ASBL Koncept Ambience

అభ్యాస యాప్ ఆవిష్కరణ

అభ్యాస యాప్ ఆవిష్కరణ

విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగం....విద్యాశాఖ మంత్రి డా.సురేష్‍

కరోనా లాక్‍డౌన్‍ సమయంలో విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు, ఇంట్లోనే ఉంటూ విజ్ఞానాన్ని సముపార్జించుకునేందుకు అభ్యాస యాప్‍ నకు రూపకల్పన చేశామని విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్‍ అన్నారు. ప్రతీ విద్యార్థి సమయాన్ని గుణాత్మకంగా ఉపయోగించుకోవడానికి ఉద్దేశించి తీసుకొచ్చిన సెల్ఫ్ లెర్నింగ్‍ యాప్‍ ఇదని వివరించారు. వెలగపూడి సచివాలయంలోని తన చాంబర్‍లో మంత్రి డా. సురేష్‍ అభ్యాస యాప్‍ను విద్యాశాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ లాక్‍డౌన్‍ విపత్కర పరిస్థితుల్లో ఇప్పటికే విద్యా సంవత్సరం ముగిసిందని, పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చిన్నారుల భవిష్యత్‍ దెబ్బ తినకుండా ఉండేందుకు ఈ  ఈ-లెర్నింగ్‍ యాప్‍ను తీసుకొచ్చామని వివరించారు. గూగుల్‍ ప్లే స్లోర్‍ ద్వారా ఈ యాప్‍ను డౌన్‍లోడ్‍ చేసుకుని వివిధ తరగతులకు సంబంధించిన వీడియోలు జనరల్‍ ఇంగ్లీష్‍, గణితం, భౌతిక, జీవ, సాంఘిక శాస్త్రాలకు సంబంధించిన పాఠలను నేర్చుకోవచ్చని సూచించారు.

స్వీయ నిర్బంధంలో ఉన్న విద్యార్థులు స్వీయ అభ్యాసం చేసుకునేందుకు వీలుగా యాప్‍ ఉంటుందన్నారు. అదే విధంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒక యూట్యూబ్‍ చానల్‍ను రూపొందించడం జరిగిందని తెలిపారు. ఈ యూట్యూబ్‍ ఛానల్‍ లింక్‍ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇంగ్లీష్‍ అభ్యాస పద్దతులు మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. దూరదర్శన్‍, రేడియోల్లో వచ్చిన పునశ్చరణ తరగతులు కూడా అదనంగా అందుబాటులో ఉంటాయని మంత్రి సురేష్‍ తెలిపారు. యాప్‍ ఆవిష్కరణ కార్యక్రమంలో పాఠశాల విద్య కమిషనర్‍, సమగ్ర శిక్ష ఎస్పీడీ వాడ్రేవు చినవీరభద్రుడు, ఇంగ్లీష్‍ మీడియం ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి వెట్రిసెల్వి, పాఠశాల విద్య ప్రభుత్వ సలహాదారు ఆకునూరి మురళి, అధికారులు పాల్గొన్నారు.

 

Tags :