ఎన్నికల్లో సత్తాకు మజ్లిస్ వ్యూహం
తెలంగాణలో ఈసారి జరిగే ముందస్తు ఎన్నికల్లో తమకు పట్టు ఉన్న స్థానాల్లోనే కాకుండా ఇతర చోట్ల కూడా తమ బలాన్ని పెంపొందించుకోవాలని ఆల్ ఇండియా మజ్లిస్-ఏ- ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (మజ్లిస్) పార్టీ అనుకుంటోంది. ఇందుకు అనుగుణంగా వ్యూహాన్ని కూడా రచిస్తోంది. 1959లో ఎంసీహెచ్ ఎన్నికల్లో రెండు కార్పొరేట్ సీట్లను గెల్చుకుని రాజకీయ ప్రస్థానం చేసిన మజ్లిస్ పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ 2014లో గ్రేటర్ హైదరాబాద్ పార్లమెంట్ సీటుతోపాటు ఏడు ఎమ్మెల్యే సీట్లు, 2015లో 45 కార్పొరేటర్ సీట్లను దక్కించుకుంది. ముందస్తు ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గంలో కనీసం రెండు అసెంబ్లీ సీట్లను చేజిక్కించుకునేందుకు వ్యూహాలు పన్నుతోంది. గత ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి రాజేంద్రనగర్‌లో స్వల్ప మెజారిటీతో ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. పైన పేర్కొన్న మూడు నియోజకవర్గాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందే అభ్యర్థుల కోసం మజ్లిస్ వేట ప్రారంభించింది.
హైదరాబాద్ పార్లమెంట్ నియోజవర్గంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రస్తుతం మజ్లిస్ పార్టీకి కంచుకోటగా ఉంటోంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లో మరిన్ని సీట్లను పెంచుకోవాలనే ఆలోచనతో మజ్లిస్ అధినాయకులు ఉన్నారు. పాతబస్తీలో గత కొన్నేళ్లుగా పాతుకుపోయిన మజ్లిస్ ముందస్తు ఎన్నికలపై వ్యూహాలను పన్నుతోంది. మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ గ్రేటర్ హైదరాబాద్‌లో మరిన్ని సీట్లు గెలుచుకునేందుకు వ్యూహరచనలు చేస్తున్నారు. ముందస్తు ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సిట్టింగులకే ప్రధాన్యతనిచ్చిన ఓవైసీ.. చార్మినార్‌కు యాకుత్‌పుర మాజీ ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్‌ను, చార్మినార్ మాజీ ఎమ్మెల్యే సయ్యద్ పాషా ఖాద్రిని యాకుత్‌పుర అభ్యర్థిగా పేర్లను ఖరారుచేశారు. చాంద్రాయణగుట్ట నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ, కార్వాన్ నుంచి కౌసర్ మహ్మద్ ఖాన్, మలక్‌పేట్ నుంచి అహ్మద్ బీన్ అబ్దుల్లా బలాల, నాంపల్లి నుంచి జాఫర్ హుస్సేన్ మీరాజ్, బహదుర్‌పుర నుంచి మోజంఖాన్ పోటీ చేయనున్నట్లు ఎంఐఎం ప్రకటించింది.
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి పట్టుసాధించిన మజ్లిస్ కన్ను సికింద్రాబాద్ పార్లమెంట్‌పై పడింది. ఇక్కడ కనీసం రెండు అసెంబ్లీ సీట్లను గెలుచుకోవాలనే ఆశతో మజ్లిస్ పావులుకదుపుతోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలో మున్సిపల్ సీట్లను గెలుచుకున్నప్పటికీ మజ్లిస్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం గ్రేటర్ హైదరాబాద్‌పైనే ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పవచ్చు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ అభ్యర్థులుగా జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్‌లో పోటీచేసి స్వల్ప మెజారిటీతో ఓటమిపాలయ్యారు. ఈసారి ఎన్నికల్లో రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్‌తో పాటు ఖైరతాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల నుంచి తమ అభ్యర్థులను బరీలోకి దింపేందుకు మజ్లిస్ సిద్ధమవుతోంది. ఈ కోణంలో పార్టీ అధినేత.. తాజా మాజీ ఎమ్మెల్యేలతోపాటు గ్రేటర్ పరిధిలోని కార్పొరేటర్‌లతో సమావేశాలు జరుపుతున్నారు. టీఆర్‌ఎస్‌తో మజ్లిస్ పొత్తుపెట్టుకున్నట్లయితే గ్రేటర్‌లో మాత్రం సీట్ల సంఖ్యను పెంచుకునేందుకే మొగ్గుచూపుతుంది. టికెట్ల కోసం దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయ. దరఖాస్తులను పరిశీలిస్తున్నామని అధినాయకత్వం పేర్కొంటోంది.
కాగా ఈ ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల మొదటి జాబితాను కూడా మజ్లిస్ పార్టీ విడుదల చేసింది. మజ్లిస్ పార్టీ ఏడుగురు అభ్యర్థులతో కూడిన జాబితాను మంగళవారం వెల్లడించింది. చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముంతాజ్ ఖాన్, యాకుత్ ఫురా నుంచి సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రిలు పోటీ చేస్తారు. మజ్లిస్ మొదటి జాబితాలో సిట్టింగు ఎమ్మెల్యేలు అయిన అక్బరుద్దీన్ ఒవైసీ (చాంద్రాయణగుట్ట), ముహమ్మద్ మోజం ఖాన్ (బహదూర్ పురా), అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల (మలక్ పేట), జాఫర్ హుసేన్ మేరాజ్ (నాంపల్లి), కౌసర్ మొహియుద్దీన్ (కార్వాన్)లకు టికెట్లు ఖరారు చేశారు.