ASBL Koncept Ambience

మీ నమ్మకాన్ని వమ్ముచేయను: చంద్రబాబు

మీ నమ్మకాన్ని వమ్ముచేయను: చంద్రబాబు

విశాఖలో జరిగిన మహానాడులో తెదేపా కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలువురు నేతలు వేదికపైకి వచ్చి ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం చంద్రబాబు వేదిక నుంచి చేసిన కీల‌క ప్ర‌సంగం ఆయన మాటల్లోనే..

‘విశాఖలో సింహాద్రి అప్పన్న సాక్షిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశా. ఈ మహానాడులో 34 తీర్మానాలు ప్రవేశపెట్టాం. 94 మంది మాట్లాడారు. 27 గంటలు చర్చలు జరిగాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచంలో వస్తున్న వాటిని చర్చించి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలని ఆలోచించే విశిష్టత తెదేపాది. ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. విశాఖలో మహానాడు చాలా బాగా జరిగింది. ఇంత బ్రహ్మాండంగా ఏ మహానాడూ జరగలేదు. వేదిక దగ్గర నుంచి బ్రహ్మాండంగా రూపకల్పన చేశారు’.

‘ఏపీకి జీవనాడి పోలవరం ద్వారా రాష్ట్రంలో కరవు లేకుండా చేసేందుకు త్వరితగతిన ముందుకెళ్తున్నాం. విశాఖలో హుద్‌హుద్‌ తుపానులో పూర్తిగా దెబ్బతిన్నాం. విశాఖ అంటే ఒక నమ్మకం. ఇక్కడి ప్రజలు చాలా మంచి వాళ్లు. విశాఖ ఉక్కు కోసం ఎలా పోరాడారో.. తుపాను ధాటికి ధ్వంసమైన నగరాన్ని మళ్లీ బ్రహ్మాండమైన నగరంగా తీర్చిదిద్దాలని ఉక్కు సంకల్పంతో ముందుకొచ్చారు. ఇదో గొప్ప విజయం. కష్టాలొస్తే దిగులుబడిపోతాం. మనవల్ల కాదనుకుంటాం. ఏం చేయగల్గుతాం లే. అది ఇంతే అనే ఆలోచనలు వస్తాయి. కానీ ఈ రోజు చూస్తే.. విశాఖ వాసులు ముందుకొచ్చారు. విశాఖను సుందర నగరంగా తిర్చిదిద్దుకొని ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారు’.

‘అవసరం వచ్చినప్పుడు ముందుకు రావడం నా నైజం. శ్రీకాకుళం, నాగావళి, వంశధారలను అనుసంధానం చేస్తాం.ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్‌ -1ను ప్రారంభిస్తున్నాం. రూ.2వేల కోట్లతో ఏడాదిలోగా పూర్తిచేస్తాం. 2018లోగా లక్షా 30వేల 866 ఎకరాలకు నీరు అందేలా చర్యలు తీసుకుంటాం. కోటవురట్ల, నర్సీపట్నం ప్రాంతాలకు సుజల స్రవంతి ద్వారా నీరందిస్తాం. తెదేపాకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రతి కార్యకర్త నిరంతరం పార్టీ కోసం పనిచేశారు. ఇబ్బందులు ఉన్నా వెనుతిరిగి చూడలేదు. ప్రాణాలు పోయినా తెదేపా ఉండాలని కోరుకున్న కార్యకర్తలందరికీ వందనం. అందరం సమష్టిగా పనిచేయడమే ఈ విజయానకి కారణం. సమాజం కోసం పనిచేయాలి. అదే సమయంలో పార్టీ కార్యకర్తలకు గౌరవం ఇవ్వాలి. వారిని ఆదుకోవాలి. వారి మనోభావాలను అర్థంచేసుకొని పనిచేయాల్సిన గురుతర భాద్యత నాయకులపై ఉంది’.

Click here for Photogallery

Tags :