ASBL Koncept Ambience
facebook whatsapp X

YSRCP: జమిలి ఆశల పల్లకీలో వైసీపీ నేతలు..!!

YSRCP: జమిలి ఆశల పల్లకీలో వైసీపీ నేతలు..!!

దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై తీవ్రంగా చర్చ జరగుతోంది. అలాంటప్పుడు రాష్ట్రాల్లో కూడా ఆ మేరకు చర్చలు నడవడం కామనే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరుగుతోంది. ముఖ్యంగా ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో జమిలి ఎన్నికలపై ఎక్కువగా చర్చించుకోవాల్సింది కూటమి పార్టీల నేతలే. ఎందుకంటే కేంద్రంలో ఈ కూటమే జమిలి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇలాంటప్పుడు సాధ్యాసాధ్యాలను పరిశీలించుకుని ఏం చేయాలి.. ఎలా చేయాలి.. అనే దానిపై కూటమి పార్టీలు చర్చించుకోవాలి. కానీ ఇందుకు విరుద్ధంగా ఇక్కడ మాత్రం ప్రతిపక్ష హూదా కూడా లేని వైసీపీ జమిలి ఎన్నికలపై తెగ హడావుడి చేసేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది మేలోనే ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటే ఇక్కడ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి. అంటే జమిలి ఎన్నికలన్నమాట. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. అప్పటి నుంచి మళ్లీ అధికారంలోకి వెంటనే వచ్చేయాలనే పట్టుదలతో ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కూడా పూర్తి కాలేదు. అప్పుడే ఆయన ప్రభుత్వం విఫలమైపోయిందని.. రాష్ట్రపతి పాలన పెట్టాలని.. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు.

మరోవైపు మోదీ ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సిద్ధమవుతోందనే ప్రచారం జోరుగా సాగుతుండడంతో పార్టీ కేడర్ అంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. 2027లోనే ఎన్నికలు జరుగుతాయని.. అందుకోసం కార్యకర్తలంతా ఇప్పటి నుంచి పని చేయాలని సూచించారు. పార్టీ కోసం బాగా పని చేసిన వాళ్లను గుర్తించి అధికారంలోకి రాగానే వారికి ప్రమోషన్లు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు జగన్. మరోవైపు వైసీపీ నేతలంతా కూడా జమిలి ఎన్నికలపైనే పూర్తిగా ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఎక్కడికెళ్లినా వాళ్లు ఎన్నికల గురించే మాట్లాడుతున్నారు.

తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా నిర్వహించింది వైసీపీ. ఈ సందర్భంగా పలువురు వైసీపీ కీలక నేతలు ఇందులో మాట్లాడారు. అందరి నోటా ఒకటే మాట.. జమిలి ఎన్నికలు రాబోతున్నాయ్.. మనం సిద్ధంగా ఉండాలి.. కూటమిని ఓడించాలి.. మనం అధికారంలోకి రావాలి.. అని..!! రాజకీయ పార్టీలకు ఎన్నికలు ల్యాండ్ మార్క్ లాంటివి. వాటిలో గెలిస్తే అధికారం వస్తుంది. అయితే కేవలం అధికారం కోసమే ఎన్నికలు రావాలని కోరుకోవడం మాత్రం పార్టీల బలహీనతలను తెలియజేస్తుంది. ఎన్నికలు జరిగిన ఐదు నెలలు కూడా కాకుండానే అప్పుడే ఎన్నికలు రావాలనుకోవడం.. వాటిలో నెగ్గాలనుకోవడం వైసీపీ నేతల ఆశలపల్లకీని తెలియజేస్తోంది.

 

 

praneet praneet praneet ASBL Landmark Radhey Skye Radha Spaces
Tags :