వారు ఏ పార్టీలో ఉన్నా అంతు చూడాలి : వైఎస్ షర్మిల
కొందరు సైకోలు, సైకో పార్టీలతో కలిసి సోషల్ మీడియాను భ్రస్టు పట్టించారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. మానవ సంబంధాలు, రక్త సంబంధాలు మరిచి మృగాలుగా మారారని విమర్శించారు. తల్లి, చెల్లి అనే ఇంగితజ్ఞానం కూడా లేకుండా పోస్టులు పెట్టారు. ప్రశ్నించే మహిళలపై అసభ్యకర పోస్టులతో రాక్షస ఆనందం పొందారు. సోషల్ మీడియా సైకో బాధితుల్లో నేను ఉన్నా. అసభ్యకర పోస్టులతో పరువు, ప్రతిష్ఠ దెబ్బతీసే పోస్టులు పెట్టారు. పైశాచిక ఆనందం పొందే సైకోలపై కఠిన చర్యలు తీసుకోవాలి. నాతో సహా నా తల్లి విజయమ్మ, సునీతలపై విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు. వైఎస్ రాజశేఖర్రెడ్డికే పుట్టలేదని నన్ను అవమానించారు. నా ఇంటి పేరు కూడా మార్చి రాక్షస ఆనందం పొందారు. నాపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రరెడ్డిపై కేసు పెట్టా. సైకోలా పోస్టులు పెట్టిన రవీంద్రరెడ్డి అరెస్టును స్వాగతిస్తున్నాం. దారుణమైన పోస్టులు పెట్టేవారు ఏ పార్టీలో ఉన్నా అంతు చూడాలి అని షర్మిల మండిపడ్డారు.