ASBL Koncept Ambience

నవ్యాంధ్ర ప్రజల భవిష్యత్తు కోసం అమెరికా వీధుల్లో బాబు నడక

నవ్యాంధ్ర ప్రజల భవిష్యత్తు కోసం అమెరికా వీధుల్లో బాబు నడక

(చెన్నూరి వెంకట సుబ్బారావు)

ఓ పక్క వర్షం, మరోపక్క కాలినడక ... నవ్యాంధ్ర భవిష్యత్తు ముందు ఇది శ్రమ కాదనుకునే మనిషి. తనను గెలిపించిన ప్రజలకు ఏదైనా మేలు చేయాలన్న తపనే ఆయనకు ఎంతోమంది అభిమానులను సంపాదించి పెట్టింది. ఆయన ఆంధ్రలో ఉన్నా, అమెరికాలో ఉన్నా ఎంతోమంది ఆయనను కలుసుకోవడానికి ఇష్టపడుతారు. తన వయస్సు పెరుగుతున్నా, అభివృద్ధికోసం నాడు ఎంత కష్టపడ్డారో నేడు అదే విధంగా అమెరికా వీధుల్లో ఆయన తిరిగారు. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలు వచ్చేలా కృషి చేసినట్లే, నేడు కొత్త రాజధాని అమరావతిలో కూడా కంపెనీలు, పరిశ్రమలు రావాలని కష్టపడుతున్నారు. హైదరాబాద్‌కు అందించిన ఉజ్వల భవిష్యత్తు, నేటి అమరావతికి లభించాలని ఆయన కోరుకుంటున్నారు. అందుకోసం శ్రమను పక్కనపెట్టి నవ్యాంధ్రకు కావాల్సిన వాటికోసం అందరినీ కలుసుకుంటున్నారు. మరోవైపు రాష్ట్ర ఇమేజ్‌ను పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నారు. తమకోసం, తమ బిడ్డల భవిష్యత్తుకోసం దూరదృష్టితో ఆలోచించే ఆ దార్శనికునికి అభినందనలు తెలపడానికి వివిధ నగరాల్లో నుంచి ఎంతోమంది ఎన్నారైలు న్యూయార్క్‌, న్యూజెర్సిలో సమావేశమయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమెరికాకు ఎప్పుడు వచ్చినా అది జైత్రయాత్రే అవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం, ఆయనకు ఉన్న ఇమేజ్‌ అలాంటింది. ఎప్పుడు అమెరికాకు వచ్చిన ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సిన ప్రగతిని ఇక్కడ నుంచి పట్టుకుపోతారని అంటారు. అప్పుడు హైదరాబాద్‌ను ఐటీలో అభివృద్ధి చేస్తే నేడు అమరావతిని దానికన్నా మరోమెట్టు సాంకేతికతతో ఐఓటీ, నాలెడ్జ్‌ ఎకానమీలో కూడా తెలుగువాళ్ళు పట్టుసాధించేలా ఆయన కృషి చేస్తున్నారు.

ఇరవై ఏళ్ల క్రితం... నాడు అమెరికాలో ఫైళ్ళు పట్టుకుని అనేక కార్పోరేట్‌ కార్యాలయాలకు వెళ్లి హైదరాబాద్‌ లో ఐటీ సంస్థలను నెలకొల్పాలని బలపం కట్టుకుని తిరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చివరకు వారిని ఒప్పించి హైదరాబాద్‌లో ఐటీ సంస్థలు వచ్చేలా చేశారు. మైక్రోసాఫ్ట్‌ వంటి అంతర్జాతీయ ఐటీ సంస్థ అధిపతి బిల్‌ గ్రేట్స్‌ అపాయింట్‌ మెంట్‌ సంపాదించడమనే అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసుకుని... పది నిమిషాల సమయాన్ని తన వాగ్దాటితో గంటలు పెంచుకుని చివరకు తాను సాధించాలనుకున్నదానిని సాధించారు. నేడు హైదరాబాద్‌ లో ఐటీ పరిశ్రమ వేళ్ళూనుకునేలా పరిశ్రమించారు.

ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని అమరావతిని కూడా హైదరాబాద్‌, చెన్నై వంటి నగరాలకు కన్నా ధీటుగా నిలబెట్టాలని భావిస్తున్నారు. రాజధానే లేని రాష్ట్రానికి ఇన్వెస్టర్లు ఎలా వస్తారని ఎంతోమంది అనుకున్నప్పటికీ తన ఇమేజ్‌నే రాష్ట్ర బ్రాండ్‌గా మార్చుకుని ఇన్వెస్టర్లను ఆయన అమరావతికి తీసుకువస్తున్నారు. అభివృద్ధిని రాష్ట్రమంతటా పరుగులు పెట్టిస్తున్నారు. అందుకే ఎపికి ఆయన సన్‌రైజ్‌ స్టేట్‌గా మార్చుకున్నారు. లక్ష్యాలను సృష్టించుకుంటే అది ఎలా సాధించాలో తెలిసిన మనిషి కాబట్టే చంద్రబాబు అనతికాలంలోనే రాష్ట్రానికి ఇన్వెస్టర్లను రప్పించారు. రాష్ట్రం నలుమూలలా పరిశ్రమలు వచ్చేలా చేశారు. అభివృద్ధికి పెట్టుబడులే ప్రధానం కాబట్టి మలేషియా, సింగపూర్‌, జపాన్‌, చైనా, దావోస్‌, రష్యా, అమెరికా వంటి నగరాల్లో విస్తృతంగా పర్యటించి రాష్ట్రంలోని అనుకూలమైన పరిస్థితులను వారికి వివరించి పెట్టుబడులను తీసుకువచ్చారు. కియా, ఇసుజు, హీరో మోటార్స్‌, అశోక్‌ లేలాండ్‌, అపోలో టైర్స్‌, సియట్‌ టైర్స్‌, భారత్‌ పోర్డ్‌, టీవీఎస్‌, వీరా బస్‌బిల్డింగ్‌ వంటి పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయి.

తన వయస్సు 68 అయినా, తనకు కుటుంబం కన్నా నవ్యాంధ్ర ప్రగతే ముఖ్యమని అనుకున్న వ్యక్తి చంద్రబాబు. అందుకోసమే కాలికి బలపం కట్టుకుని మరీ ఆయన పెట్టుబడులకోసం అందరినీ వెంట పడుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని, దేశంలోకెల్లా అభివృద్ధిని సాధించిన రాష్ట్రంగా ఎపి నిలవాలని ఆయన ఆశిస్తున్నారు. తన నాలుగైదురోజుల అమెరికా పర్యటనలో కూడా నవ్యాంధ్రకు పరిశ్రమలు రప్పించాలని ఆయన కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రైతుల ఘనతను చాటేలా ఐక్యరాజ్యసమితి వేదికపై నుంచి కూడా ప్రకృతి సేద్యంపై రాష్ట్రం చేస్తున్న కార్యక్రమాలను అందరికి తెలియజేశారు. ప్రపంచ ఆర్థిక వేదికతో కలిసి రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, అభివృద్ధిపై నివేదికను ఆవిష్కరించారు. ఎంతోమంది కంపెనీల సిఇఓలతో, ఇతర ప్రముఖులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమవుతున్నారు.

మన్‌హాటన్‌లో వర్షం కురుస్తున్నప్పటికీ కొద్ది దూరంలో ఉన్న ప్రపంచ ఆర్థికవేదిక కార్యాలయానికి ముఖ్యమంత్రి నడిచి వెళ్ళారు. ఆయనతోపాటు ఎపిఇడిబి చైర్మన్‌ కృష్ణకిషోర్‌, మరో ఇడిబి అధికారి, సిఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ సాయి ప్రసాద్‌, ఐఎఎస్‌ కూడా ముఖ్యమంత్రితోపాటు ఆ చిరుజల్లులో మరో ఆఫీసుకు గొడుగు వేసుకుని బయలుదేరారు. ముఖ్యమంత్రి విజన్‌ సాధనలో అధికారులు, ఎపిఇడిబి కూడా ముందుంటోందనడానికి ఈ ఫోటోనే నిదర్శనం.

 

Tags :