బే ఏరియాలో అలరించిన ఎఐఎ దసరా-దీపావళి వేడుకలు
బే ఏరియాలో ప్రతి సంవత్సరం అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (ఎఐఎ) ఆధ్వర్యంలో జరిగే బ్రహ్మాండమైన వేడుకగా దసరా దీపావళి ధమాకా నిలుస్తోంది. ఈ సంవత్సరం కూడా ఎఐఎ, బోలీ 92.3 ఆధ్వర్యంలో ‘‘దసరా` దీపావళి ధమాకా’’ (డిడిడి) వేడుకను ఘనంగా జరిపారు. బే ఏరియాలోని 45కి పైగా భారతీయ సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. అటు వినోదం, ఇటు ఉల్లాసాన్ని కలిగించే కార్యక్రమాలు, సంప్రదాయాలను, సంస్కృతిని తెలియజేసే విన్యాసాలు వచ్చినవారందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి గ్రాండ్ స్పాన్సర్ సంజీవ్ గుప్తా సిపిఎ (బాణసంచా), డాక్టర్ ప్రకాష్ అద్వానీ (రావన్ దహన్)తోపాటు రియల్టర్ నాగరాజ్ అన్నయ్య, యుఎస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ట్రావెలాప్‌పాడ్, ఆన్‌షోర్ కేర్, ఎన్‌బిసి న్యూస్, విజేత సూపర్ మార్కెట్ కూడా ఇతర స్పాన్సర్లుగా వ్యవహరించాయి.
ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, ఎలక్టెడ్ మెంబర్స్ హాజరై అందరికీ దసరా / దీపావళి శుభాకాంక్షలు తెలియజేసారు. అలమెడ కౌంటీ సూపర్‌వైజర్ డేవిడ్ హౌబెర్ట్ (కో-హోస్ట్), ఇండియా కాన్సుల్ జనరల్ డా. శ్రీకర్ రెడ్డి, రాష్ట్ర సెనేటర్ డేవ్ కోర్టేస్, అసెంబ్లీ సభ్యులు లిజ్ ఒర్టెగా, అలెక్స్ లీ, అల్మెడ కౌంటీ సూపర్‌వైజర్లు ఎలిసా మార్క్వెజ్, లీనా టామ్, మేయర్ కార్మెన్ మోంటానో (మిల్పిటాస్), వైస్ మేయర్లు మైఖేల్ మెక్‌కోరిస్టన్, జాక్ బాల్చ్, కౌన్సిల్ సభ్యులు రాజ్ సల్వాన్, శ్రీధర్ వెరోస్ తదితరులు హాజరైనవారిలో ఉన్నారు.
రావణ్ దహన్ (30 ప్లస్ అడుగులు), బాణసంచా, మహా మంగళ్ హారతి, రథయాత్ర, డిస్కో దాండియాతోపాటు ఎఐఎ, బాటా, ఇబికె గ్రూపు నుంచి వచ్చిన గాయనీ గాయకుల లైవ్ సంగీత కచేరీ అందరినీ ఆకట్టుకుంది.
ఈ వేడుకలను పురస్కరించుకుని 100కుపైగా స్టాల్స్‌లను ఏర్పాటు చేశారు. ఆభరణాలు, దుస్తులు, హోమ్ డెకర్స్, రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. రంగోళి పోటీలు, దివ్వెల తయారీ, క్యారం, చెస్ పోటీలు, తంబోలా, కిడ్స్ ప్లే, ఫ్యామిలీ ఫ్యాషన్ షో, రామ్ లీల,ప కార్నివాల్ గేమ్స్‌తోపాటు పసందైన వంటకాలు కూడా అందరినీ మైమరపింపజేశాయి.
లక్ష్మీపూజ తరువాత లడ్డు ప్రసాదాన్ని వేలం వేశారు. ఈ వేడుకలను విజయవంతం చేసినవారందరికీ ఎఐఎ టీమ్ ధన్యవాదాలు తెలియజేసింది.