బాంక్వెట్ విందుతో ప్రారంభమైన నాట్స్ సమావేశాలు
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 7వ అమెరికా తెలుగు సంబరాల తొలిరోజు బాంక్వెట్ విందుతో ఘనంగా ప్రారంభమయ్యాయి. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం సుమారు 5 గంటలకు నాట్స్ సభ్యులు, స్థానిక తెలుగువారు, ఇండియా నుంచి వచ్చిన అతిథుల రాకతో వేదిక ప్రాంగణం శోభాయమానంగా తయారయ్యింది. ముందుగా రిజిస్ట్రేషన్ మరియు తేనీటి విందు తరువాత మెయిన్ స్టేజీపై జ్యోతి ప్రజ్వలనతో నాట్స్ 7వ అమెరికా తెలుగు సంబరాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.నాట్స్ కార్యవర్గ మరియు బోర్డు సభ్యులను వేదికమీదికి ఆహ్వానించి నాట్స్ సావనీర్ ని పెద్దల చేతులమీదుగా విడుదల చేశారు. అనంతరం నాట్స్ గత అధ్యక్షులు శేఖర్ అన్నే మరియు ప్రస్తుత అధ్యక్షులు బాపయ్య చౌదరి (బాపు) నూతి ప్రసంగించారు. ఈ సందర్భంగా నాట్స్ చేసిన మరియు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను వారు తెలియజేశారు.