ASBL Koncept Ambience

అంగరంగ వైభవంగా టిఎజిడివి గోల్డెన్‌ జూబ్లి వేడుకలు

అంగరంగ వైభవంగా టిఎజిడివి గోల్డెన్‌ జూబ్లి వేడుకలు

తెలుగు అసోసియేషన్‌ వఫ్‌ గ్రేటర్‌ డెలావేర్‌ వ్యాలీ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 7, 8 తేదీల్లో  ఫిలడెల్ఫియాలోని కింగ్‌ ఆఫ్‌ ప్రష్యాలో ఉన్న వ్యాలీ ఫోర్జ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన ఉగాది వేడుకలు, అసోసియేషన్‌ గోల్డెన్‌ జూబ్లి వేడుకలు  అందరినీ మైమరపింపజేశాయి. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలకు దాదాపు 3500 మందికి పైగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమ్యూనిటీకి సేవలు చేసిన దాదాపు ఆరుగురు ప్రముఖులను ఏప్రిల్‌ 7వ తేదీన బాంకెట్‌ డిన్నర్‌ కార్యక్రమంలో సత్కరించారు. సినీనటుడు సుమన్‌ ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా, శ్రీమతి జయ సుధ, శ్రీమతి సునీత, ఈషా రెబ్బా, నేహా కృష్ణ, ఆర్‌జె రవళి, సత్య యమణి మరియు అనుదీప్‌ దేవ్‌ గౌరవ అతిథిలుగా హాజరయ్యారు. సమాజ సేవలో ఎక్సలెన్స్‌ అవార్డును రవి మైరెడ్డిగారికి, లిటరరీ ఎక్సలెన్స్‌ అవార్డ్‌ అఫ్సర్‌ మహ్మద్‌ గారికి, ప్రొఫెషనల్‌ ఎక్సలెన్స్‌ అవార్డు మూర్తి చెంగల్వల గారికి, మహిళా సాధికారత అవార్డు షర్మిల రవికి, యూత్‌ అవార్డ్‌ను కొత్తపల్లికి, ప్రవీణ్‌ అండపల్లికి బిజినెస్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఎక్సలెన్స్‌ అవార్డును బహుకరించారు. గోల్డెన్‌ జూబ్లి వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక సావనీర్‌ను సుమన్‌ రిలీజ్‌ చేశారు. అనుదీప్‌ దేవ్‌, సత్య యామిని తమ పాటలతో అందరినీ పరవశింపజేశారు.  

ఏప్రిల్‌ 8న న్యూయార్క్‌లోని శ్రీ రంగనాథ దేవాలయం నుంచి వచ్చిన అర్చకుల ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కల్యాణం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా న్యూజెర్సీ నుండి వచ్చిన 40మందితోపాటు స్థానిక పిల్లలు ప్రదర్శించిన ‘‘శ్రీరామ పట్టాభిషేకం’ ప్రారంభ నృత్యరూపకం అందరినీ మైమరపింపజేసింది. దాదాపు 40 నిమిషాల ఈ నాన్‌స్టాప్‌ ప్రదర్శనను తిలకించిన ప్రేక్షకులు ఆ చిన్నారుల కళా ప్రదర్శనలను మెచ్చుకోవడంతోపాటు వారి ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఆ చిన్నారుల తల్లితండ్రులు ఇది మరచిపోలేని కార్యక్రమంగా నిలిచింది.

టిఎజిడివి ఎల్లప్పుడూ నృత్యం, నాటకం మరియు రంగస్థల నాటకాలకు వేదికగా నిలుస్తున్న సంగతిని తెలుస్తుందే. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఈ గోల్డెన్‌ జూబ్లి వేడుకల్లో కూడా ప్రధాన వేదికపై సాంస్కృతిక పోటీలను వైభవంగా ప్రదర్శించారు.  

ప్రైమ్‌ టైమ్‌ వేడుకలు రాత్రి 7గంటలకు ప్రారంభమైంది. ఆర్‌.జె రవళి తొలుత ప్రెసిడెంట్‌ ముజీబుర్‌ రెహ్మాన్‌ ను అధ్యక్షప్రసంగం చేయడానికి ఆహ్వనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ వేడుకలకు వచ్చిన అతిధులు, ప్రేక్షకులకు, ఇతర ప్రముఖులకు, సంఘం టీమ్‌కు ఉగాది శుభాకాంక్షలు చెబుతూ, ఈ గౌరవనీయమైన సంస్థను కమ్యూనిటీకి దగ్గరగా నడిపించడంలో గత అధ్యక్షులు చేసిన సేవను ప్రశంసించారు. తెలుగుభాష, తెలుగు సంస్కృతిని టిఎజిడివి తన కార్యక్రమాలతో పరిరక్షిస్తున్న తీరును తెలుపుతూ, తెలుగు కళలను కూడా ప్రోత్సహిస్తోందని చెప్పారు. సాంస్కృతిక, క్రీడా పోటీల్లో విజేతలకు టీఏజీడీవీ అధ్యక్షుడు ముజీబుర్‌ రెహమాన్‌ బహుమతులు అందజేశారు. 

గత యాభై సంవత్సరాలలో టిఎజిడివి విజయవంతంగా కమ్యూనిటీకి సేవ చేయడంలో పేరు తెచ్చుకున్న పలువురు ప్రముఖులను, అధ్యక్షుల గొప్పతనాన్ని తన ప్రసంగంలో ముజీబుర్‌ రెహమాన్‌ తెలియజేశారు. ఈ ప్రాంతంలో తెలుగు సమాజ బలోపేతానికి అవిశ్రాంతంగా కృషి చేసినందుకు గుర్తింపుగా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులను, వలంటీర్లు సంస్థ గత అధ్యక్షులందరినీ వేదికపై ఆహ్వానించి సత్కరించారు. శ్రీ కోటపాటి సాంబశివరావు గారు, శ్రీ దాము గేదెల గారు, శ్రీ హరినాథ్‌ దొడ్డపనేని గారు, శ్రీ రవి పోతులూరి గారు, శ్రీ మల్లిక్‌ బుధవరపు గారు, శ్రీ హరినాథ్‌ బుంగతవల, శ్రీ కిరణ్‌ కొత్తపల్లి గారిని వేదికపైకి ఆహ్వానించి సత్కరించారు.

ఈ గోల్డెన్‌ జూబ్లి వేడుకలకు ఇతర తెలుగు సంఘాల నాయకులు కూడా హాజరై టిఎజిడివి చేస్తున్న కార్యక్రమాలకు తమ మద్దతును ప్రకటించారు. నిధుల సేకరణకు సహకరించిన టిటిఎ, టిఎల్‌సిఎ, సేవా సంస్థలకు ముజీబుర్‌ రెహ్మాన్‌ ధన్యవాదాలు చెప్పారు. టిటిఎ వ్యవస్థాపకుడు శ్రీ పైళ్ల మల్లారెడ్డి టిఎజిడివికి అందిస్తున్న సహకారాన్ని సేవను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.  

ఎల్‌ఎస్‌ ప్రాపర్టీస్‌ వ్యవస్థాపకులు సురేష్‌ కాగితపు గారు ఈ ఈవెంట్‌ను విజయవంతం చేయడంలో ఆర్థిక మద్దతును అందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకకు గోల్డ్‌ స్పాన్సర్‌గా వ్యవహరించిన ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) నాయకులను ప్రేక్షకులు అభినందించారు. ఈ సందర్భంగా తానా నాయకులు జూలై 7 నుంచి 9వ తేదీ వరకు ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించే తానా 23వ తానా మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. తానా మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి, మిడ్‌ అట్లాంటిక్‌ తానా రీజినల్‌ రిప్రజెంటెటివ్‌ సునీల్‌ కోగంటి ఈ వేడుకలకు హాజరై టిఎజిడివి సభ్యులను అభినందించారు.

అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ జయంత్‌ చల్లా, మాజీ అధ్యక్షుడు పరమేష్‌ భీంరెడ్డి ఈ వేడుకలకు తమ మద్దతును తెలియజేశారు. టిఎజిడివి మాజీ అధ్యక్షుడు, నాట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హరినాథ్‌ బుంగతావల, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుల టిఎజిడివి 50వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసారు అలాగే  మే 26 నుంచి 28వ తేదీ వరకు న్యూజెర్సీలోని న్యూజెర్సీ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పోజిషన్‌ సెంటర్‌లో జరగనున్న వారి 7వ నాట్స్‌ తెలుగు సంబరాలకు ప్రేక్షకులందరినీ ఆహ్వానించారు. ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్‌, గ్రేటర్‌ ఫిల్లీ టిటిఎ మరియు ఆంధ్ర ప్రదేశ్‌ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఎఎఎ)కూడా తమ మద్దతును తెలియజేసింది. చివరన రాత్రి గ్రాండ్‌ ఫినాలే ఈవెంట్‌ జరిగింది. శ్రీమతి సునీత, వారి బృందం చేసిన సంగీత కచేరీ అందరినీ మంత్రముగ్దులను చేసింది. 

టిఎజిడివి ప్రెసిడెంట్‌ - ముజీబుర్‌ రెహమాన్‌, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ రామ్‌ మోహన్‌ రావు తాళ్లూరి, సెక్రటరీ హరీష్‌ అన్నాబత్తిన, జాయింట్‌ సెక్రటరీ మధుసూదన్‌ బుదాటి, కోశాధికారి అరవింద్‌ పరుచూరి, జాయింట్‌ ట్రెజరర్‌ సురేష్‌ బొందుగుల మరియు సభ్యులు పెద్ద శివ అనంతుని, శ్రీకాంత్‌ చుండూరి, రాజు కక్కెర్ల, నీలవేణి కందుకూరి, రాజు దీప్తి కొప్పుల, సాయి సుదర్శన్‌ లింగుంట్ల, రమణ కుమార్‌ రాకోతు, గౌరీ కర్రోతు, భాస్కర్‌ మెక్కన  తదితరులు ఈ వేడుకలకు మద్దతు తెలిపిన స్థానిక కమ్యూనిటీకి, తెలుగు సంస్థలకు టిఎల్‌సిఎ, పిటిఎతోపాటు స్పాన్సర్‌లకు వాలంటీర్లకు ఇతరులకు ధన్యవాదాలు తెలియజేసింది. 

 

Click here for Event Gallery

 

 

 

Tags :