నాట్స్ తెలుగు పండగొచ్చింది
న్యూజెర్సిలోని ఎడిసన్‌లో ఉన్న న్యూజెర్సి కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పొజిషన్ సెంటర్‌లో మే 26 నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరిగే 7వ అమెరికా తెలుగు సంబరాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండేళ్ళకోమారు నాట్స్ నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలకు ఈసారి న్యూ జెర్సి వేదికగా నిలిచింది. తెలుగురాష్ట్రాల నుంచి ఎంతోమంది ప్రముఖులు ఈ సంబరాల్లో పాల్గొని తమ సందేశాన్ని ఇవ్వనున్నారు. తెలుగు ఆట... తెలుగు పాట సంబరాలతో హోరెత్తనున్న ఈ సంబరాల్లో సినీ తారలు కూడా అట్రాక్షన్ కానున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరిని అలరిందించేందుకు సంబరాల కమిటీ అనేక కార్యక్రమాలను నిర్వహించనుంది.
కమ్మని రుచులతో వచ్చినవారికి వడ్డించేందుకు తెలుగింటి వంటకాలను కూడా నాట్స్ ఫుడ్ కమిటీ సిద్ధం చేస్తోంది. కళా ప్రదర్శనలతో పాటు ఔత్సాహిక వ్యాపారవేత్తలకోసం బిజినెస్ సెమీనార్లు తెలుగు భాషను అభిమానించే వారికోసం సాహిత్య వేదికలను నాట్స్ సంబరాల కమిటీ సిద్ధం చేసింది. మహిళలకోసం ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసింది. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి నాట్స్ నిర్వహించే అద్భుత కార్యక్రమం కావడంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంబరాల నాయకత్వ కమిటీ అన్నీ కమిటీలతో కలిసి సమీక్షలు నిర్వహించి ఏర్పాట్లను పూర్తి చేసింది. అన్నీ కమిటీ సభ్యులు తమకు అప్పగించిన బాధ్యతలను, కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. సంబరాలను ఘన విజయం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు.
న్యూజెర్సిలో నాట్స్ నిర్వహించే తెలుగు పండుగకు అంతా సిద్ధమైంది. తెలుగు కళా వైభవాన్ని, తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా నాట్స్ అమెరికా తెలుగుసంబరాల వేడుకలు ప్రతిబింబించ నున్నాయి. తెలుగు ఆటను.. తెలుగు పాటను... తెలుగు మాటను...సాహిత్య ప్రతిభను ఇందులో ప్రతిధ్వనింప చేయనున్నది. రెండేళ్లకొక్కసారి అమెరికాలో జరిగే ఈ అతి పెద్ద తెలుగు పండుగ కోసం ఎదురుచూసేవారికి నిరాశపర్చకుండా ఆసక్తికరమైన కార్యక్రమాలను ఈసారి సంబరాల కమిటీ ప్రవేశపెట్టింది. అందులో కొత్తగా ఇంతవరకు జరగని కార్యక్రమాలు కూడా ఉండటం విశేషం. ఆధ్యాతిక ప్రముఖులు, సినీ ప్రముఖులు, కవులు, కళాకారులు, వ్యాపార దిగ్గజాలు, ఇతర రంగాల ప్రముఖులు ఇలా ఎందరో ఈ వేడుకలకోసం న్యూజెర్సికి తరలి వస్తున్నారు. సేవే గమ్యం అంటూ నాట్స్ వేస్తున్న అడుగులను, తెలుగు సంబరాల ఏర్పాట్లను చూసి పలువురు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
* నాట్స్ సంబరాల్లో హైలైట్‌గా పలు కార్యక్రమాలు నిలవనున్నాయి. పేరెంట్స్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం సంబరాలకే హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. మన తల్లితండ్రులను మనం గౌరవించుకునేలా ఈ కార్యక్రమం ఉంటుంది. అమెరికాలో నాట్స్ తెలుగమ్మాయి పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా టీన్ నాట్స్ ముద్దుగుమ్మ, మిస్ నాట్స్ కిన్నెరసాని, మిసెస్ నాట్స్ కావ్యనాయకి పేరుతో పోటీలను ఏర్పాటు చేశాము. ఈ వివిధ నగరాల్లో జరిగే పోటీల్లో విజేతలుగా నిలిచినవారు అమెరికా తెలుగు సంబరాల వేదికపై గ్రాండ్ ఫైనల్ పోటీల్లో తలపడుతారు. గెలిచిన వారికి ప్రతి కేటగిరిలో నాట్స్ కిరీటంతో పాటు నగదు బహుమతులు ఇస్తున్నారు.
* సంగీత దర్శకులు మణిశర్మ, థమన్‌లు తమ సంగీతంతో నాట్స్ సంబరాల్లో ప్రేక్షకులను అలరించనున్నారు. ఎలిజియం బ్యాండ్ కూడా సంగీతంతో యువతను ఊర్రూతలూగించనున్నది.
* ఈ సంబరాలకు గెస్ట్ ఆఫ్ హానర్లుగా జయసుధ, సాయికుమార్, ఎ. కోదండరామిరెడ్డి, చంద్రబోస్, అలీ, బి. గోపాల్, కిషోర్ కోటపల్లి వస్తున్నారు. టాలీవుడ్ అట్రాక్షన్స్‌గా మణిశర్మ, తమన్, శివమణి, గీతామాధురి, శ్రీకృష్ణ, పృథ్వీ, పార్థునేమాని, సింహ, హెబ్బా పటేల్, ఫరియా అబ్దుల్లా, గోపిచంద్ మలినేని, బాబి, ఆది సాయికుమార్, అవసరాల, హిమజ, శివజ్యోతి, జోర్దార్ సుజాత, వి.జె. సన్ని, రాకేష్, గంప నాగేశ్వరరావు తదితరులు వస్తున్నారు. ఈ తెలుగు సంబరాలకు పలువురు సాహితీవేత్తలు కూడా హాజరవుతున్నారు. కళ్యాణి ద్విభాష్యం, జ్యోతిర్మయి కొండవీటి, రామ జోగయ్య శాస్త్రి, జొన్నవిత్తుల, సిరాశ్రీ, మీగడ రామలింగశాస్త్రి తదితరులు వస్తున్నారు.
* అమెరికాలో మొట్టమొదటిసారిగా మహిళచే అవధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రథమ మహిళా శతావధాని, ఏకైక మహిళా ద్విశతావ ధాని అవధాన సరస్వతి శ్రీమతి ఆకెళ్ల బాలభాను తో అవధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శతావధాని శ్యమంతకమణిగా కూడా పేరు పొందిన శ్రీమతి ఆకెళ్ళ బాలభానుతో పాటు ఈ కార్యక్రమంలో డాక్టర్ వసుంధర కలశపూడి (దత్తపది), డాక్టర్ అపర్ణ యేలూరిపాటి (పురాణ పఠనం), డాక్టర్ వైదేహి శశిధర్ (సంచాలకులు, నృస్తాక్షరి), శ్రీమతి రాధ కాశీనాధుని (అప్రస్తుత ప్రసంగం), శ్రీమతి రాజేశ్వరి బుర్రా (అశువు), శ్రీమతి శ్యామలాదేవి దశిక (వర్ణన), శ్రీమతి ప్రభ రఘునాధన్ (చిత్ర పఠనం), డాక్టర్ శారదా పూర్ణ శొంఠి (అధ్యక్షులు, నిషిద్దాక్షరి), డాక్టర్ జననీ కృష్ణ (సమస్య)లు కూడా పాలొంటున్నారు.
* ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. శ్రీనివాస కళ్యాణం వంటి కార్యక్రమాలతోపాటు ప్రవచన కార్యక్రమాలను, కీర్తనల గానం వంటివి ఈ కార్యక్రమాల్లో చోటు చేసుకున్నాయి. శ్రీమతి కొండవీటి జ్యోతిర్మయి ప్రవచనాలు, శ్రీమతి కళ్యాణి ద్విభాష్యం అన్నమాచార్య కీర్తనలు అందరినీ అలరిస్తాయని ఆధ్యాత్మిక కమిటీ చెబుతోంది. న్యూజెర్సిలోని శ్రీ శివవిష్ణు టెంపుల్, సాయిదత్తపీఠం, ఓమ్ శ్రీబాలాజీ టెంపుల్ సహకారంతో పెద్ద ఊరేగింపును కీర్తనల గానం మధ్య నిర్వహిస్తున్నారు.
* కల్చరల్ కార్యక్రమాల్లో ఫ్యాషన్ షో, పౌరాణిక నాటకాలు, టాలీవుడ్, బాలీవుడ్ పాటలు ఆటలు వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. లెజెండ్స్ నివాళులు అర్పిస్తూ కొన్ని కార్యక్రమాలను చేస్తున్నారు. తెలుగు అమ్మాయి ఫైనల్స్ పోటీలు సంబరాల వేదికపై జరగనున్నది. నైపుణ్యం ఉన్న కళాకారులు తమ సంబరాల వేదికపై నిర్వహించే కార్యక్రమాల్లో పాలుపంచుకోవచ్చని కూడా గతంలో కల్చరల్ కమిటీ నిర్వాహకులు ఆహ్వానించిన విషయం విదితమే. స్థానిక కళాకారులు ఎందరో ఈ సంబరాల్లో పాలుపంచుకుంటున్నారు.
* మహిళల కోసం కూడా ప్రత్యేక కార్యక్రమాలను సంబరాల్లో ఏర్పాటు చేశారు. మహిళలకు మానసికోల్లాసం కలిగించేలా కార్యక్రమాలు, వనితల విఙాన వికాసానికి, అతివల ఆర్థికంగా ఎదిగేలా చేయాలన్న ఉద్దేశ్యంతో పలు కార్యక్రమా లను నాట్స్ ఉమెన్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సెమినార్‌లలో పలువురు నిష్ణాతులు పాల్గొని ప్రసంగించనున్నారు. ఇంటరాక్టివ్ సెషన్స్, గేమ్స్, ప్రైజ్‌లు, హెల్తీ వంటకాలు వంటివి మహిళలకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
* నాట్స్ సంబరాల్లో సాహిత్య అభిమానులను సంతోషపెట్టేలా కూడా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. తెలుగు భాషా కదంబం పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తెలుగు అనువాద సాహిత్యం, ఇతర విషయాలపై చర్చా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సాహిత్య సౌరభం పేరుతో మరో కార్యక్రమం కూడా సంబరాల్లో జరుగుతుంది.
* శకపురుషుల శతవత్సర సంరంభం పేరుతో పలు కార్యక్రమాలను కూడా సంబరాల ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్, ఘంటసాల, అల్లురామలింగయ్య వారిని స్మరించుకుంటూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దృశ్య శ్రవణ రూపకాలు, ప్రముఖుల ప్రసంగాలు, నృత్య ప్రదర్శనలు, నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
* సంగీత సాహిత్య సమలంకృతే పేరుతో విశ్వనాథ్, సిరివెన్నెల, వాణిజయరాం, ఎస్.పి బాలసుబ్రహ్మణ్యంకు నివాళులు అర్పిస్తున్నారు. వారికి సంబంధించిన కార్యక్రమాలను ఈ కార్యక్రమాల్లో ఏర్పాటు చేశారు.
* ఇటీవల మరణించిన మహా నటీనటులకు నివాళులర్పిస్తూ, వారు చేసిన సినిమాలను గుర్తు చేసుకుంటూ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కృష్ణ, కృష్ణంరాజు, జమున, కైకాలకు నివాళులు అర్పించనున్నారు. సృత్యంజలి పేరుతో కె. విశ్వనాథ్‌కు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా నివాళులు అర్పిస్తున్నారు.
* పారిశ్రామికవేత్తలకోసం పలు కార్యక్రమాలను బిజినెస్ కమిటీ ఏర్పాటు చేసింది. మీ బిజినెస్‌ను డెవలప్ చేసుకునేందుకు అవలంబించాల్సిన పద్ధతులపై నిష్ణాతులతో ప్రసంగాలను ఇప్పించనున్నారు. ది షార్క్ ట్యాంక్ పేరుతో స్టార్టప్‌లకు ఫండిరగ్, ప్రైజ్‌లను ఇచ్చి ప్రోత్సహించేలా కార్యక్రమాన్ని రూపొందించారు.
* జిలెనియల్ యాక్టివిటీస్ పేరుతో పలు కార్యక్రమా లకు రూపకల్పన చేశారు. తెలుగు సెలబ్రిటీలతో టీ, కాఫీ ముచ్చట్లు, తెలుగు ఎంట్రెప్రెన్యూరర్స్, స్పీడ్ డేటింగ్ పేరుతో మెట్రిమోనియల్ వంటి కార్యక్రమాలను ఇందులో ఏర్పాటు చేశారు.
* సంబరాలను పురస్కరించుకుని పలు ఆటల పోటీలను నిర్వహించారు. వాలీబాల్, టెన్నిస్ టోర్నమెంట్ వంటి క్రీడా పోటీలను ఏర్పాటు చేశారు.
ఇలా ఎన్నో కార్యక్రమాలతో మిమ్మల్ని అలరించేందుకు సంబరాల నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అందరూ తెలుగు పండుగను ఎంజాయ్ చేసేందుకు న్యూజెర్సికి తరలిరండి... నాట్స్ సంబరాల్లో పాల్గొనండి.