన. ఒక్కోసారి అవి బెడిసి కొడుతుంటాయ్. అయినా తాను చేసిందే కరెక్ట్ అని చెప్పుకుంటూ ఉంటారు. అదే మాటకు కట్టుబడి ఉంటారు. తన నిర్ణయాలను పునస్సమీక్షించుకుని సరిదిద్దుకోవాలనే ఆలోచన జగన్ కు ఎప్పుడూ ఉండదు. అలా చేస్తే మాట తప్పినట్లు.. మడమ తిప్పినట్లు అవుతుందనేది ఆయన సిద్ధాంతం. ఇప్పుడు కూడా జగన్ తీరు అలాగే ఉంటోంది.
చంద్రబాబు అసత్యాలు చెప్పడం వల్లే అధికారం సొంతం చేసుకున్నారనేది జగన్ ఇప్పటికీ నమ్ముతున్న మాట. తాను కూడా అలా అబద్దాలు చెప్పి ఉంటే అధికారంలోకి వచ్చేవాణ్ణని చెప్పుకుంటూ ఉంటారు. గత ఐదేళ్లూ అద్భుతంగా చేశానని విర్రవీగుతుంటారు. మరి అంత అద్భుతంగా చేసి ఉంటే 11 సీట్లే ఎందుకొచ్చాయంటే మాత్రం సమాధానం ఉండదు. తన ఐదేళ్ల పాలనపై సమీక్ష నిర్వహించుకుని తప్పొప్పులను బేరీజు వేసుకుని తననుతాను సరిదిద్దుకోవాలనే ఆలోచన జగన్ కు ఇప్పటికీ కలగకపోవడం సొంత పార్టీ నేతలనే ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
పార్టీ పెట్టినప్పటి నుంచి గత ఐదు నెలలక్రితం వరకూ జగన్ కు తిరుగులేదు. కానీ ఇప్పుడు సీన్ అలా లేదు. ఆయనకు అడుగడుగునా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. 2019వరకూ ప్రతిపక్ష హోదా ఉండేది. తర్వాత ఐదేళ్లూ తిరుగులేని అధికారం దక్కింది. కానీ ఇప్పుడు అధికారంలేదు. ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఆయనొక ఎమ్మెల్యే మాత్రమే. గతంలో లాగా ఇప్పుడు ఆయన వెంట మందీమార్బలం కూడా పెద్దగా లేదు. తన చుట్టూ ఉన్నవాళ్లంతా ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. తనతో పాటు మొదటి నుంచి ఉన్న నేతలే వదిలేసి తమదారి తాము చూసుకుంటున్నారు. అయినా జగన్ మాత్రం మారట్లేదు.. పోతే పోనీలేబ్బా... ఏమవుతాది... అంటూ సెటైర్లు వేసుకుంటున్నారు.
గతంలో జగన్ కు కుటుంబం పెద్ద అండ. కానీ ఇప్పుడు ఫ్యామిలీలో కూడా జగన్ ఒంటరివాడే. తల్లి, చెల్లి తనకు దూరమైపోయారు. తనపైనే యుద్ధభేరి మోగించారు. జగన్ కూడా సై అంటూ సైరన్ మోగించారు. వివేకా ఫ్యామిలీ ఎప్పటి నుంచో జగన్ పై పోరు బాట పట్టింది. ఇటు ఫ్యామిలీ, అటు పార్టీ... రెండింటి నుంచి జగన్ ఇప్పుడు ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. వీటి నుంచి బయటపడడం అంత ఆషామాషీ కాదు. ఇలాంటి సమయంలో తన కేసులను తిరగదోడి ముందుకు కదిలితే మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇలాంటప్పుడు జగన్ కు కావాల్సింది ఓదార్పు. అది కూడా ఎక్కడా కనిచూపు మేరలో కనిపించట్లేదు. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా తనకు మద్దతుగా నిలిచే పరిస్థితి లేదు. కేంద్రంలో కూడా ఇదే పరిస్థితి. తన వెంట నడిచే పార్టీ లేదు.. ఉన్న నేతలు దూరమవుతున్నారు.. కుటుంబసభ్యులూ బైబై చెప్పేసి వెళ్లిపాయారు. మరి జగన్ ను ఓదార్చే వాళ్లెవరు..?