YS Viveka Case : వై.ఎస్.వివేకా హత్య కేసు… ఇక దూకుడేనా..?
ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్.వివేకా హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వై.ఎస్.వివేకా హత్యకు గురయ్యారు. అయితే ఆయన కుటుంబీకులు మొదట దీన్ని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే తదుపరి విచారణలో ఇది హత్య అని నిర్ధారించారు. దీని వెనుక ఎవరెవరున్నారో తేల్చే ప్రయత్నం చేశారు. వివేకా హత్య వెనుక ఆయన కుటుంబీకుల పాత్ర ఉందని తేలింది. ఇంతలో చంద్రబాబు ప్రభుత్వం ఓడిపోయింది. జగన్ అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి వివేకా హత్య కేసు ముందుకు సాగలేదు.
వివేకానంద రెడ్డి హత్య ఎన్నెన్నో మలుపులు తీసుకుంది. కుటుంబసభ్యుల హస్తం ఉందని తెలియడంతో ఆయన కుమార్తె సునీత ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. స్థానిక పోలీసులు, సీఐడీ విచారణలో నిజాలు నిగ్గుతేలవని భావించారు. ఇదే విషయాన్ని అప్పటి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఆయన ఇందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. అయితే జగన్ ప్రభుత్వం సీబీఐకి సహకరించలేదు. పైగా అడుగడుగునా ఆటంకాలు కల్పించింది. అవినాశ్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ ప్రయత్నించింది. అయితే ఆయన్ను అరెస్టు చేయకుండా జగన్ ప్రభుత్వం అడ్డుకుంది.
పైగా.. వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఏకంగా సీబీఐ పైన, సునీతా పైన కేసులు పెట్టారు. దీనిపై విచారణ సందర్భంగా సీబీఐ పలు ఆరోపణలు చేసింది. జగన్ ప్రభుత్వం ఈ కేసులో అస్సలు సహకరించట్లేదని స్పష్టం చేసింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఈ కేసులో విచారణ ముందుకు కదిలే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సునీత దాఖలు చేసిన పిటిషన్ పైన సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. అంతేకాక.. కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని సునీత వేసిన పిటిషన్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి కడప జైలుకు వెళ్లి అప్రూవర్ గా మారిన దస్తగిరిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. అప్పట్లో ఇది సంచలనం కలిగించింది. అదే అంశాన్ని ఇప్పుడు సునీత సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు ఇందులో నిజానిజాలేంటో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. గతంలో కోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే జగన్ అధికారంలో ఉండడమే కారణం. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉంది. కోర్టు ఆదేశాలపై వాస్తవాలను వెల్లడించే అవకాశం ఉంది. అదే జరిగితే అవినాశ్ రెడ్డికి ఇబ్బందులు తప్పవు. ఓ వైపు సుప్రీంకోర్టు ఆదేశాలు వెల్లడవుతున్న సమయంలోనే వివేకా కుమార్తె సునీత ఏపీ అసెంబ్లీకి వెళ్లి హోంమంత్రిని కలిశారు. ఈ కేసును సీరియస్ గా తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం ఈ కేసులో చురుగ్గా స్పందిస్తే విచారణ వేగవంతమయ్యే ఛాన్స్ ఉంది.