ASBL Koncept Ambience

చరిత్ర సృష్టించిన తానా 23వ మహాసభల వేడుకలు

చరిత్ర సృష్టించిన తానా 23వ మహాసభల వేడుకలు

ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలు అంగరంగ వైభవంగా జరిగి చరిత్ర సృష్టించేలా సాగింది. ఊహించినదానికన్నా తెలుగువారు వేల సంఖ్యలో ఈ మహాసభలకు కుటుంబ సమేతంగా తరలివచ్చి విజయవంతం చేశారు. ఎందరో ప్రముఖులు ఈ మహాసభల్లో పాల్గొన్నారు. సినిమా నటీనటులు, సంగీత దర్శకులు, గాయనీ గాయకులు, కవులు, కళాకారులు, పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, ఇలా ఎన్నో రంగాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులు ఈ మహాసభలకు తరలివచ్చి మాట్లాడారు.  తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ రవి పొట్లూరి, కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ లావు ఆధ్వర్యంలో ఈ మహాసభలు జరిగాయి.

జూలై 7వ తేదీన బాంక్వెట్‌ వేడుకలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.  మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనను తానా ప్రెసిడెంట్‌ అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్‌ కోఆర్డినేటర్‌ రవి పొట్లూరి, చైర్మన్‌ శ్రీనివాస్‌ లావు సత్కరించారు. అనంతరం ఆయన చేతుల మీదుగా పలువురికి తానా ఎక్సలెన్స్‌ అవార్డులు అందజేశారు. అనంతరం ‘నటసింహం’ బాలకృష్ణను తానా ప్రతినిధులు సత్కరించారు. ఆ తర్వాత పలువురికి తానా మెరిటోరియస్‌ అవార్డులను బాలకృష్ణ అందజేశారు. అదే వరుసలో తానా ప్రెసిడెన్షియల్‌ స్పెషల్‌ అవార్డులు, రికగ్నిషన్‌ అవార్డులు కూడా అందజేశారు. ఈ వేడుకలకు భారత సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ కూడా హాజరయ్యారు. ఆయన్ను కూడా తానా ప్రతినిధులు సత్కరించారు. ఈ క్రమంలోనే బాంకెట్‌, అవార్డ్‌ కమిటీ, ఆర్గనైజేషన్ల రికగ్నిషన్‌ కార్యక్రమం కూడా చక్కగా జరిగింది. ఆ తర్వాత కవీస్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్యాన్స్‌ విద్యార్థులు టాలీవుడ్‌ పాటలకు డ్యాన్స్‌ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ వేడుకలకు విచ్చేసిన భారత్‌ బయోటెక్‌ వ్యవస్థాపకులు కృష్ణ ఎల్ల తదితరులు ఈ వేడుకల్లో మాట్లాడారు. భారత్‌లో ఎంతో యువశక్తి ఉందని, అలాగే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకుంటే ఎంతో ఎత్తుకు ఎదగవచ్చని యువతకు మార్గనిర్దేశనం చేశారు. బాల్‌రూం ఏబీలో యూత్‌ బాంకెట్‌ కూడా ఘనంగా జరిగింది. దీనిలో కాప్రికో బ్యాండ్‌ తమ లైవ్‌ మ్యూజిక్‌తో అందరినీ ఆకట్టుకుంది. రూం నెంబర్‌ 303-ఏబీ, 304లో చిన్నారుల కోసం కూడా పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వాళ్లు కూడా ఈ సాయంత్రాన్ని చాలా సంతోషంగా గడిపారు. చివర్లో ప్రముఖ నేపథ్య గాయని చిత్ర, సింహా, కౌసల్య తదితరులు తమ పాటలతో ప్రేక్షకులను అలరించారు. ఈ వేడుకలకు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్‌, ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు, తెలంగాణ కేబినెట్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, కాంగ్రెస్‌ నేత సీతక్క, హీరోయిన్‌ శ్రీలీల తదితర ప్రముఖులు హాజరయ్యారు.

తానా సావనీర్‌ విడుదల

23వ మహాసభల సావనీర్‌ ఆవిష్కరణ ‘తెలుగు పలుకు’ను విడుదల చేశారు. అనంతరం తానా ప్రెసిడెంట్‌ అంజయ్య చౌదరి మాట్లాడుతూ.. ఎప్పుడూ రెండేళ్లకోసారి జరిగే తానా మహాసభలు ఈసారి నాలుగేళ్ల తర్వాత జరుగుతున్నాయని గుర్తుచేశారు. తొలిరోజు కార్యక్రమానికి ఎప్పుడూ 3-4 వేల మంది మాత్రమే ఈ సభలకు హాజరయ్యేవారని, కానీ ఈసారి 8 వేల మంది ప్రేక్షకులు వచ్చారంటూ సంతోషం వ్యక్తం చేశారు. కాన్ఫరెన్స్‌ కోఆర్డినేటర్‌ రవి పొట్లూరి మాట్లాడుతూ ఈ సభలను విజయవంతం చేయడం కోసం అందరూ చాలా కష్టపడ్డారని, వాలంటీర్లు కూడా ఎంతో శ్రమించారని చెప్పారు.

2వ రోజున...

తానా 23వ మహాసభల వేడుకలు రెండో రోజు కూడా అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తానా నాయకులంతా పూజలు చేశారు.  ఈ వేడుకల ఆరంభంలో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ..  అందరూ ఇది తమ పండుగ అనుకునేలా ఈ వేడుకలకు ఏర్పాట్లు చేశామని, అందరూ అలాగే అనుకొని ఆశీస్సులు అందించాలని కోరారు. అనంతరం కాన్ఫరెన్స్‌ కోఆర్డినేటర్‌ రవి పొట్లూరి మాట్లాడుతూ, తానా మహాసభలకు ఊహించిన దానికన్నా మంచి స్పందన రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించడంలో కృషి చేసిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ వెంకట రమణ యార్లగడ్డ మాట్లాడుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి తానా మేలు చేస్తోందన్నారు. బోర్డ్‌ చైర్మన్‌ బండ్ల హనుమయ్య కూడా మాట్లాడారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తానా అధ్యక్షుడు అంజయ్య, కన్వీనర్‌ పొట్లూరి రవి, ఛైర్మన్‌ లావు శ్రీనివాస్‌, కార్యదర్శి తుమ్మల సతీష్‌, డైరక్టర్‌ రవి మందలపు ఇతర కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

2వ రోజు కార్యక్రమం ప్రారంభంలో బోనాలతో సభాస్థలికి మహిళలు ప్రదర్శనగా రావడం ఆకట్టుకుంది. జొన్నవిత్తుల రామలింగ శాస్త్రి రచించిన పాట ‘తెలుగు వైభవం’ పాటకు స్థానిక నృత్య పాఠశాలలకు చెందిన విద్యార్థులంతా కలిసి అద్భుతమైన నాట్యం చేశారు. అక్కడి నుంచి ఒకదాని తర్వాత మరొకటిగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. టాలీవుడ్‌ మెడ్లీ కార్యక్రమాలు, కూచిపూడి నృత్యాలు, ఏకపాత్రాభిన యాలు, లిటిల్‌ మ్యూజిషియన్స్‌ అకాడమీ వారి కార్యక్రమాలు, భరతనాట్యాలు, నాటకాలు, ఫ్యాషన్‌ షోలు, ధీమ్‌తానా ఫైనల్‌ పోటీలు, సిఎంఇ, అలూమ్ని వంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. 

ఆ తర్వాత ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్‌, కాగ్నిజెంట్‌ సీఈవో రవి కుమార్‌ ఎస్‌, లిరిసిస్ట్‌ చంద్రబోస్‌, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్‌, ప్రైమ్‌ హాస్పిటల్స్‌ వ్యవస్థాకులు డాక్టర్‌ ప్రేమ్‌ సాగర్‌ రెడ్డి, తెలంగాణ అమెరికన్‌ అసోసియేషన్‌ (టాటా) వ్యస్థాపకులు పైళ్ల మల్లారెడ్డి తదితరులకు తానా నాయకులు సన్మానం చేశారు. ఈ క్రమంలోనై రంగ రంగ వైభవంగా ఫ్యాషన్‌ షో కూడా ప్రేక్షకులను అలరించింది. ఆధ్యాత్మిక జీవితం గురించి, మనం చేసే పొరపాట్ల గురించి సద్గురు జగ్గీ వాసుదేవ్‌ అద్భుతంగా వివరించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును సత్కరించిన తర్వాత ఆయన ప్రసంగించారు. తెలుగు భాష గొప్పతనాన్ని ఆయన వివరించారు. ఈ భాషను కాపాడుకోవడంలో తానా చేస్తున్న కృషిని అభినందించారు.

తానా 2023 మహాసభల్లో రెండోరోజు శనివారం నాడు మధ్యాహ్నం కార్యక్రమాల్లో భాగంగా పలు సెమినార్లు సమావేశాలు నిర్వహించారు. రాజకీయ సదస్సులో తెలుగు రాజకీయ నాయకులు, ప్రవాస రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అమెరికా రాజకీయాల్లో ప్రవాసుల పాత్ర అనే అంశంపై సెమినార్‌ నిర్వహించారు. వాణిజ్య సదస్సులో డా. ఎల్లా కృష్ణ పాల్గొని తన అనుభవాలు, అభిప్రాయాలను సభికులతో పంచుకున్నారు. వాణిజ్య సదస్సు జరిగిన హాలు జనంతో నిండుగా కనిపించింది. సంతృప్తికి మించిన సౌందర్యం ఏ మహిళకి ఉండదని తానా 2023 మహాసభల్లో ఏర్పాటు చేసిన మహిళా ఫోరంలో పాల్గొన్న అతిథులు అన్నారు.      
ఎన్టీఆర్‌ చిత్రాలతో ఏర్పాటు చేసిన ప్రాంగణాన్ని బాలకృష్ణ ప్రారంభించారు. తారకరాముని ఫోటో ఎగ్జిబిషన్‌ను కూడా ప్రారంభించారు. చివరన  తెలుగు సినీ రాక్‌ స్టార్‌ సంగీత దర్శకులు దేవి శ్రీ ప్రసాద్‌ లైవ్‌ మ్యూజికల్‌ కాన్సర్ట్‌ జరిగింది. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు జనం తరలిరావడంతో కార్యక్రమం ప్రాంగణమంతా జనాలతో క్రిక్కిరిసిపోయింది. ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు.  దీంతో కుర్చీలు లేక చాలామంది లైన్స్‌ మధ్యలో,  స్టేజ్‌ కి ముందు కింద కూర్చొని సంగీత విభావరిని తిలకించారు. 

తానా వేదికపై ‘సిరివెన్నెల సమగ్ర సాహిత్యం’ ఆవిష్కరణ

తెలుగు సినీ గీత రచయితల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. తెలుగు భాష గురించి మాట్లాడినప్పుడు ఆయన గురించి ప్రస్తావించకుండా ఉండలేం. అందుకే తానా 23వ మహాసభల్లో ఆయన్ను కూడా స్మరించుకోవడం జరిగింది. ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో సిరివెన్నెల సమగ్ర సాహిత్యం సినిమా పాటలు మొత్తం నాలుగు సంపుటాలను ఆవిష్కరించారు. అలాగే సిరివెన్నెల సినిమాయేతర సాహిత్యం రెండు సంపుటాలను కూడా ఆవిష్కరించడం జరిగింది.  సీనియర్‌ నటులు, నిర్మాత మురళీ మోహన్‌, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్‌, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌, ఎంపీ రఘురామ కృష్ణంరాజు, టీడీ జనార్ధన్‌, నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్‌ చేతుల మీదుగా ఈ సంపుటాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిరివెన్నెల సతీమణి చేంబోలు పద్మావతి గారిని, సిరివెన్నెల కుమారులు వెంకట యోగీశ్వర శర్మను, సిరివెన్నెల సొదరుడు శ్రీరామ శాస్త్రిని తానా నేతలు సత్కరించారు.

3వ రోజున...

తానా మహాసభల ముగింపు వేడుకలు కూడా అంగరంగ వైభవంగా సాగాయి. చివరిరోజున జరిగిన కార్యక్రమానికి కూడా జనం పెద్దఎత్తున హాజరయ్యారు. వివిధ కార్యక్రమాలను కూడా జరిగాయి. అగ్రికల్చరల్‌ ఫోరం ఆధ్వర్యంలో రైతు కోసం కార్యక్రమాలను నిర్వహించారు. బహుజనాష్టకం పేరుతో కార్యక్రమం జరిగింది. ధీంతానా కార్యక్రమాలు కూడా జరిగాయి. కథాకేళీ పోటీల విజేతలను సన్మానించారు. అలూమ్ని సమావేశాలు కూడా జరిగాయి. ఐటీ సర్వ్‌ సమావేశాలు, సాహిత్య సమావేశాలు, తానా మేట్రిమోనీ, పాఠశాల పోటీలు, రీల్స్‌ అండ్‌ షార్ట్‌ ఫిలిం కాంపిటీషన్స్‌, తానా స్టార్టప్‌ లాంచ్‌పాడ్‌, ఉమెన్స్‌ఫోరం, యూత్‌, పొలిటికల్‌ ఫోరం సమావేశాలు, మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమాలు, సీనియర్‌ సిటజన్స్‌ ఫోరం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా వైభవంగా జరిపారు.

ఎన్టీఆర్‌ ట్రస్టుకు కోటి రూపాయల విరాళం 

తానా మహాసభల ముగింపు వేడుకల్లో సినీనటుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రిది విశిష్ట వ్యక్తిత్వం అని, నటనకు నిర్వచనమన్నారు. పేదల ఆకలి తెలిసిన నాయకుడు అని పేర్కొన్నారు. బసవతారకం ఆసుపత్రికి ప్రవాసులు చూపిస్తున్న ఆదరణకు ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా తానా ట్రస్టుకు తానా కార్యవర్గం తరపున కోటి రూపాయిల విరాళం ఇచ్చే చెక్కును అందించారు. మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి మాట్లాడుతూ తాను బాలయ్య అభిమానిని అని ఈ మహాసభల్లో ఆయనను సత్కరించే అవకాశం కలగడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.  డా.మూల్పూరి వెంకటరావు, నిమ్మలపూడి జనార్ధన్‌, మేక సతీష్‌లు బాలకృష్ణను ప్రత్యేక జ్ఞాపికతో సత్కరించారు. న్యూజెర్సీ అసెంబ్లీలో బాలకృష్ణ సేవలను గుర్తిస్తూ చేసిన తీర్మానాన్ని చదివి వినిపించి ఆయనకు అధ్యక్షుడు అంజయ్య, రవి తదితరులు అందజేశారు. ఈ వేడుకల్లో పలువురు దాతలను సత్కరించారు. నటి శ్రీలీల, నటుడు నిఖిల్‌ ముగింపు వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. కన్వీనర్‌ పొట్లూరి రవి వేడుకల విజయవంతానికి తోడ్పడిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇళయరాజా సంగీత విభావరి అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

 

 

Tags :