నాటా ఆధ్వర్యంలో తిరుమలలో ఘనంగా జరిగిన అన్నమయ్య అష్టోతర శత సంకీర్తన ఉత్సవం
ప్రతి రెండు ఏళ్లకు ఒకసారి నాటా నిర్వహించే సేవా డేస్ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంకి చెందిన చైతన్య సోదరులు మరియు వారి శిష్య బృందం ఆధ్వర్యంలో ‘అన్నమయ్య అష్టోతర శత సంకీర్తన ఉత్సవం’ అఖిలండ కోటి బ్రహ్మాండ నాయకుని సన్నిధి తిరుమలలో ఘనంగా జరిగింది. డిసెంబర్ 18వ తేదీ ఉదయం 7 గంటలకు నాటా బోర్డ్ డైరెక్టర్ సుధారాణి జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభం అయిన ఈ సంకీర్తన ఉత్సవం 14 గంటలపాటు నిర్వీరామంగా సాగింది. ఈ సందర్భంగా శ్రీమతి సుధారాణి మాట్లాడుతూ సేవా డేస్ లో భాగంగా ఇంత చక్కటి సంగీత కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం తనకు లభించడం ఆ భగవంతుడి ఆశీస్సులుగా భావిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమం శ్రీ చైతన్య అన్నమయ్య అసోసియేషన్, విశాఖపట్నం వారి సహకారంతో గురువులు శ్రీ చైతన్య బ్రదర్స్ వారణాసి వెంకటేశ్వర శర్మ, బుక్కపట్నం కృష్ణమాచార్యులు వారి 108 మంది శిష్య బృందం విశాఖపట్నం నుంచి బయలుదేరి తిరుమల కొండమీద శృంగేరి శంకరమఠం వేదికగా జరిగింది. ఈ కార్యక్రమం లో 108 అన్నమయ్య కీర్తనలు 108 మంది భక్తులు ఆలపిస్తూ సాయంత్రం పది గంటలవరకు నిరాటంకంగా కొనసాగిందని తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి వర్జీనియా నుంచి విచ్చేసిన నాటా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ రెడ్డి భట్టినబట్ల మాట్లాడుతూ ఇలాంటి అత్యద్భుతమైన భక్తి సంగీత కార్యక్రమంలో నాటా తరపున పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని ఇంతచక్కటి కార్యక్రమాన్ని 2023లో జరిగే మా నాటామహాసభలలో కూడా ప్రదర్శించాలని చైతన్య బ్రదర్స్‌కి ఆహ్వానం పలికారు.
చైతన్య బ్రదర్స్ మాట్లాడుతూ నాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సుధారాణి సహకారం మరియు సౌజన్యంతో ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని తిరుమల కొండమీద నిర్వహించగలిగామని, గతంలో కూడా ఫిలడెల్ఫియా మహాసభల్లో ప్రదర్శించే అవకాశాన్ని కూడా ఇచ్చినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలియజేశారు.
నాటా అధ్యక్షులు శ్రీధర్ కొర్శపాటి గారికి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళ రామిరెడ్డి గారికి మరియు నాటా సేవా డేస్ టీమ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నారు.
ఈ కార్యక్రమానికి నాటా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ రెడ్డి గారికి, అన్నమయ్య ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ విభీషణ్ శర్మ, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బాలిరెడ్డి, అన్నమయ్య వంశానికి చెందిన 12వ తరం వారసులు తాళ్లపాక రాఘవ అన్నమాచార్యులు ప్రత్యేక అతిధులుగా విచ్చేశారు. అతిధులు అందరికీ నాటా తరపున శ్రీమతి సుధారాణి సన్మానం చేశారు.