ASBL Koncept Ambience

అదే ఉత్సాహం...అదే అభిమానం... అమెరికాలో చంద్రబాబుకు తగ్గని క్రేజీ

అదే ఉత్సాహం...అదే అభిమానం... అమెరికాలో చంద్రబాబుకు తగ్గని క్రేజీ

(చెన్నూరి వెంకట సుబ్బారావు)

యునైటెడ్‌ నేషన్స్‌ ఆధ్వర్యంలో జరిగే వ్యవసాయ సదస్సులో పాల్గొనేందుకోసం అమెరికాకు వచ్చిన చంద్రబాబు నాయుడుకు ఘనస్వాగతం లభించింది. గతంలో కూడా చాలాసార్లు అమెరికాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈసారి కూడా అదేవిధమైన ఉత్సాహంతో, అదే అభిమానంతో ఎన్నారై తెలుగువాళ్ళు, ఎన్నారై టీడిపి సభ్యులు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి పర్యటన ఖరారైనప్పటి నుంచే ఎన్నారై టీడిపి, ఎపిఎన్‌ఆర్‌టీతోపాటు తెలుగు సంఘాలైన తానా, నాట్స్‌ వంటివి ముఖ్యమంత్రి స్వాగత ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. నెవార్క్‌ లో ముఖ్యమంత్రితో ఏర్పాటు చేసిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ సమావేశంను విజయవంతం చేసేందుకు ఎన్నారై టీడిపి అభిమానులు, చంద్రబాబు అభిమానులు, నందమూరి అభిమానులు వారంరోజులకుపైగా నిర్విరామంగా శ్రమించారు. కొద్దినెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న సమావేశం కావడం, ఎన్నారైలకు ఓటుహక్కు లభించిన నేపథ్యంలో వారిని ఆకట్టుకునేందుకు లభించిన అవకాశంగా కూడా ఎన్నారై టీడిపి నాయకులు భావించడంతో ఈ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఎంతోమంది అహోరాత్రులు శ్రమించారు. ఎపిఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు రవి వేమూరు, అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్‌ కోమటి, తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ జే తాళ్ళూరి, నాట్స్‌ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహనకృష్ణ, కలపటపు బుచ్చి రామ్‌ ప్రసాద్‌ తదితరులు ఈ సమావేశం విజయవంతమయ్యేందుకు తమవంతు కృషి చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎన్నారైలను ఆకట్టుకునేలా తన ప్రసంగాన్ని తయారు చేసుకున్నారు. ఎన్నారైలకు తాను చేసిన కార్యక్రమాలను వివరించడంతోపాటు వారు రాష్ట్రానికి కూడా సేవలందించడానికి ఉన్న అవకాశాలను తెలియజేశారు. తన ప్రసంగం ద్వారా వారిని ప్రోత్సహించారు. కర్తవ్యోన్ముఖులను చేశారు. జ్యూయిష్‌ కమ్యూనిటీలాగా తెలుగువాళ్లు కూడా కష్టపడే మనస్థత్వాన్ని కలిగి ఉన్నారని అంటూ ఆ కష్టపడే మనస్థత్వమే నేడు ప్రపంచంలోని చాలా దేశాల్లో తెలుగువాళ్ళ ఉనికిని ప్రపంచానికి చాటుతోందని చంద్రబాబు తన ప్రసంగంలో పేర్కొన్నారు. 

ఒకప్పుడు తాను మైక్రోసాఫ్ట్‌ ఆఫీసును హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు పడ్డ కష్టాన్ని వివరిస్తూ, నేడు అదే మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌కు తెలుగువాడు బాస్‌గా ఉండటం మన తెలివితేటలకు నిదర్శనమన్నారు. తెలుగువారంతా వ్యవసాయ రంగంలోనే కాదు, నాలెడ్జి ఎకానమీలోనూ ముందుకు రావాలని తాను ఆశించానని దానికి ఏం చేయాలన్న దానిపై ఆరోజు అమెరికాలోని ప్రవాస తెలుగువారితో సమాలోచనలు జరిపానని చెప్పారు. నాలెడ్జి ఎకానమీకి జ్ఞాపక చిహ్నంగా సైబర్‌ టవర్స్‌ను హైదరాబాద్‌లో నిర్మించాను. ఇరవై ఏళ్ల క్రితం ఇదే రోజు సైబర్‌ టవర్స్‌ను ప్రారంభించిన విషయాన్ని ఆయన తన ప్రసంగంలో గుర్తు చేసుకున్నారు. నాలెడ్జి ఎకానమీ స్థాపనలో భాగంగా 30 ఇంజినీరింగ్‌ కాలేజీలు కూడా లేని రోజుల్లో 300కు పైగా ఇంజినీరింగ్‌ కాలేజీలు ఏర్పాటయ్యేలా అనుమతులు తీసుకువచ్చి, ఆనాడు వందల సంఖ్యలో ఇంజినీరింగ్‌ కళాశాలలు నెలకొల్పడంతో యువతలో ఇంజనీరింగ్‌ ప్రతిభ పెరిగిందని, అవకాశాలు వారికి లభించాయని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ ను ఐటీ రంగంలో అభివృద్ధిపరిచేందుకు గతంలో తాను అమెరికా వచ్చి పదిహేను రోజులు ఉండి, పెద్ద పెద్ద ఐటీ కంపెనీల సీఈఓలతో, పారిశ్రామిక వేత్తలతో భేటీ అయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు, మా దగ్గర మానవ వనరులున్నాయి. మీరు వచ్చి కంపెనీలు పెట్టండి అని కోరడంతోపాటు, వారు కంపెనీలు పెట్టేలా వారిని ఒప్పించగలిగానని. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ అపాయింట్‌మెంట్‌ అడిగితే, రాజకీయ నాయకులతో తనకేమీ పనిలేదని అన్నారని, కానీ నేను మీతో నాకు పని ఉందని పది నిమిషాలు అవకాశం ఇవ్వాలని కోరగా చివరికి అంగీకరించారని, ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగ అభివద్ధికి అవకాశాలు, మౌలిక సదుపాయాలపై నేనిచ్చిన ప్రజెంటేషన్‌ 45 నిమిషాలపాటు కొనసాగింది. ఈ ప్రజంటేషన్‌ బిల్‌గేట్స్‌ను ఆకట్టుకుంది. అలా హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌ తరలివచ్చిందని చంద్రబాబు వివరించారు.  ఐటీ విప్లవ ఫలాలు అందుకుని మీరు ఇక్కడికి వచ్చి ఎదిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మీరు మనుగడ సాగించే సామర్ధ్యాన్ని, నైపుణ్యాన్ని సంపాదించారు. దానికితోడు ఎక్కడైనా సర్దుకుపోగలిగే అడాప్టబిలిటీ చాలా ఉంది కాబట్టే అన్నీ దేశాలు మిమ్ములను స్వాగతిస్తున్నాయని చెప్పారు. మీరు లభించిన ఉద్యోగంతోనే సంతృప్తి చెందకూడడని, పదిమందికి ఉపాధిని కల్పించేలా  ఎదగాలి. ఎంట్రప్రెన్యూరర్‌గా ప్రతి తెలుగువాడు కనిపించాలన్నదే తన తపన అని చెప్పారు. దానికోసం మీరంతా శ్రమించండి. అదే సమయంలో ప్రపంచంలో అనేక పెద్దపెద్ద కంపెనీలు తాము సంపాదించిన డబ్బును తిరిగి చారిటీ ద్వారా సమాజానికి ఇస్తున్నాయి, ఇదే విధంగా ఎన్నారైలు కూడా విదేశాల్లో ఉన్నప్పటికీ జన్మభూమిని మరవకుండా జన్మభూమి, కర్మభూమి అభివృద్ధికి కృషి చేయండని కోరారు. 

అమెరికాలో ఉండే ప్రతి తెలుగువాడు నా రాష్ట్రానికి, నా ఊరుకు నేనేం చేయగలను అని ఆలోచిస్తే.. ఆంధ్రప్రదేశ్‌ మరింతగా ప్రగతి పథంలోకి దూసుకుపోతుందన్నారు. అమెరికాలో ఉండే తెలుగువారంతా తెలుగు రాష్ట్రాల అభివద్ధిలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మీ శక్తి, సామర్థ్యాలు, తెలివితేటలు కొంతైనా స్వరాష్ట్రానికి ఉపయోగపడాలన్నదే తన కోరిక అని అంటూ,  ఆంధ్రప్రదేశ్‌ లో రియల్‌ టైమ్‌ గవర్నన్స్‌ ద్వారా పాలనలో సాంకేతికతను తీసుకొచ్చి.. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయగలిగానని అందులో మీరు పాల్గొంటే ఆంధ్రప్రదేశ్‌ కోసం ఇక్కడ నుంచే కూడా మీరు ఎన్నో అద్భుతాలు చేయవచ్చని చెప్పారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉందని... పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనువైన రాష్ట్రంగా గుర్తింపును కూడా పొందిందని చంద్రబాబు తెలిపారు.

జన్మభూమి రుణం తీర్చుకునే తరుణం మీకు వచ్చిందని.. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొండంత అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మీ సొంత ఊరిలో  పెట్టుబడి పెట్టి.. ఆ ఊరి అభివద్ధికి కూడా దోహదపడవచ్చన్నారు.   ప్రజాసేవ చేయాలని కోరుకునే ఎన్నారై తెలుగువారికి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తామని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దూరం అనేది సమస్య కాదని, రాష్ట్రంలో నివసిస్తున్న తెలుగువారు ప్రభుత్వానికి ఎలా సహకరిస్తున్నారో ఎన్నారై తెలుగువాళ్ళు కూడా అదే తరహాలో సహకారం అందించవచ్చని చెప్పారు. రాష్ట్రంలో అన్ని శాఖల సమాచారం ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులో ఉంచామని, దాని ద్వారా ఎవరు ఏవిధంగా-ఎంతమేరకు సాయం చేయవచ్చనే దానిపై స్పష్టత ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. సొంత గ్రామానికి ఏం చేయాలో ఆలోచించాలని సూచించిన ముఖ్యమంత్రి, ఆ ఆలోచనలను గ్రామస్తులతో పంచుకోవాలని, 'గ్రామదర్శని-వార్డుదర్శని'కి చేయూత ఇవ్వాలని కోరారు. విజ్ఞానాన్ని గ్రామాభివద్ధికి దోహదపడేలా కషి చేయడమే కాకుండా, సమస్యల పరిష్కారానికి కూడా ప్రతి ఒక్కరూ వినూత్నంగా ఆలోచించాలన్నారు.

ఎన్నారై తెలుగువారు రెండు విషయాలు ముఖ్యంగా గుర్తుంచుకోవాలని.. అవి ఒకటి కష్టపడి పనిచేయడం, రెండోది జన్మభూమిని మరచిపోకుండా ఉండటమని చెప్పారు.

ప్రవాస భారతీయులందరికీ ఓటు హక్కు లభించింగది. అంచేత అందరూ ఓటు హక్కును వినియోగించుకుని తెలుగుదేశం పార్టీని మరోసారి గెలిపించేందుకు ముందుకురావాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీపైనా అభిమానం ఉండే ప్రతిఒక్క వ్యక్తి రియల్‌ టైంలో తెలుగుదేశం పార్టీ ఎన్‌ఆర్‌ఐ వింగ్‌లో చేరి అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వాలి. దాని ద్వారా ప్రభుత్వం మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలు ఉంటుందని చెప్పారు.

మొత్తం మీద చంద్రబాబు నాయుడు సమావేశం అందరినీ ఆకట్టుకునే విధంగా సాగింది.

Click here for Event Gallery

Tags :