ASBL Koncept Ambience

తెలుగుజాతి ప్రపంచానికే ఆదర్శం కావాలి

తెలుగుజాతి ప్రపంచానికే ఆదర్శం కావాలి

శాన్‌హోజ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తేజభరిత ప్రసంగం

తెలుగువారు ఒక్కొక్కరు ఒక్కో బాహుబలి కావాలని, తెలుగుజాతి ప్రపంచానికే ఆదర్శం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఇవాళ ప్రపంచం మొత్తం ఎక్కడా చూసినా తెలుగువాళ్లు ఉన్నారని, తెలుగు జాతికి కష్టపడే తత్వం, ఎక్కడైనా పనిచేయగల సామర్ధ్యం వుందని అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా నాలుగో రోజు శాన్‌హోజ్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి అక్కడ ప్రవాస తెలుగువారి సమావేశంలో పాల్గొని ఉత్తేజ భరితంగా ప్రసంగించారు. 

అమెరికాలో ఇంతమంది తెలుగువారిని చూస్తుంటే అమరావతిలో ఉన్నానో, అమెరికాలో ఉన్నానో తెలియడం లేదని ముఖ్యమంత్రి సరదాగా సంభాషించారు. ప్రపంచాన్ని జయించవచ్చని తెలుగువాళ్లు నిరూపించారని, తెలుగు జాతికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. తెలుగు బిడ్డ రాజమౌళి బాహబలి వంటి బ్రహ్మాండమైన సినిమా తీశారని, ప్రపంచం మొత్తం 9 వేల థియోటర్లలో సినిమాను పదర్శించడం గర్వకారణమని, రాజమౌళిని చూస్తే తెలుగువాడి సత్తా తెలుస్తోందని అన్నారు. ప్రతి తెలుగువారు కొత్తగా ఆలోచించి నూతన ఆవిష్కరణలు చేయాలని, ఉక్కు సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని పిలుపునిచ్చారు. 

నిజాం చార్మినార్ కట్టిస్తే, ఎన్టీఆర్ బుద్దుడి విగ్రహం పెట్టించారని, తాను హైటెక్ సిటీ నిర్మించానని ముఖ్యమంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చరిత్రలో కొన్ని ఇబ్బందులు వచ్చాయని, రాజధానులు మారుతూ వచ్చామని, విభజన కొత్త సమస్యలు తెచ్చి పెట్టిందని అన్నారు. కష్టాలు తాత్కాలికమే అన్న ముఖ్యమంత్రి వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం, సహజ వనరులు, సృజనశీలురైన మానవ వనరులు మన సొంతమన్నారు. ఒంగోలు గిత్తలు మన బలం-కూచిపూడి మన ఘన వారసత్వంగా చెప్పారు. 

సమస్యలు వున్నా అబివృద్ధి-సంక్షేమానికి పెద్దపీట వేశామన్న ముఖ్యమంత్రి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు మీలో కొందరు తోడ్పాటు అందించడం శుభ పరిణామంగా పేర్కొన్నారు. ఆంద్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేసి తీరతామని చెప్పారు. నదుల అనుసంధానం గురించి ఎన్నో ఏళ్లుగా మాట్లాడుతున్నా, దాన్ని మనమే సాధ్యం చేశామన్నారు. 

స్వల్పకాల, దీర్ఘకాల లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. వీధుల్లో ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామని, ఫైబర్ గ్రిడ్ ఒక వినూత్న ఆలోచన అంటూ ప్రభుత్వ విజయాలను వివరించారు. మహిళలు పురుషులు సమానంగా పని చేయాలి, సమంగా సంపాదించాలి అనే ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశామన్నారు. అవకాశాలు ఇస్తే మగవారికంటే ఆడవాళ్లు మరింత రాణించగలరని చెప్పారు. మహిళా సాధికారత కోసం తాము ఎంతో కృషి చేస్తున్నామని, 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని వెల్లడించారు. 

ప్రపంచంలోని ఐదు అత్యున్నత నగరాల్లో అమరావతి ఒకటిగా ఉండేలా, ప్రపంచమే గర్వపడేలా అమరావతి రాజధాని నిర్మాణం చేసుకోవాల్సి వుందని అన్నారు. 2050కి కాలిఫోర్నియాతో పోటీ పడే అమరావతి రూపుదాల్చడం తథ్యమని చెప్పారు. రాజధాని నిర్మాణానికి డబ్బుల్లేవు కానీ ప్రపంచశ్రేణి నగరం నిర్మించాలన్న పట్టుదల, సంకల్పం ఉందన్నారు. రాజధాని ముహూర్త బలం బాగుందని, అమరావతి నగరం భావితరాలకు మనమిచ్చే ఒక కానుకగా చెప్పారు. రాజధాని నిర్మించే అరుదైన, అపురూప అవకాశం తనకు లభించిందని, అమరావతి నిర్మాణానికి మీ అందరి సహకారం ఆశిస్తున్నానని అన్నారు. 

సిస్కో చైర్మన్ జాన్ ఛాంబర్‌తో పరిచయం 20 ఏళ్లుగా కొనసాగుతోందని, అలాగే బిల్‌గేట్స్‌ను ఒప్పించి మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చేలా కృషి చేశానని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఇక్కడ ఐటీ ఉద్యోగాలతో మీరు సరిపెట్టుకోకుండా అత్యధిక శాతం మంది పారిశ్రామికవేత్తలుగా ఎదిగారంటూ ప్రవాస తెలుగువారిని కొనియాడారు. ఇప్పటికే మీరంతా ఒక స్థాయికి చేరుకున్నారని, తర్వాత దశకు ఎదగాలని అభిలషించారు. మీరు సంపాదించిన దాంట్లో కొంత రాష్ట్రాభివృద్ధికి ఖర్చు చేయాల్సిందిగా కోరారు. 
చరిత్ర వున్నంత వరకు తెలుగువారి గుండెల్లో నిలిచే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటారని ముఖ్యమంత్రి కీర్తించారు. ప్రఖ్యాత కోహినూర్ వజ్రం తెలుగు గడ్డ నుంచే వచ్చిందన్న విషయం మనందరికీ తెలుసని, అయితే అది దేశం దాటి పోయినా ఒక్కొక్కరని ఒక్కో కోహినూర్ వజ్రంగా తీర్చిదిద్దే సత్తా మనకుందన్నారు. 

   తొలుత ఎన్నారై టీడిపి తరపున వెంకట్‌ కోగంటి మాట్లాడుతూ,  ఆంధ్రుల ఆరాధ్యదైవం ఎన్టీఆర్‌ను స్మరించుకుంటూ, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధే ధ్యేయంగా, సంక్షేమమే శ్వాసగా నిరంతరం శ్రమిస్తూ ముందుకెళుతున్న చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు.

విజన్‌ ఉన్న నాయకుడు చంద్రబాబు - జయరామ్‌ కోమటి

   ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి మాట్లాడుతూ, బే ఏరియాలో మనం ఇక్కడ స్థిరపడటానికి ముఖ్య కారకులు చంద్రబాబు నాయుడే అని ఆయన ఆనాడు తీసుకున్న పాలనా సంస్కరణలు, ఇచ్చిన స్ఫూర్తే కారణమని చెప్పారు. సిలికాన్‌వ్యాలీలో నేడు సాంకేతిక నిపుణుల్లో తెలుగువాళ్ళు కనిపిస్తున్నారంటే అందుకు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు చేసిన కృషి, సంస్కరణలే కారణమని చెప్పారు.

   భారతదేశంలో ఏ ప్రభుత్వం గుర్తించని విధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇక్కడి తెలుగువారిని గుర్తించడంతోపాటు, ఎపి అభివృద్ధిలో మనం పాలుపంచుకునే విధంగా మనకు మూడు క్యాబినెట్‌ పదవులు ఇవ్వడం వ్యక్తిగతంగా నాకు కాదు, రవి, ఆనంద్‌కు కాదు అది మనందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన గుర్తింపు అది. ఇక్కడ గుజరాతీలు, పంజాబీలు, తమిళులు ఇలా ఎన్నా రాష్ట్రాలవారు ఉన్నా, వారందరికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతటి గుర్తింపును ఇవ్వలేదు. ఈ విషయాన్ని తెలుగువాళ్ళు గుర్తించాలి.     

     విజన్‌ ఉన్న నాయకుడు చంద్రబాబు నేడు ఆంధ్రప్రదేశ్‌ను అన్నీ విధాలా ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నారు. మన అవసరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ఉంది. మనకు ఇంతకు గుర్తింపును తీసుకువచ్చిన రాష్ట్రాన్ని ఇప్పుడు అభివృద్ధి చేయడంలో, ముందుకు తీసుకెళ్ళడంలో మనం ముండడుగు వేయాల్సిన అవశ్యకత వచ్చింది. చంద్రబాబు నిర్మించాలనుకున్న ప్రతిష్టాత్మక రాజధాని నిర్మాణంలో, అభివృద్ధిలో మనమంతా సహకరిద్దాం. ముఖ్యమంత్రి కోరుకున్నట్లుగానే రాష్ట్ర నిర్మాణంలో ఎన్నారైలు ముందుండాలని జయరామ్‌ కోమటి పిలుపునిచ్చారు.

కాలిఫోర్నియాకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు ముఖ్యమంత్రితో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. శాన్‌హోజ్ మేయర్ సామ్ లికార్డో(Sam Licardo), కాంగ్రెస్ ప్రతినిధి రో ఖన్నా(Ro Khanna), సెనేటర్ బాబ్ వెల్ కౌస్కీ(Bob Welcowsky), అసెంబ్లీ సభ్యులు కాన్సాన్ చు(Kansan Chu), ఆష్ కల్రా(Ash Kalra) ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వున్నారు.

ముఖ్యమంత్రి బృందంలో ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి గుట్టుపల్లి సాయిప్రసాద్, ఆర్థిక అభివృద్ధి మండలి కార్యనిర్వాహక అధికారి జాస్తి కృష్ణకిశోర్, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఐటీ ముఖ్య కార్యదర్శి కావేటి విజయానంద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సోల్మన్ ఆరోఖ్యరాజ్ వున్నారు.

 

Click here for Photogallery

 

Tags :