షర్మిల పర్సనల్ ఎజెండా.. కుంగిపోతున్న కాంగ్రెస్..
ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన నాటి నుంచి తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ హవా అంతా ఇంత కాదు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన ముఖ్యమంత్రుల లిస్ట్ తీసుకున్న ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. అంతెందుకు చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి లాంటి రాజకీయ ఉద్దండులు వచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే. తెలుగు రాష్ట్రాలలో అంత చరిత్ర కలిగిన కాంగ్రెస్ క్రమేపి కనుమరుగైపోతోంది.
ఒకరకంగా తెలంగాణలో పుంజుకున్న కాంగ్రెస్ ఆంధ్రాలో మాత్రం తిరిగి పూర్వ వైభవాన్ని తెచ్చుకునే పరిస్థితిలు కనిపించడం లేదు. ఆంధ్రాలో కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటి? భవిష్యత్తులో పార్టీ పుంజుకునే అవకాశం ఉందా? అనేది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కష్టపడుతున్న నాయకులకు ప్రశ్నార్థకంగా మారింది. మరి ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు అయోమయంగా ఉన్నాయి. ఓటు బ్యాంకు విషయంలో కాంగ్రెస్ ఇంకా పుంజుకోవాల్సిన అవసరం చాలా కనిపిస్తోంది. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ భవిష్యత్తును నిలబెడుతుంది అనే ధీమాతో బరిలోకి దింపిన షర్మిల ఎంతసేపు ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడతారే తప్ప పార్టీ గురించి ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. 2024 ఎన్నికల సమయంలో కూడా జగన్ కి ఓటు వేయొద్దు అనే ప్రచారానికి ఇచ్చిన ప్రాముఖ్యత కాంగ్రెస్ కి ఓటు వేయించాలి అనేదానికి ఇవ్వలేదు అన్న విమర్శలు ఉండనే ఉన్నాయి.
ప్రస్తుతం పార్టీ చీఫ్ గా ఉన్న షర్మిల రాష్ట్రంలో కాంగ్రెస్ ని బలోపేతం చేసే విధంగా అడుగులు వేయడం లేదు అనేది సీనియర్ నేతల మాట. ఆమె సొంత అజెండా వదలకపోవడం.. పార్టీ డెవలప్మెంట్ చేయడానికి ఎటువంటి ప్రయత్నం చేయకపోవడంతో ఆంధ్రాలో పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆరు మాసాలు గడుస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేరువయ్య విధంగా ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభించలేదు.
ప్రభుత్వ విధి విధానాలు, నెరవేర్చాల్సిన హామీలు, ప్రజలకు అందిస్తున్న మౌలిక వసతులు.. ఇలా ఏదో ఒక పాయింట్ తో ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజల దృష్టిని తమ వైపు ఆకర్షించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో ఏ ప్రోగ్రాం నిర్వహించలేదు. ఇదే కొనసాగితే పరిస్థితులు మరింత దారుణంగా మారుతాయి అని హెచ్చరిస్తున్నారు పార్టీ ప్రముఖులు. మహారాష్ట్ర ఫలితం చూసిన తర్వాత అయినా ఆంధ్రాలో మార్పు రావలసిన అవసరం ఉంది అని రఘువీరా చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరోపక్క షర్మిల ను నమ్ముకుంటే ఆంధ్రాలో కాంగ్రెస్కి భవిష్యత్తు ఉండదు అన్న మాట కూడా బలంగా వినిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.