న్యూజెర్సి లో తానా సన్నాహక సమావేశం జయప్రదం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతి రెండేళ్ళకోమారు తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుకు తెచ్చేలా అంగరంగ వైభవంగా నిర్వహించే మహాసభల్లో భాగంగా ఈసారి జూలై నెలలో నిర్వహించే తానా 23వ మహాసభలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా వివిధ నగరాల్లో సన్నాహక సభలను నిర్వహిస్తున్నారు.
అమెరికాలోని గార్డెన్ స్టేట్ అని పిలిచే న్యూ జెర్సీ రాష్ట్రంలో 23వ తానా మహాసభల సన్నాహక ఫండ్ రైసింగ్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అక్కడకి వచ్చిన అశేష తెలుగువారితో ఎడిసన్ లోని రాయల్ అల్బెర్ట్స్ పాలస్ అంతటా సందడి వాతావరణం నెలకొంది. పెద్దలు, మహిళలు, పిల్లలతో ప్రాంగణం అంత కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ప్రదర్శించిన తానా సేవా కార్యక్రమాల వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగుతనం ఉట్టిపడేలా నిర్వాహకులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమనికి హాజరై, గొప్ప ఔన్నత్యంతో విరాళలు అందించిన పలువురు దాతలకు పుష్ప గుచ్చాలతో వేదిక మీదకి స్వాగతం పలికి గౌరవ మర్యాదలతో శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విచ్చేసిన తానా సభ్యులు ఇటీవలే శివైక్యం చెందిన సుప్రసిద్ధ చిత్ర దర్శకులు పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్, శ్రీమతి జయలక్ష్మి గార్లకి, సినీనటుడు నందమూరి తారక రత్నకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.
విరాళాల సేకరణకు ముందుగా తానా అధ్యక్షలు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ తానా ప్రస్థానం, నిర్వహించిన, నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాలు, ప్రవాస తెలుగువారు కష్టకాలంలో ఉన్నప్పుడు వారికి తానా భరోసాగా నిలిచిన పలు సందర్భాల గురించి అక్కడికి విచ్చేసిన తానా సభ్యులకు వివరించారు. 23వ తానా మహాసభల సమన్వయకర్త రవి పొట్లూరి మాట్లాడుతూ జులై 7,8,9 తేదిలలో జరగబోయే ప్రతిష్టాత్మక తానా మహాసభల యొక్క విశిష్టతను వివరిస్తూ, ఈ మహత్కార్యానికి ముందుకు వచ్చిన స్వచ్చంధ సేవకులకు, దాతలందరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి పలు తెలుగు సంఘాల ప్రతినిధులు హాజరై 23వ తానా మహాసభలకు వారి సంఫీుభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో తానా మహాసభల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి మందలపు, కార్యదర్శి సతీష్ తుమ్మల, డైరెక్టర్ వంశీ కోట, అడ్వైజర్ మహేందర్ ముసుకు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ కూకట్ల, తానా ఫౌండేషన్ ట్రస్టీలు విద్యా గారపాటి, శ్రీనివాస్ ఓరుగంటి, సుమంత్ రామ్, తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి, కల్చరల్ సర్వీసెస్ కోఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల, తానా ప్రాంతీయ ప్రతినిధులు వంశి వాసిరెడ్డి, సునీల్ కోగంటి, శ్రీనివాస్ ఉయ్యురు, దిలీప్ ముసునూరు, తానా మహాసభల కల్చరల్ చైర్మన్ స్వాతి అట్లూరి తదితరులు పాల్గొన్నారు. నాట్స్ కన్వెన్షన్ కోఆర్డినేటర్ శ్రీధర్ అప్పసాని, అధ్యక్షుడు బాపయ్య చౌదరి నూతి మాజీ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ తదితర నాట్స్ కార్యవర్గ సభ్యులు, ఆటా బోర్డు అఫ్ డైరెక్టర్ విజయ్ కుందూరు, ఐటీ సర్వ్ అధ్యక్షులు వినయ్ మహాజన్, టిటిఏ డైరెక్టర్ శ్రీనివాస్ గనగోని తదితరులు అతిధులుగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షులు మధు రాచకుళ్ల, సౌత్ జెర్సీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ కసిమహంతి, తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ డెలావేర్ వాలీ అధ్యక్షులు ముజీబుర్ రెహ్మాన్ తదితరులు పాల్గొని తానా మహాసభలకు సంపూర్ణ మద్దతు తెలిపారు.