ASBL Koncept Ambience

భారతీయులుగా ఈ పోరాటం చేద్దాం : వైఎస్ జగన్

భారతీయులుగా ఈ పోరాటం చేద్దాం : వైఎస్ జగన్

మనుషులుగా వేరుగా ఉంటూ మనసులు ఒక్కటిగా కరోనాపై పోరాడాల్సిన సమయం ఇది. భారతీయులుగా ఈ పోరాటం చేద్దాం. ఢిల్లీలో జరిగిన సదస్సుకు అనేక ప్రాంతాల నుంచి, అనేక దేశాల నుంచి ఆధ్యాత్మిక ప్రతినిధులు హాజరయ్యారు. అందులో విదేశీ ప్రతినిధులకు కోరనా ఉండటంతో మన దేశస్థులకు, మన రాష్ట్రం వారికి ఆది సోకడం దురదృష్టకరం. ఏ మతానికి సంబంధించిన కార్యక్రమంలోనైనా ఇలా జరగవచ్చు. దీన్ని ఉద్దేశపూర్వక సంఘటనగా చూడకూడదు. ఒక మతానికో, ఒక కులానికో ఆపాదించి వారు తప్పు చేసినట్లుగా, నేరం చేసినట్లుగా చూపకూడదు. అలాంటి ప్రయత్నమూ చేయకూడదు. ఫలానా మతం వారిపై  ముద్ర వేసేందుకు దీన్ని వాడుకోకూడదు అని ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ మోహన్‍ రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా కాటుకు మతం, కులం, ప్రాంతం, ధనిక, పేద తేడాలు లేవన్నారు. దేశాల అంతరం కూడా లేదని చెప్పారు. ఈ యుద్ధంలో మన ప్రత్యర్థి మన కంటికి కనిపించని కరోనా అనే వైరస్‍ అని, దానిపై ఐక్యంగా మనుషులందరం పోరాడుతున్నామని ప్రపంచానికి చాటి చెబుదామని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు.

ఏ మతానికి సంబంధించిన కార్యక్రమంలోనైనా ఇలా జరగవచ్చు. రవిశంకర్‍ ఆర్ట్ ఆఫ్‍ లివింగ్‍ కార్యక్రమం లోనో, జగ్గీ వాసుదేవ్‍ ఈషా ఫౌండేషన్‍లోనో, మాతా అమృతానందమయి. పాల్‍ దినకరన్‍ లేదా జాన్‍ వెస్లీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చు. ఎవరికైనా ఈ పరిస్థితి రావచ్చు. ఎక్కడైనా జరగవచ్చు. ఎక్కడ ఇలా జరిగినా దీన్ని ఉద్దేశపూర్వక ఘటనగా చూడటం, కావాలని తప్పు చేసినట్లు చూపేందుకు ప్రయత్నించడం సరికాదు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరిపై ముద్ర వేసేందుకు చేసే ప్రయత్నాలు దురదృష్టకరం. మనమంతా ఒక్కటిగా ఉన్నామని చెప్పేందుకు ఇవి ఉపకరించవు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Tags :