మోదీకి కర్ణాటకవాసి ఆతిథ్యం
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి కర్ణాటకవాసీ ఆతిధ్యమిచ్చారు. మోదీకి అవసరమైన ఆహార పదార్థాలను ఉడుపి జిల్లా కుందాపుర వాసి ఆనంద్ పూజారి సమకూర్చారు. ఆనంద్ 35 ఏళ్లుగా వాషింగ్టన్ డీసీలో నివసిస్తున్నారు. భార్య సునీతతో కలిసి 25 ఏళ్లుగా ఉడ్‌ల్యాండ్ హోటళ్లను నిర్వహిస్తున్నారు. భారత్ నుంచి అమెరికాకు వచ్చే ప్రముఖులకు గత కొన్నేళ్లుగా ఆయన ఆదిథ్యం ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రధానికి ఆనంద్ పూజారి నేతృత్వంలోని బృందం మూడోసారి ఆతిధ్యం సమకూర్చింది. అమెరికాలో మోదీని ఆనంద్ పూజారి దంపతులు నాలుగుసార్లు కలిసినట్టు వారు తెలిపారు.
మోదీ అమెరికాలో ఉన్నా భారతీయశైలి వంటకాలకు ప్రాధాన్యమిచ్చేవారని, ప్రత్యేకించి దక్షిణ భారత రుచుల పట్ల ఆసక్తి చూపేవారన్నారు. అమెరికాలోనూ పూర్తి శాకాహార భోజనానికే ప్రాధాన్యం ఇచ్చారన్నారు. తాను తరచూ స్వరాష్ట్రానికి వచ్చే వాడినని, కొవిడ్ వల్ల ఇటీవల రాలేదని ఆనంద్ పూజారి తెలిపారు.