టీఆర్ ఎస్ లోకి ఎల్బీనగర్ ఎమ్మెల్యే
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎల్బీనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌కు జై కొట్టారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించినట్టు సమాచారం. కేటీఆర్‌తో భేటీ తర్వాత సుధీర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధిపై కేటీఆర్ పూర్తిస్థాయిలో హామీ ఇచ్చారని తెలిపారు. ఎల్బీనగర్ చెరువుల సుందరీకరణ, బీఎన్‌రెడ్డి కాలనీల రిజిస్ట్రేషన్ల సమస్య, ఎల్బీనగర్‌లో పెంచిన ఆస్తి పన్ను సమస్య పరిష్కారానికి సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు. నగరాభివృద్ధి కోసం కేటీఆర్ బాగా పనిచేశారని, వ్యూహాత్మకమైన ప్రణాళికతో ముందుకెళ్లారని అభినందించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయని, అందుకే కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు సృష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో సీఎం కేసీఆర్‌తో సమావేశమవుతానని వెల్లడించారు.