సోషల్ మీడియా లో దుష్ప్రచారం చేసింది అతనే.. షర్మిల..
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో వైఎస్ షర్మిల ధాటి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఆమె ఏదన్నా మాట్లాడడానికి ఫిక్స్ అయ్యారంటే ఇక అవతల వాళ్లకు చెమటలు పట్టాల్సిందే. సొంత అన్న అయినా.. ప్రతిపక్ష నేత అయినా.. ఆఖరికి రూలింగ్ పార్టీ అయినా షర్మిల మాట్లాడాలి అనుకుంటే మాట్లాడేస్తారు. తాజాగా ఆమెకు వైసీపీ అధినేత , జగన్మోహన్ రెడ్డికి మధ్య జరిగిన జగడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఆస్తి పంపకాల విషయం బయటకు వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు అన్నా చెల్లెళ్ల మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల తూటాలు పేలుతున్నాయి.
ఇటు షర్మిల ట్వీట్ దగ్గర నుంచి ప్రెస్ మీట్ వరకు.. వేదిక ఏదైనా సరే జగన్ ను వదిలే ప్రసక్తే లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో కథ కొద్ది కాలంగా సోషల్ మీడియా పోస్టుల అరెస్టులపై జరుగుతున్న హడావిడి గురించి కూడా ఆమె తాజాగా స్పందించారు. తప్పంతా జగన్ వైపే ఉన్నట్టు మాట్లాడిన షర్మిల మరొకసారి ఆయనపై విరుచుకుపడ్డారు.. సోషల్ మీడియా వేదికగా తమ కుటుంబ సభ్యులపై జరుగుతున్న దుష్ప్రచారానికి జగన్ ఈ కారణమంటూ ఫైర్ అయ్యారు.
తనతో పాటుగా తన తల్లి విజయమ్మ, చెల్లి సునీత పై కూడా నీచమైన పోస్టులు పెట్టించి వ్యక్తి జగనే అంటూ ఆమె చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. దీంతో పాటుగా అసెంబ్లీకి వెళ్ళకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి అంటూ సవాలు కూడా విసిరారు. అసెంబ్లీకి వెళ్లడానికి ఇష్టం లేని మీకు పదవులు ఎందుకు.. ఓటు వేసిన 38% ప్రజలకు ఏం సమాధానం చెప్తారు అంటూ కౌంటర్ ఇచ్చారు.. ఎన్నికల్లో ప్రజలు జగన్ బుద్ధి తెలుసుకొని మంచి గుణపాఠం నేర్పించారు అని ఎద్దేవా చేశారు.
జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడం, 11 సీట్లకు మాత్రమే పరిమితం కావడం అతను చేసుకున్న స్వయంకృతాపరాధం అని షర్మిల పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన జగన్ అసలు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకే అస్తిత్వం లేదు. వారి ఓటు శాతం 1.7 మాత్రమే అంటూ తిరిగి కౌంటర్ ఇచ్చారు.. మార్పు కోసం, అభివృద్ధి కోసం 2024 ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. కానీ ప్రభుత్వం ఏర్పాటయి నెలలు గడుస్తున్నా నేతలు ఆరోపణలు, నిందలతో సరిపెట్టుకుంటున్నారే తప్ప అభివృద్ధి వైపు అడుగులు ఎప్పుడు వేస్తారో అర్థం కావడం లేదు.