అదానీ-జగన్ విద్యుత్ డీల్‌పై విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరిన వైయస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిప రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. జగన్-అదానీ విద్యుత్ డీల్‌పై వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, రూ.1,750 కోట్ల ముడుపుల వ్యవహారంపై విచారణ జరిపించాలని గవర్నర్‌ను ఆమె కోరారు. ఈ విద్యుత్ డీల్.. అదానీకి లాభం-రాష్ట్ర ప్రజలకు పెనుభారం అని షర్మిల ఆరోపించారు. ప్రపంచం మొత్తం ఈ ముడుపుల గురించే చర్చించుకుంటోందన్న ఆమె.. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదానీ దేశం పరువు తీస్తే, జగన్ రాష్ట్రం పరువు తీశారని మండిపడ్డారు. ఈ స్కాంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని జాతీయ కాంగ్రెస్ కోరిందని, రాష్ట్రంలో కూడా దీనిపై దర్యాప్తు జరిపించాలని, అదానీతో ఒప్పందాన్ని రద్దు చేయాలని ఏపీసీసీ డిమాండ్ చేస్తోందని ఆమె స్పష్టం చేశారు. "యూనిట్ రూ.1.99కి దొరికే విద్యుత్‌ను రూ.2.49కి కొనుగోలు చేశారు. దీనికి అన్ని చార్జీలు కలిపితే ఒక యూనిట్ ధర రూ.5 దాటిపోతుంది. దీని ప్రకారం పాతికేళ్లకు ఒప్పందం కుదుర్చుకున్నారంటే.. ఈ తరాన్ని మాత్రమే కాదు, రాబోయే తరాన్ని కూడా తాకట్టు పెట్టినట్టే. లక్షల కోట్ల ప్రజల సొమ్మును అదానీకి దోచిపెట్టినట్టే!’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.