ఘనంగా ప్రారంభమైన ఆటా-టాటా కన్వెన్షన్ వేడుకలు
అమెరికా తెలుగు సంఘం(ఆటా)-తెలంగాణా అమెరికన్ తెలుగు సంఘం(టాటా)ల సంయుక్త ఆధ్వర్యంలో ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటరులో అమెరికన్ తెలుగు కన్వెన్షన్ వేడుకలు గురువారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి, అమెరికా నలుమూలల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గంటా శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి పెద్దిరెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సినీనటి శ్రేయ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తానా, నాటా, నాట్స్, టాంటెక్స్ సంస్థల ప్రతినిధులు కూడా వేడుకలకు హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ఎన్నారైలకు ఆటా-టాటాలు పురస్కారాలను అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
వేడుకల్లో ఆటా అధ్యక్షుడు కరుణాకర్ అసిరెడ్డి మాట్లాడుతూ, నేడు పలు చోట్ల కొత్త కొత్త తెలుగు సంఘాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆటా వంటి ప్రాచీన చరిత్ర ఉన్న సంస్థ టాటా వంటి ప్రతిష్టాత్మక సంస్థతో కలిసి ఈ వేడుకలను నిర్వహించడం సంతోషంగా ఉందని కరుణాకర్ పేర్కొన్నారు.
టాటా అధ్యక్షుడు హరనాథ్ పొలిచెర్ల మాట్లాడుతూ, రెండు జాతీయ సంఘాలు కలిసి నిర్వహిస్తున్న ఈ వేడుకలు అందరి మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తుందని చెప్పారు. ఈ వేడుకలకు దాదాపు 2,000 మంది హాజరయ్యారు. మరో రెండురోజులపాటు జరిగే వేడుకల్లో మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు.