చంద్రబాబు అమెరికా పర్యటన ఫలప్రదం
అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతమైంది. చికాగోకు బుధవారం ఉదయం వచ్చిన ముఖ్యమంత్రికి ఘనస్వాగతం లభించింది. ఎన్నారై టీడిపి అభిమానులు, తెలుగు ప్రముఖులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి, తానా అధ్యక్షుడు సతీష్ వేమన, ప్రెసిడెంట్ ఎలక్ట్ జే తాళ్ళూరి, ఐటీ సర్వ్ ప్రతినిధులు ప్రసాద్ గారపాటి ఇతరులు ఆయనకు ఘనస్వాగతం పలికినవారిలో ఉన్నారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయి ప్రసాద్, ఈడిబి సిఇఓ జాస్తి కృష్ణ కిశోర్ ఉన్నారు.
పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పలు సమావేశాల్లో ప్రసంగించారు. ఐటీ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి, ఆయన బృందం సభ్యులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి దాదాపు 80కిపైగా ఐటీసంస్థల ప్రతినిధులు వచ్చారు. ఐటీ సిటిపై ఐటీ టాస్క్‌ఫోర్స్ చైర్మన్ ప్రసాద్ గారపాటి చంద్రబాబుకు ప్రజంటేషన్ ఇచ్చారు. విశాఖను మెగా ఐటీ సిటీగా, అమరావతిని మేజర్ ఐటీ హబ్‌గా మార్చేందుకు అవసరమైన ప్రతిపాదనలు చేశారు. ఈ సందర్భంగా ఎపిలో తమ సంస్థల ఏర్పాటునకు 450 మంది ఎన్నారైలు ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడించారు. తరువాత ముఖ్యమంత్రి అయోవా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. అయోవా యూనివర్సిటీల భేటీల తరువాత పయనీర్ పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొన్నారు. తన పర్యటనలో భాగంగా వివిధ కంపెనీల సిఇఓలు, సిఎక్స్‌వోలతో జరిగిన లంచ్ మీటింగ్ కూడా ఫలప్రదమైనట్లు చంద్రబాబు బృందం తెలిపింది.