ఎన్టీఆర్ కు చంద్రబాబు నివాళి
తెలుగుదేశం వ్యవస్థాపకుడు శ్రీ నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ కలలను నిజంచేయటమే ఆయనకు సముచిత నివాళి అన్నారు. రామారావు చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లో అధికారానికి తెచ్చి నూరేళ్ల చరిత్రకలిగిన కాంగ్రెస్‌ను ఓడించిన మహానాయకుడని అన్నారు. ఎన్టీ రామారావు తెలుగుతేజాన్ని ప్రపంచవ్యాప్తం చేశారని, తెలుగువారికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు.
సమాజమే దేవాలయంగా, ప్రజలే దేవుళ్ళుగా భావించిన ఎన్టీఆర్ ప్రజలు ఆకలితో అలమటించకూడదన్న ఆశయంతో కిలో బియ్యం రూ.2 పథకాన్ని అమలుచేశారని అన్నారు. దేశంలో తొలిసారిగా పేదలకు పక్కాఇళ్లు నిర్మించిన ఘనత ఎన్టీరామారావుదేనని చంద్రబాబు గుర్తుచేశారు. కార్యక్రమంలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు డా.పరకాల ప్రభాకర్, ఎంపీ సి యం రమేష్, తెలుగుదేశం యూరోప్ విభాగం అధ్యక్షుడు జయకుమార్ గుంటుపల్లి తదితరులు పాల్గొన్నారు.