ఎపి పోరు రసవత్తరం..
రాష్ట్ర విభజన అనంతరం పలు కష్టాల్ని ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు జరగనున్న ఎన్నికలు అత్యంత కీలకమైనవి. రాజధాని అమరావతి, పోలవరం వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణం కీలక దశలో ఉంది. విభజన తర్వాత ప్రధానంగా వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోయిన ఏపీకి ఇప్పుడిప్పుడే ఐటీ, పారిశ్రామిక, ఉత్పాదక రంగాల తోడ్పాటు లభిస్తోంది. విభజన గాయాలు ఇప్పుడిప్పుడే మానుతున్నాయి. కానీ ఆర్థిక లోటు ఇప్పటికీ వేధిస్తోంది. తలసరి ఆదాయంలో మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ బాగా వెనుకబడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జరగనున్న ఎన్నికలు ఏ కోణంలో చూసినా అత్యంత కీలకమైనవే. అందుకే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓవైపు తెలుగుదేశం పార్టీ, మరోవైపు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంకోసం సాగిస్తున్న పోటాపోటీ ప్రచారంతో ఈ పోరు రసవత్తరమైంది.
ఈ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకునేందుకు అన్ని రాజకీయ పక్షాలు అమీతుమీకి సన్నద్ధమౌతున్నాయి. నవ్యాంధ్రలో తొలిసారి అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ మరోమారు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతిపక్షానికే పరిమితమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు సమాయత్తమవుతోంది. జనసేన అధికారం చేజిక్కించుకునే అంశంలో కీలకంగా మారేందుకు వ్యూహాత్మకంగా ఎత్తుగడలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఓటర్లను ఆకర్షించేందుకు తమదైన శైలిలో ముందుకు సాగుతోంది. గతంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లోనైనా తన శక్తిని చూపించాలని తపిస్తోంది. అన్నీపార్టీలు తమ బలాబలాలను ప్రదర్శిస్తుండటంతో ఎపిలో పోరు రసవత్తరమైంది.
నిన్నమొన్నటి వరకూ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందా అన్న అంశంపై జరిగిన చర్చకాస్తా ఈసారి ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లు రాబోయతున్నాయి, ఎవరెవరు గెలవబోతున్నారనే అంశంపై మళ్ళింది. ప్రధాన పార్టీల అభ్యర్ధుల ఎంపిక దాదాపుగా పూర్తికావడంతో గెలుపు గుర్రాలపై లెక్కలు వేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్ధుల జాబితాలను సిద్ధం చేసుకున్న ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల పద్యవ్యూహాన్ని ఛేదించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఎవరి తరహాలో వారు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు వారివారి వ్యూహాలను అమలు పర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీలు యుద్ధప్రాతిపదికన సమర సన్నాహాలను ప్రారంభించాయి. తెదేపా, వైకాపా, జనసేన, కాంగ్రెస్ పార్టీలు ఎవరి వ్యూహాలను వారు వేసేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. జిల్లాలవారీగా వివిధ మార్గాల ద్వారా తెచ్చుకున్న నివేదికలు ముందేసుకుని గెలుపు గుర్రాలను అన్వేషిస్తున్నారు. ఆర్థిక బలం, అంగబలం, అర్థబలం ఉన్నవారు పార్టీలో చేరేందుకు ఉత్సాహంగా ఉంటే వారిని తక్షణమే పార్టీలోకి చేర్పించుకుని వారు కోరుకున్న స్థానాన్ని కట్టబెట్టేందుకు కూడా వెనకాడటం లేదు.
ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీ ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు సామాజిక పింఛన్లను రూ. 2 వేలకు పెంచడంతోపాటు మహిళలకు పసుపు-కుంకుమ కింద రూ. 10 వేలు ప్రకటించింది. అలాగే స్మార్టు ఫోన్ ఇస్తామంటూ మరో హామీ ఇచ్చింది. యువతకు నిరుద్యోగ భతి, పెండింగ్‌లో ఉన్న రుణమాఫీ కిస్తీల చెల్లింపు ఇలా ఒక్కొక్కటీ ప్రకటిస్తూ ముందుకు సాగుతోంది. అన్నదాత సుఖీభవ పథకం అమలుకు శ్రీకారం చుట్టడం ద్వారా రాష్ట్రంలో 70 శాతం మేర ఉన్న గ్రామీణ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది. టీడిపి ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు ప్రతిపక్ష వైకాపా కూడా తానేమీ తక్కువ కాదంటూ అధినేత జగన్ మోహన్ రెడ్డి అనేక వాగ్దానాలు చేస్తున్నారు. ఇప్పటికే రైతు భరోసా, అమ్మ ఒడి, సామాజిక పింఛన్ల పెంపు వంటి అనేక కార్యక్రమాలను ప్రకటించారు. అయితే సామాజిక భధ్రతా పింఛన్లను చంద్రబాబు రూ. 2 వేలు ప్రకటించిన నేపథ్యంలో జగన్ తాను అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని క్రమంగా పెంచుతూ రూ. 3 వేలు చేస్తానంటూ ప్రకటించారు. మరో పార్టీగా ఉన్న జనసేన కూడా అభ్యర్ధులను ఇప్పటి వరకూ ప్రకటించకపోయినా ఎన్నికల బరిలో తాము ఉన్నా మంటూ అధినేత పవన్ కల్యాన్ చెబుతున్నారు. ఇప్పటికే అనేక వాగ్దానాలను చేస్తూ ప్రజా యాత్రలు చేస్తున్నారు.
కాంగ్రెస్ రాష్ట్రంలో పూర్వ వైభవం కోసం పాకులాడుతోంది. తాము అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల రుణమాఫీతోపాటు మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటూ హామీలు గుప్పిస్తోంది. ఈనేపథ్యంలో రాష్ట్రంలో ఎవరికి వారే ప్రచారంలో ముందుకు దూసుకెళ్ళేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
అభివృద్ధి, సంక్షేమంపై నమ్మకం
ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన అభివద్ధి, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయానికి దోహదం చేస్తాయన్న నమ్మకంతో తెదేపా ఉంది. ఇటీవలకాలంలో అమలు చేసిన పసుపు-కుంకుమ, వద్ధాప్య పింఛన్లను రూ. వెయ్యి నుండి రూ. 2 వేలకు పెంచడంతోపాటు ఇతర పింఛన్ల మొత్తాన్ని కూడా పెంచారు. అన్నదాత సుఖీభవ వంటి పథకాలు విశేష ఆదరణ పొందాయని పార్టీ భావిస్తోంది. ఎన్టీఆర్ క్యాంటీన్ వంటి సౌకర్యాలు కూడా ప్రజలు తమవైపు మొగ్గు చూపడానికి ఉపయోపడుతాయని అనుకుంటోంది.
అభ్యర్థుల ఎంపికలో తెదేపా ముందంజ
అధికార తెదేపా ఎన్నికల సన్నద్ధతలో మిగతా రాజకీయ పార్టీలకంటే ఒకడుగు ముందే ఉంది. ముఖ్యంగా అభ్యర్ధుల్ని ఖరారు చేయడంలో గతానికి భిన్నంగా పనిచేసింది. ఇప్పటికే 60 శాతంపైగా అభ్యర్ధులను పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. వారిలో కొందరు ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. చిత్తూరు వంటి జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్ధులను ముఖ్యమంత్రి ఆరునెలల క్రితమే ఖరారు చేశారు. రెండు మూడు వారాలుగా ఆయన పూర్తిగా అభ్యర్ధుల ఎంపికపైనే దష్టిపెట్టారు. రోజుకు 2 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని శాసనసభ స్థానాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలతో ముఖాముఖి సమావేశమై అభ్యర్ధిత్వం ఖరారు చేసిన వారికి వెళ్లి పని చేసుకోవాలంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
వైకాపా వాగ్దానాలు, పాదయాత్రలు..
2014 ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైన వైకాపా ఈసారి ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ ఎన్నికల కోసం వైకాపా అధినాయకత్వం మూడున్నరేళ్ల నుండే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ వచ్చింది. అప్పట్లోనే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌లను వినియోగించుకుంది. ఆయన బందం క్షేత్ర స్థాయిలో నియోజకవర్గాల వారీగా పార్టీ బలాలు, బలహీనలతు, పార్టీ అభ్యర్ధులుగా ఎవరిని ఖరారు చేస్తే లాభిస్తుంది వంటి అంశాలపై సర్వేలు నిర్వహించింది. వాటి ఆధారంగా కొన్ని జిల్లాల్లో. నియోజకవర్గాల్లో నాయకత్వ మార్పలు చేర్పులు చేపట్టింది. ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించి వాటిని ప్రజల్లోకి విస్తతంగా తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయి కార్యక్రమాల అమలు వంటివి చేపడుతూ వచ్చింది. 31 మంది నేతలతో పార్టీ మేనిఫెస్టో కమిటీని వేసి కసరత్తును కొలిక్కి తీసుకు వస్తోంది. 2017లో గుంటూరులో నిర్వహించిన పార్టీ ప్లీనరీలో వైకాపా మేనిఫెస్టోలో ఉండబోయే ప్రధాన హామీలైన నవరత్నాలను జగన్ ప్రకటించారు.
ప్రత్యేక హోదా అంశంపై పూర్తిగా దష్టి సారించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి యువ భేరీలు పేరుతో విశ్వవిద్యాలయాలు, డిగ్రీ తత్సమాన విద్యార్ధులు, నిరుద్యోగ యువతతో రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహించారు. హోదా అంశమే అజెండగా ఎన్నికలకు వెళతామని, ఎన్నికలయ్యాక కేంద్రంలో ఎవరు హోదా ఇస్తే వారి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిస్తామని జగన్ ప్రకటించారు. 2017 నవంబరులో ప్రారంభించి 2019 జనవరి వరకూ 14 నెలలపాటు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సమయంలోనే జిల్లాల్లో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియపైనా కసరత్తు చేశారు. రావాలి జగన్-కావాలి జగన్ అంటూ కొత్త ప్రచార కార్యక్రమానికి వైకాపా శ్రీకారం చుట్టంది. మరో వైపు పార్టీ అధ్యక్షుడు జగన్ స్వయంగా జిల్లాలవారీగా సమర శంఖారావం పేరుతో ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. తిరుపతిలో ప్రారంభించిన ఈ సభలు ఇప్పటివరకూ కడప, అనంతపురం, నెల్లూరులో పూర్తికాగా, సోమవారం కాకినాడలో పూర్తయింది. గురువారం విజయవాడలో ఈ కార్యక్రమం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో జగన్ ఇప్పుడు బస్సు యాత్రను కూడా ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు.
హోదా హామీతో పాగాకు కాంగ్రెస్ యత్నం
గత ఎన్నికల్లో రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ద్వారా తమ అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి సర్వశక్తులనూ ఒడ్డుతోంది. ప్రత్యేక హోదా అజెండాగా రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ, శాసనభ స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా 4 సార్లు రాష్ట్రంలో పర్యటించి పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం చేస్తామని ప్రకటించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ ఎంత ప్రాధాన్యం ఇస్తుందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఇంటింటికీ కాంగ్రెస్ పేరుతో రాష్ట్రంలోని బూత్ స్థాయిలోని ప్రతి ఇంటికీ వెళ్లింది. తాజాగా ప్రత్యేక హోదా భరోసా యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. అభ్యర్థుల తుది జాబితా కూడా అధిష్టానం ఆమోద ముద్రకోసం ఢిల్లికి పంపించారు. ఈనెల 15 నుంచి రాహుల్ విదేశీ పర్యటన వున్నందున ఈలోగానే జాబితా వెల్లడించే అవకాశం వుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
జనసేన ఎన్నికల శంఖారావం
గత ఎన్నికల్లో తెదేపాకు మద్దతిచ్చిన జనసేన ఈసారి వామపక్షాలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతుంది. ఎక్కువ మంది కొత్తవారికే టిక్కెట్లు ఇవ్వనుంది. అభ్యర్థుల ఎంపికకు దరఖాస్తులను ఆహ్వానించగా రాష్ట్రవ్యాప్తంగా 1,410 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీ టిని వడపోస్తున్నారు. వామపక్షాలతో రెండు, మూడు రోజుల్లో పొత్తు ఖరారు కానుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే అన్ని జిల్లాల పర్యటన ఒక విడత పూర్తి చేశారు. ప్రధానంగా ఆపార్టీ తమ అధినేత పవన్ కల్యాణ్ గ్లామర్‌పైనే ఆధారపడుతోంది. బలమైన అభ్యర్ధులకోసం విస్త తంగా అన్వేషిస్తుంది.
గత ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీతో కలిసి సీపీఎం, విడిగా సీపీఐ పోటీచేశాయి. ఈసారి జనసేన పార్టీతో కలిసి ఈ రెండు పార్టీలు ఎన్నికలకు వెళ్లనున్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐల మధ్య పొత్తు విషయంలో రాష్ట్ర స్థాయిలో ఎలాంటి ఒప్పందం లేకపోయినా కొన్ని చోట్ల స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రెండు పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేశారు. ఈ సారి ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే జనసేనతో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకష్ణ రెండు విడతులగా చర్చలు జరిపారు. జిల్లాకు రెండేసి చొప్పున ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని వామపక్షాలు కోరుతున్నాయి.
భాజపా ఒంటరి పోరే
2014 ఎన్నికల్లో తెదేపాతో కలసి పోటీ చేసిన భాజపా ఈసారి ఒంటరిగా బరిలో దిగుతోంది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, సర్జికల్ దాడులు, రాష్ట్రంలో జాతీయ నాయకుల పర్యటనలు పార్టీకి కలిసొస్తాయని భాజపా భావిస్తోంది. గెలపు అవకాశాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దష్టి సారిస్తోంది. రాష్ట్రంలో విశాఖపట్టణం, కర్నూలు, నర్సాపురం, ఒంగోలు వంటి 10 లోక్‌సభ స్థానాలపై ప్రత్యేక దష్టి పెడుతోంది.