వైభవంగా నాట్స్ సంబరాలు
ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) సంబరాలను ఈ ఏడాది వైభవంగా నిర్వహించేందుకు చికాగోలో ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు నాట్‌స అధ్యక్షుడు మన్నవ మోహనకృష్ణ, గుంటూరు మిర్చియార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు, కార్యక్రమ నిర్వాహకులు ఈ ఏర్పాట్లును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నాట్స్ అధ్యక్షుడు మన్నవ మోహన కృష్ణ మాట్లాడుతూ తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ సంబరాలను వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. జూన్ 30 నుంచి జులై 2 వరకు నిర్వహించే ఈ సంబరాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి ఈ సంబరాల ద్వారా అందరికీ తెలియజేస్తామన్నారు. పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, కవులు, కళాకారులు, సినీ దర్శకులు, పాటల రచయితలు ఈ వేడుకల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. గుంటూరు మిర్చియార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు ఈ కార్యక్రమానికి హాజరవుతుండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ నాట్స్ సంబరాల్లో తెలుగుదనం ఉట్టిపడేలా ఘనంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మన్నవ మోహనకృష్ణ ఆధ్వర్యంలో నాట్స్ ప్రతినిధి బృందం సుందర సాంస్కృతిక స్వప్నం సాకారం చేసేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే కళాకారులు, క్రీడాకారులు, రాజకీయ, సినీప్రముఖులతో మూడు రోజుల పాటు సంబరాలు జరగనున్నాయని తెలిపారు. ఈ కార్యమ్రంలో నిర్వాహకులు వంశీ వెనిగళ్ల, శ్రీనివాస్, సురేష్, తేజ తదితరులు పాల్గొన్నారు.