22వ తానా మహాసభలకు అంతా రెడీ!
వాషింగ్టన్ డీసి కన్వెన్షన్ సెంటర్ వద్ద తెలుగువాళ్ళ సందడి ప్రారంభం
అమెరికాలో అతి పెద్ద తెలుగు పండుగ వేడుకకు వాషింగ్టన్ డీసిలోని వాల్టర్ ఇ కన్వెన్షన్ సెంటర్ ముస్తాబైంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) రెండేళ్ళకోసారి నిర్వహించే మహాసభల్లో భాగంగా 22వ మహాసభలను అంగరంగవైభవంగా నిర్వహించేందుకు అన్నీఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రెసిడెంట్ సతీష్ వేమన సారధ్యంలోని కాన్ఫరెన్స్ బృందం ఈ మహాసభల వేడుకకు కావాల్సిన అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రపంచం నలుమూలల నుంచి వేలసంఖ్యలో వస్తున్న తెలుగువారికి ఆతిధ్యం ఇచ్చేందుకు కాన్ఫరెన్స్ నాయకులు సిద్ధమయ్యారు. మరోవైపు ఈ కాన్ఫరెన్స్‌కోసం ఇండియా నుంచి, ఇతర దేశాల నుంచి తెలుగు ప్రముఖులు వాషింగ్టన్ డీసి చేరుకుంటున్నారు. కాన్ఫరెన్స్‌కు వస్తున్నవారికోసం మారియట్ రినేసాన్స్, కోర్ట్‌యార్డ్ వాషింగ్టన్ హోటల్‌లో బసఏర్పాట్లు చేశారు. కాన్ఫరెన్స్‌కు వస్తున్నవారికోసం వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
కాన్ఫరెన్స్ నిర్వహణకోసం అధ్యక్షుడు సతీష్ వేమన సారధ్యంలో వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కాన్ఫరెన్స్‌కు చైర్మన్‌గా డా. నరేన్ కొడాలి, డా. వెంకటరావు మూల్పూరి కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. రవి గౌరినేని డిప్యూటీ కో ఆర్డినేటర్‌గా, రమకాంత్ కోయ, రఘుదీప్ మేక, అనిల్ చౌదరి ఉప్పలపాటి, రవి పొట్లూరి సభ్యులుగా ఉన్నారు. కాన్ఫరెన్స్ కార్యదర్శిగా జనార్ధన్ నిమ్మలపూడి, ట్రెజరర్‌గా నాగ్‌నెల్లూరి, జాయింట్ ట్రెజరర్‌గా కిరణ్ అమిర్నేని వ్యవహరిస్తున్నారు. కాన్ఫరెన్స్‌లో వివిధ కార్యక్రమాలకోసం ఏర్పాటు చేసిన కమిటీలకు కూడా పలువురు నాయకత్వం వహిస్తూ కాన్ఫరెన్స్ విజయవంతమయ్యేలా చూస్తున్నారు.
కాన్ఫరెన్స్‌లో ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యమైనది. సంగీత తరంగిణి పేరుతో ఏర్పాటు చేసిన సంగీత విభావరులు. సంగీత దర్శకుడు తమన్‌తో జూలై 4వ తేదీ రాత్రి సంగీత విభావరి, జూలై 5వ తేదీన గాయని సునీత సంగీత విభావరి, జూలై 6న గ్రాండ్ మెగా ఫైనల్ పేరుతో ఎంఎం కీరవాణి సంగీత విభావరిని ఏర్పాటు చేశారు. దీంతోపాటు టాలీవుడ్ సెలబ్రిటీలతో పరిచయ కార్యక్రమం, రాజకీయ నాయకుల ప్రసంగాలు హాస్యనాటికలు, స్థానిక కళాకారుల ప్రదర్శనలు, తెలుగు సాహిత్య ప్రముఖులతో ప్రసంగాలు, తానా కళ్యాణమస్తు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం, బిజినెస్ ఫోరం, యూత్, మహిళా కార్యక్రమాలతో అందరినీ అలరించేలా ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు కాలేజీరోజుల్లో తాము గడిపిన క్షణాలను మళ్ళీ గుర్తు చేసుకునేందుకు వీలుగా అలూమ్ని కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మి కార్యక్రమాలకు కూడా కాన్ఫరెన్సలో పెద్దపీట వేశారు. పలువురు ప్రముఖులతో ఆధ్యాత్మిక ప్రవచనాలు, యోగా సెషన్, విశ్వంజీ మహారాజ్ ప్రవచనం, పరిపూర్ణానంద స్వామి ప్రవచనం, వాస్తుశాస్త్రం, రుద్రాక్ష మహిమ వంటి విషయాలపై ఇందులో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
సిఎంఇ పేరుతో వైద్యశాస్త్రం వచ్చిన మార్పులపై అవగాహనకు నిష్ణాతులతో ప్రసంగాలను ఏర్పాటు చేశారు. మహిళలకోసం ప్రత్యేక కార్యక్రమాలను, యూత్‌కోసం కూడా పలు కార్యక్రమాలను కాన్ఫరెన్స్‌లో ఏర్పాటు చేశారు. దీంతోపాటు సంగీత గురువు రామాచారి ఆధ్వర్యంలో లలిత సంగీతం, అన్నమయ్య సప్తగిరి సంకీర్తనాగళార్చన పేరుతో సామూహిక గానం వంటి కార్యక్రమాలను కూడా కాన్ఫరెన్స్‌లో చూడవచ్చు. దీంతోపాటు మీకునచ్చేలా, మరెన్నో కార్యక్రమాలు కూడా ఉన్నాయి. తానా మేట్రిమోని కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. తానా స్టార్టప్ క్యూబ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.
ధీమ్‌తానా పేరుతో కమ్యూనిటీని మహాసభల్లో పాల్గొనేందుకు వీలుగా వివిధ నగరాల్లో మిస్‌తానా, మిస్‌టీన్‌తానా, మిసెస్ తానా పేరుతో అందాల పోటీలను, సోలో సింగింగ్, గ్రూపు డ్యాన్సింగ్, కపుల్ డ్యాన్స్ వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వివిధ నగరాల్లో విజేతలైన వారితో ఫైనల్ పోటీలను తానా మహాసభల వేదికపై నిర్వహిస్తున్నారు. క్యూరీ-తానా పేరుతో చిన్నారులకు సైన్స్, మ్యాథ్స్, స్పెల్‌బీ వంటి విభాగాల్లో పోటీలను నిర్వహించి ప్రతిభను కనబరిచినవారికి బహుమతులను అందించారు. పాఠశాల-తానా తెలుగు పోటీలను కూడా వివిధ నగరాల్లో నిర్వహించారు. ఫైనల్ పోటీలను తానా మహాసభల వేదికపై నిర్వహిస్తున్నారు. ఇలా వివిధ రకాల కార్యక్రమాలతో తానా 22వ మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
కాగా ఈ మహాసభలకు ముఖ్య అతిధిగా సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. మహాసభల్లో హీరోయిన్ పూజాహెగ్దే మరో ఆకర్షణగా నిలవనున్నారు. వీరితోపాటు ఎంతోమందిని తానా కాన్ఫరెన్స్‌కు రావాల్సిందిగా ఆహ్వానించింది. ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడ, తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వి. శ్రీనివాసగౌడ్, మల్లారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు మల్లు భట్టి విక్రమార్క, పయ్యావుల కేశవ్, అజయ్ పువ్వాడ,నల్లమోతు భాస్కర్‌రావు, రసమయి బాలకిషన్‌తోపాటు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్, వసంత కృష్ణ ప్రసాద్, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, గన్ని కృష్ణ, పార్లమెంట్ సభ్యులు సుజనా చౌదరి, లావు శ్రీకృష్ణదేవరాయులు, సిఎం రమేష్, టీజి వెంకటేశ్, గరికపాటి మోహన్‌రావు, రేవంత్ రెడ్డి, నామా నాగేశ్వర్‌రావు, తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వి. శ్రీనివాసగౌడ్, ఎమ్మెల్యేలు మల్లు భట్టి విక్రమార్క, పయ్యావుల కేశవ్, అజయ్ పువ్వాడ, నల్లమోతు భాస్కర్‌రావు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్, రసమయి బాలకిషన్‌తోపాటు భారతీయ జనతాపార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, గుడా చైర్మన్ గన్ని కృష్ణ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి, ఎన్టీవి చైర్మన్ నరేంద్ర చౌదరి, టీవీ5 చైర్మన్ బి.ఆర్. నాయుడు, భారత్ బయోటెక్ కృష్ణ ఎం. ఎల్లా, డా రవీంద్రనాథ్ కంచర్ల తదితరులను తానా నాయకులు ఆహ్వానించారు.
వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులను, పార్టీ నాయకులను కూడా తానా ఆహ్వానించింది. తెలుగు సాహిత్యంలో పేరుగాంచిన మేడసాని మోహన్, జొన్నవిత్తుల, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, నందిని సిధారెడ్డి, వడ్డేపల్లి కృష్ణ, సూర్యదేవర రామ్మోహన్‌రావు, కేవి. విజయేంద్ర ప్రసాద్, వంశీ, పాలపర్తి శ్యామలానంద, వాసిరెడ్డి నవీన్, అత్తాడ అప్పలనాయుడు, సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి తదితరులను కాన్ఫరెన్స్‌కు ఆహ్వానించారు. సినీరంగం నుంచి కూడా ఎంతోమందిని ఆహ్వానించారు. దర్శకుడు కే. రాఘవేంద్రరావు, శివ కొరటాల, నిర్మాతలు అశ్వనీదత్, నవీన్ ఎర్నేని, హీరోయిన్‌లు అశ్రిత వేముగంటి, కమలినీ ముఖర్జీ, పూజాహెగ్దే, రిచాపనయ్, మోనాల్ గుజ్జార్, అనసూయ, హీరోలు జగపతిబాబు, అల్లరి నరేష్, నారా రోహిత్, సుమన్, సునీల్, అజయ్, జయప్రకాశ్ రెడ్డితోపాటు యాంకర్ సుమ కూడా ఈ తానా మహాసభలకు వస్తున్నవారిలో ఉన్నారు.
సినీరంగానికి చెందిన సంగీత దర్శకులు, గాయనీ గాయకులు పలువురు కూడా ఈ కాన్ఫరెన్స్‌కు తరలివస్తున్నారు. సంగీత దర్శకులు, ఎం. కీరవాణి, థమన్‌తోపాటు గాయనీ గాయకులు సునీత, కౌసల్య, హేమచంద్ర, దీపు, ఎం. రామాచారి, శ్రీనిధి తదితరులు వస్తున్నారు. జబర్దస్త్ టీం కూడా కాన్ఫరెన్స్‌లో షో చేసేందుకు వస్తోంది. మిమిక్రీ ఆర్టిస్ట్ రమేష్‌తోపాటు యాంకర్ రవి కూడా ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటున్నారు.
కాన్ఫరెన్స్‌లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పలువురు వస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాసకళ్యాణ వేడుకలను కూడా వైభవంగా జరిపేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు.
తానా బిజినెస్ ఫోరం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కూడా పలువురు బిజినెస్ ప్రముఖులు హాజరవుతున్నారు. కపిల్‌దేవ్, వినయ్ తుమ్మలపల్లి, గారి రప్పపోర్ట్, వెంకటపతి పువ్వాడ, రాజ్ దేవులపల్లి తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఉపన్యసించనున్నారు.
పెద్దఎత్తున నిర్వహిస్తున్న ఈ తెలుగు పండుగలో అందరూ పాల్గొని కార్యక్రమాలన్నింటిని జయప్రదం చేయాలని అధ్యక్షుడు సతీష్ వేమన కోరారు.