ఘనంగా ప్రారంభమైన 'తానా' మహాసభలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 21వ మహాసభలు సెయింట్‌లూయిస్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. అమెరికా సెంటర్ వేదికగా జరుగుతున్న ఈ మహాసభల్లో పాల్గొనేందుకు వేలాదిగా తెలుగువాళ్ళు కుటుంబసమేతంగా తరలివచ్చారు. బాంక్వెట్ కార్యక్రమంతో మహాసభలు ప్రారంభమయ్యాయి. కన్వీనర్ చదలవాడ కూర్మనాథ్ అందరికీ స్వాగతం పలికారు. అధ్యక్షుడు జంపాల చౌదరి మహాసభలకు వచ్చినవారిని సాదరంగా స్వాగతించారు.
ఇల్లినాయి డిస్ట్రిక్ట్ 8కు చెందిన కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి మహాసభలో మాట్లాడుతూ, సంప్రదాయాలను పరిరక్షించుకోవడానికి తానా వంటి సంస్థలు చేస్తున్న కృషిని కొనియాడారు. భారతీయులు కష్టపడుతారని, అందువల్లనే వారు అమెరికాలోనేకాక, ఇతర దేశాల్లో కూడా రాణిస్తున్నారని చెప్పారు. ఈ బాంక్వెట్ విందుకు ఎంతోమంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. గణపతి నాట్యం, యువతీ యువకుల సినీనాట్యాలు, కల్పన-రోహిత్‌ల సంగీత విభావరి ఉర్రూతలూగించింది. రాజ్యసభ మాజీ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, వ్యాపారవేత్త అట్లూరి సుబ్బారావు, సినీనటి కాజల్, నిర్మాత నవీన్ ఎర్నేని, సిరివెన్నెల సీతారామశాస్త్రి, తమ్మారెడ్డి భరద్వాజ, పుల్లెల గోపీచంద్, కాన్సాల్‌లో తెలుగువారిని రక్షించిన ఇయాన్ గ్రిలియట్, కాంగ్రెస్ నాయకుడు మల్లు భట్టివిక్రమార్క, వైఎస్‌ఆర్ పార్టీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జస్టిస్ రామలింగేశ్వరరావు తదితరులు ఈ బాంక్వెట్ విందుకు హాజరయ్యారు.