ఎపిలో రిసార్ట్ ల ఏర్పాటుకు వి-రిసార్ట్ సిద్ధం
ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున రిసార్టులను ఏర్పాటు చేయడానికి ప్రతిష్టాత్మకమైన వి-రిసార్ట్ సంస్థ ముందుకొచ్చింది. ఆ సంస్థ సీఈవో అదితి బల్బీర్, మాసివ్ ఎర్త్ ఫండ్ సీఈవో శైలేష్ సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ప్రకృతి వ్యవసాయం ప్రతిబించేలా ఈ రిసార్టులను వినూత్న రీతిలో ఏర్పాటు చేసే ప్రతిపాదనలపై చర్చించారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యాన్ని ప్రొత్సహిస్తున్న ప్రస్తుత తరుణంలో అందుకు తగ్గ రిసార్టులను కూడా అభివృద్ధి చేయవచ్చని ముఖ్యమంత్రి వి-రిసార్ట్ సంస్థకు సూచించారు. ఈ రిసార్టులలో వెల్ నెస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ విధానంలో రిసార్టులను ఏర్పాటు చేసి, వాటిని విజయవంతంగా నిర్వహించడానికి శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించాలని సమావేశంలో సూచించారు.
ఇటువంటి దాదాపు 100 రిసార్టులను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి వి-రిసార్టు సంస్థ ఆసక్తి కనబరిచింది. దీనిలో స్థానికులకే ఎక్కువ సంఖ్యలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఈ సంస్థ ఇప్పటికే దేశంలోని 17 రాష్ట్రాలలో అతిథ్య, రిసార్టు రంగంలో పలు ప్రాజెక్టులను చేపట్టింది. వి-రిసార్టు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తే అన్ని సౌకర్యాలను కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.