ASBL Koncept Ambience

యాగంలో సకల సౌకర్యాలు

యాగంలో సకల సౌకర్యాలు

అయుత మహ చండీ యాగానికి వచ్చే భక్తులు, బ్రాహ్మణులు, మహిళలు, ప్రముఖులు, సీనియర్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పురోహితులకు ఏలాంటి అసౌకర్యం కలుగకుండా ఎక్కడికక్కడ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎర్రవల్లిలోని తన వ్యసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న యాగం ఏర్పాట్లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడు గంటల పాటు కాలినడకన తిరిగి పర్యవేక్షించారు. యాగాన్ని వీక్షించడానికి వచ్చే భక్తులును వివిధ కేటగిరీల వారిగా విభజించి ఎవరికి వారుగా వసతి, భోజనం, విశ్రాంతి, వీక్షణం ఏర్పాట్లు చేశారు. యాగ ప్రాంగణంలో 2000 మంది ఒకేసారి కుంకుమార్చన చేసుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని, అర్చన సామాగ్రిని కూడా ఉచితంగా అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కుంకుమార్చన నిర్వహణకు ప్రత్యేక పురోహితులతో పాటు మహిళా బ్రాహ్మణ వలంటీర్లను కూడా నియమిస్తున్నట్లు తెలిపారు. యాగ శాలకు ఎదురుగా ప్రవచానాలు, ఆధ్యాత్మిక పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, అనుగ్రహ భాషణం కోసం ప్రత్యేకంగా భారీ వేదికను ఏర్పాటు చేశారు. యాగం జరిగే రోజుల్లో ఉదయం నుండి రాత్రివరకు భక్తులను భక్తరస పరవశంలో ముంచేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

సంస్కృతిక కార్యక్రమాల నుండి భక్తులు నేరుగా యాగ శాలకు వెళ్లి యాగ కార్యక్రమాన్ని వీక్షించడానికి, ప్రదక్షిణ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. యాగం జరుగుతుండగా, ప్రత్యక్షంగా చూడటానికి వీలుగా యాగ శాల నలుదిక్కులా మహిళలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రముఖుల కోసం ప్రత్యేక గ్యాలరీలు  ఏర్పాటు చేశారు. సాధారణ భక్తులు కూడా యాగ శాలకు ఇరువైపులా దాదాపు 4000 మంది ఒకేసారి కూర్చోవడానికి అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని చండీ యాగం వలంటీర్లకు సూచించారు. శృంగేరి నుండి వచ్చే రుత్విజుల కోసం, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే బ్రాహ్మణుల కోసం, ప్రముఖుల కోసం, మీడియా ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన విశ్రాంతి శాలలను ముఖ్యమంత్రి పరిశీలించారు.

రాష్ట్రపతి, ఇతర ప్రముఖులు విడిది చేసే ప్రత్యేక కాటేజీలను సందర్శించిన ముఖ్యమంత్రి వాటిలో ఎసి, ఫ్రిజ్‌, టాయిలెట్లు, ఇతర సదుపాయలను సమకూర్చడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులకు అవసరమైన సమాచారం అందించడానికి సమాచార కేంద్రాన్ని, వ్యాఖ్యాతలను, ఆరోగ కేంద్రాన్ని అంబులెన్స్‌లను, అగ్నిమాపక దళాలను, రెస్క్యూ టీమ్‌లను అందుబాటులో ఉంచారు. పార్కింగ్‌ స్థలాన్ని భోజనశాలను కూడా ముఖ్యమంత్రి సందర్శించి  సౌకర్యాలు, ఏర్పాట్లపై ఆరా తీశారు.

 

Tags :