తానా మహాసభల్లో పెరిగిన సందడి
వాషింగ్టన్ డీసీలోని వాల్టర్ ఇ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభల్లో రెండవరోజు కార్యక్రమాలకు ఎన్నారైలు, ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు. దీంతో సభాప్రాంగణమంతా జనంతో క్రిక్కిరిసిపోయింది. రెండోరోజు జరిగిన పలు కార్యక్రమాల్లో ఎంతోమంది పాల్గొన్నారు. సాహిత్య, ఆధ్యాత్మిక, వ్యాపార, వాణిజ్య, క్రీడలపై ఏర్పాటు చేసిన సదస్సుల్లో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. వాణిజ్య సెమినార్‌కు పెద్దఎత్తున హాజరయ్యారు. ఎంతోమంది బిజినెస్ ప్రముఖులు తమ అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ సందేహాలను కూడా నివృత్తి చేసుకున్నారు. ఖమ్మం, చిత్తూరు ప్రవాసుల సంఘం సమావేశాలు ఆత్మీయంగా సాగాయి. క్రీడా సెమినార్లలో కపిల్‌దేవ్ పాల్గొన్నారు. హఠ యోగా, వివాహ పరిచయ వేదికల వద్ద కూడా రద్దీ సాగింది. అధ్యక్షుడు సతీష్ వేమన అన్ని వేదికల వద్దకు కలియతిరుగుతూ అందరితో ముచ్చటిస్తూ ఉత్సాహపరిచారు. మొత్తం మీద 2వ రోజు తానా మహాసభలు కోలాహలంగా మరింత సంబరంగా సాగాయి.